ఈర్ష్య కాదు.. కానీ!
నా కొలీగ్ నాకు స్నేహితురాలే. కానీ కొత్తగా వచ్చిన బాస్‌కి తనంటే నమ్మకమెక్కువ. ఏడాదిగా నా భ్రమ అనుకుంటున్నా కానీ అది నిజం. అలాగని తనని చూసి ఈర్ష్య పడట్లేదు. నా సమస్యల్లా మా బాస్ నా పనిని పట్టించుకోవట్లేదు. అవకాశాలేమైనా నా కొలీగ్‌కే
నా కొలీగ్ నాకు స్నేహితురాలే. కానీ కొత్తగా వచ్చిన బాస్‌కి తనంటే నమ్మకమెక్కువ. ఏడాదిగా నా భ్రమ అనుకుంటున్నా కానీ అది నిజం. అలాగని తనని చూసి ఈర్ష్య పడట్లేదు. నా సమస్యల్లా మా బాస్ నా పనిని పట్టించుకోవట్లేదు. అవకాశాలేమైనా నా కొలీగ్‌కే ఇస్తాడు. అది ఇబ్బందిగా ఉంది. నేనేం చేయాలి?
- కీర్తి, బెంగళూరు
పని ప్రదేశంలో బాస్‌తో సత్సంబంధాలు ప్రధానం. అయితే ఆయన/ ఆమె ఒకరి పట్లే నమ్మకం ప్రదర్శిస్తుంటే మిగతావారికి తనతో కలవడం సవాలే. ఆ పరిస్థితిలో మార్పు తేవడమెలాగో తెలియక ఒకలాంటి విసుగు, నిస్సహాయత వచ్చేస్తాయి. అయితే మీరు చేయాల్సింది.... బాస్ ఫేవరెట్‌గా అవ్వడానికి ప్రయత్నించడం కాదు. పనిపరమైన బంధాన్ని దృఢపరచుకోవడానికి కృషి చేయండి. ఆఫీసులో ‘అసమానత్వం’ అన్న భావన మానసికంగా, భావోద్వేగపరంగా చాలా ప్రభావం చూపుతుంది. దీంతో ఆలోచన సరైన దిశగా వెళ్లకపోవచ్చు. ఆఫీసుతో సంబంధం లేని ఒక స్నేహితుడికి మీ పరిస్థితిని వివరించండి. వాళ్లు ‘అవును ఇది దారుణమే’ అనో ‘లేదు.. నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావ్’ అనో చెబుతారు. దీంతో పరిస్థితిపై మీకో అవగాహన వస్తుంది. అయితే జాగ్రత్త! మీ కోపాన్ని బాస్ ఫేవరెట్‌పై మాత్రం చూపించొద్దు. అలాగని కుంగిపోవద్దు. మీ దృష్టంతా ఆత్మవిశ్వాసంతో, స్వీయ ప్రేరణను పెంచుకునేలా ఉండాలి. ‘ఎవరి గుర్తింపూ లేకపోయినా నా పని నేను బాధ్యతగా చేస్తా’ అనుకుంటూ ఆనందంగా ఉండేలా ప్రయత్నించండి.
అసలు బాస్ దృష్టిని తను ఎలా ఆకర్షించిందో గమనించండి. ఆయన/ ఆమెతో, తోటి ఉద్యోగులతో తను మాట్లాడే తీరు, పని చేసే విధానం, ప్రెజెంటేషన్, ఈమెయిల్ రాసే తీరు సహా అన్నీ పరిశీలించండి. ఆఫీసులో ఎదగడానికి కావాల్సిన నైపుణ్యాలు తెలియొచ్చు. వాటిని మీరూ అనుసరించొచ్చు. అయితే మీరు తనకు కాపీలా మాత్రం ఉండకుండా చూసుకోవాలి. తనతోనూ స్నేహంగా ఉండండి. అవసరమైతే సలహాలూ తీసుకోవచ్చు. ‘నువ్వు చేసిన ఫలానా సెమినార్‌పై ఫీడ్‌బ్యాక్ ఏంటి? నాతో పంచుకోగలవా?’ అని అడగొచ్చు. ఇది పోటీ కాదన్న విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. తన గురించి తెలుసుకోవడం ద్వారా సత్సంబంధాలను ఏర్పరచుకోవాలనుకుంటున్నారు. దీన్ని మర్చిపోవద్దు. అలాగే ఇతర విషయాలపై కాకుండా మీ పనిపై పూర్తి శ్రద్ధపెట్టండి. గుర్తింపు తెచ్చుకోవాలన్న భావన నుంచి బయటపడితే మీరూ ఆనందంగా ఉండగలరు, పని విషయంలోనూ విజయం సాధించగలరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.