డేటింగ్ వెబ్‌సైట్లు చూస్తూ.. నన్ను దూరం పెడుతున్నాడు!

నా వయసు 39. మా పెళ్లై 12 ఏళ్లవుతోంది. మాకు స్కూల్‌కు వెళ్లే ఇద్దరు పిల్లలున్నారు. మొన్నటి వరకు మా దాంపత్యం సాఫీగానే సాగింది. కానీ, ఈ మధ్య కాలంలో నా భర్త ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. చిన్న చిన్న విషయాలకే నా మీద చిరాకు పడుతున్నాడు.

Published : 10 Jun 2024 13:12 IST

నా వయసు 39. మా పెళ్లై 12 ఏళ్లవుతోంది. మాకు స్కూల్‌కు వెళ్లే ఇద్దరు పిల్లలున్నారు. మొన్నటి వరకు మా దాంపత్యం సాఫీగానే సాగింది. కానీ, ఈ మధ్య కాలంలో నా భర్త ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. చిన్న చిన్న విషయాలకే నా మీద చిరాకు పడుతున్నాడు. పిల్లలపై కూడా తరచూ అరుస్తున్నాడు. అంతేకాదు.. అడిగితే కానీ శృంగారానికి ఆసక్తి చూపడం లేదు. అప్పుడప్పుడూ అలసిపోయానని సాకులు చెబుతూ కలయికను దాటేస్తున్నాడు. ఆయన నాకు ఇంటి పనుల్లో కూడా సహాయం చేయడు. ఈ మధ్య నా భర్త ఆన్‌లైన్‌ డేటింగ్‌ సైట్లు చూడడం గమనించాను. కొంతమంది పరిచయం లేని అమ్మాయిలతో చాటింగ్‌ కూడా చేశాడు. దీనివల్లే అతని ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయని అనిపిస్తోంది. ఈ విషయం గురించి నిలదీస్తే నా మీద కోపంతో ఊగిపోయాడు. అంతేకాదు.. అతని వ్యక్తిగత సమయాన్ని నేను హరిస్తున్నానంటున్నాడు. ఇంతకుముందు తనని ఎప్పుడూ ఇలా చూడలేదు. కానీ, ఇప్పుడు మా మధ్య దూరం క్రమంగా పెరుగుతున్నట్టు అనిపిస్తోంది. ఈ పరిస్థితి నుంచి నేనెలా బయటపడాలి? తిరిగి దాంపత్య బంధాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? - ఓ సోదరి

జ. దీర్ఘకాలం పాటు కొనసాగే అనుబంధంలో దంపతులిద్దరికీ కొన్ని కచ్చితమైన బాధ్యతలుంటాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించకూడదు. కానీ ప్రస్తుతం పెరిగిపోయిన టెక్నాలజీ కారణంగా కొంతమంది ఆలోచనల్లో విపరీతమైన మార్పులు కనిపిస్తున్నాయి. పని రీత్యా లేదంటే టైమ్‌పాస్‌ కోసమో ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లో గడపడం వల్ల వారి ఆలోచనలు దారి మళ్లుతున్నాయి. మీ భర్తలోనూ ఇలాంటి మార్పులే కనిపిస్తున్నాయి. ఇంతకు ముందెన్నడూ మీ భర్తను ఇలా చూడలేదని చెబుతున్నారు. అలాగే మీది 12 ఏళ్ల దాంపత్య బంధం అని అంటున్నారు. కాబట్టి, మీరు ఒకసారి సానుకూల వాతావరణంలో అతనితోనే నేరుగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు, పిల్లలు పడుతోన్న ఇబ్బందులను అతనికి వివరించే ప్రయత్నం చేయండి. ఇంతకుముందు మీరిద్దరూ వేసుకున్న భవిష్యత్తు ప్రణాళికలను గుర్తు చేయండి. దీనివల్ల అతనిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

అలాగే అతను ఆన్‌లైన్‌ డేటింగ్‌ వెబ్‌సైట్లు చూస్తున్నాడని, అపరిచిత యువతులతో మాట్లాడుతున్నాడని అంటున్నారు. దానివల్లే అతని ఆలోచనల్లో మార్పు వచ్చిందని మీరు భావిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని అతనితోనే నేరుగా చర్చించండి. ఈ క్రమంలో మీనుంచి తను ఏం ఆశిస్తున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలాగే పిల్లల బాధ్యతలు కూడా అతనికి గుర్తు చేయండి. అప్పటికీ అతని ఆలోచనల్లో మార్పు రాకపోతే మానసిక నిపుణులను సంప్రదించండి. వారు అన్ని విషయాలు అడిగి మీ భర్త ఆలోచనల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. అలాగే మీ ఇద్దరి మధ్య దూరం పెరగడానికి గల కారణాల్నీ తెలుసుకొని.. వాటికి తగిన పరిష్కార మార్గాల్ని సూచిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్