Chinmayi Sripaada : ఫొటోలు పెట్టకపోతే.. సరోగసీనా?!

అందం, అంతకుమించి మధురమైన గాత్రంతో సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ పేజీ లిఖించుకుంది గాయని చిన్మయీ శ్రీపాద. ఇలా సింగర్‌గానే కాదు.. మహిళా అంశాలపై ఎక్కువగా స్పందిస్తూ.. తన మనసులోని భావాల్ని నిర్మొహమాటంగా.....

Published : 23 Jun 2022 14:19 IST

(Photos: Instagram)

అందం, అంతకుమించి మధురమైన గాత్రంతో సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ పేజీ లిఖించుకుంది గాయని చిన్మయీ శ్రీపాద. ఇలా సింగర్‌గానే కాదు.. మహిళా అంశాలపై ఎక్కువగా స్పందిస్తూ.. తన మనసులోని భావాల్ని నిర్మొహమాటంగా పంచుకుంటుందామె. వివక్ష, విమర్శల్ని ఎదుర్కొనే సాటి మహిళలకు అండగా నిలుస్తుంటుంది. అలాంటిది తననెవరైనా అకారణంగా పల్లెత్తు మాట అంటే ఊరుకుంటుందా? తనదైన శైలిలో స్పందిస్తూ సదరు వ్యక్తికి చురకలంటిస్తుంది. తాజాగా అలాంటి ఓ సంఘటనే సోషల్‌ మీడియా వేదికగా చోటుచేసుకుంది. ఎప్పటిలాగే తనపై కామెంట్‌ చేసిన వ్యక్తికి సున్నితంగానే బుద్ధి చెప్పిందీ ట్యాలెంటెడ్‌ సింగర్‌.

గాయనిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది చిన్మయి. కెరీర్‌లో బిజీగా ఉన్న తరుణంలోనే 2014లో నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ను ప్రేమ వివాహం చేసుకున్న ఆమె.. ఎన్నోసార్లు మహిళా అంశాలపై నిర్మొహమాటంగా, నిర్భయంగా తన గళాన్ని వినిపించింది. ముఖ్యంగా ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా తనదైన పాత్ర పోషించింది.. అంతేకాదు.. సోషల్‌ మీడియాలో ఎదురయ్యే కామెంట్లకూ తనదైన రీతిలో స్పందిస్తుంటుంది చిన్మయి.

అమ్మనయ్యా!

అయితే తన వ్యక్తిగత జీవితంలో మరో మెట్టు ఎక్కిందీ అందాల గాయని. తాజాగా అమ్మగా ప్రమోషన్‌ పొందింది. ద్రిప్తా, శార్వాస్‌.. అనే కవల పిల్లల(పాప, బాబు)కు జన్మనిచ్చిన ఆమె.. ఈ శుభవార్తను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘ద్రిప్తా, శార్వాస్‌.. ఈ చిన్నారులిద్దరూ మా ప్రపంచంలోకి అడుగుపెట్టి మా జీవితాలను పరిపూర్ణం చేశారు..’ అంటూ ఇద్దరు పిల్లల బుజ్జి బుజ్జి చేతులతో కూడిన ఫొటోలను పంచుకుంది చిన్మయి. ఇలా ఒక్కసారిగా తాము తల్లిదండ్రులమయ్యామని ఈ దంపతులిద్దరూ సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో అందరూ ఒకింత ఆశ్చర్యపోయారు. ఆపై సెలబ్రిటీలు, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

అది వాళ్లకు మాత్రమే తెలుసు!

అయితే ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘ప్రెగ్నెన్సీ ఫొటోలు పెట్టలేదంటే సరోగసీ ద్వారా జన్మనిచ్చారా?’ అనే ఉద్దేశంతో కామెంట్‌ చేశారు. దీంతో ఈ కామెంట్‌కు తనదైన రీతిలో జవాబిచ్చిందీ అందాల గాయని. ‘గర్భంతో ఉన్న ఫొటోలు పెట్టకపోవడం వల్ల నేను సరోగసీ పద్ధతిలో నా బిడ్డలకు జన్మనిచ్చానేమోనని కొంతమంది అనుకుంటున్నారు. నా ప్రెగ్నెన్సీ విషయం కేవలం నా సన్నిహితులు, కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు.. కావాలనే దీన్ని నా వ్యక్తిగతంగా, గోప్యంగా ఉంచాలనుకున్నా. ఇందుకు తగ్గట్లే నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు వ్యవహరించారు. నా పిల్లల ఫొటోల్ని కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయకూడదనుకుంటున్నా. మీకు మరో విషయం తెలుసా.. నాకు సిజేరియన్‌ జరిగే సమయంలోనూ భజన పాటలు పాడుతూ.. నా చిన్నారుల్ని ఈ లోకంలోకి ఆహ్వానించా. నేను గర్భం ధరించానని చెప్పడానికి ఇది చాలనుకుంటా..’ అంటూ తనపై కామెంట్‌ చేసిన వారికి సున్నితంగానే చురకలంటించింది చిన్మయి. ప్రస్తుతం ఆమె పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ‘మహిళలపై కామెంట్‌ చేసే వారికి బాగా బుద్ధి చెప్పారం’టూ ఆమెను ప్రశంసిస్తూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్