ఆఫీసులోనూ అనుబంధాలు!

కాలేజీ రోజులు ఆనందంగా గడిచిపోతాయి. చదువయ్యాక త్వరత్వరగా ఉద్యోగ జీవితంలోకి అడుగుపెడదామని కోరుకోవడం సహజమే! తీరా చేరాక అందరూ ఎలా ఉంటారా అన్న భయం ప్రతి అమ్మాయిలోనూ ఉంటుంది.

Published : 17 Feb 2023 00:25 IST

కాలేజీ రోజులు ఆనందంగా గడిచిపోతాయి. చదువయ్యాక త్వరత్వరగా ఉద్యోగ జీవితంలోకి అడుగుపెడదామని కోరుకోవడం సహజమే! తీరా చేరాక అందరూ ఎలా ఉంటారా అన్న భయం ప్రతి అమ్మాయిలోనూ ఉంటుంది. ఆఫీసులోనూ అనుబంధాలు కావాలా.. వీటిని అనుసరించేయండి.

* ఎలా మాట్లాడుతున్నారు? వినే విధానం, సంభాషణ కొనసాగించే తీరు.. పనిచేసే చోట ఇతరులు మనతో ఎలా ఉండాలన్నది నిర్ణయిస్తాయట. కాబట్టి.. ఎదుటివారు మీతో నేరుగా మాట్లాడనంత వరకూ నెగెటివ్‌గా ఊహించుకొని వాళ్లపై ఓ అభిప్రాయానికి వచ్చేయొద్దు. మాట, చేత.. ఎలా ఉన్నాయన్నదే ప్రధానం. పక్కవారు ఏదో అనుకుంటున్నారని ఊహించుకోవడం.. దాన్ని వేరేవాళ్ల వద్ద వ్యక్తం చేసే తత్వం ఎవరికీ మిమ్మల్ని దగ్గర చేయదు.

* ఎవరైనా ఏదైనా చెబితే వినండి. ఇతరుల గురించి చెప్పిన విషయాలను మాత్రం నిజమనుకొని అభిప్రాయాలు పెంచేసుకోవద్దు. వాటి ఆధారంగా అవతలి వాళ్లని ఊహించుకోవడం, దూరంగా ఉంచడం మీకే చేటు. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే సలహాలు నిరభ్యంతరంగా పాటించండి. చెడు దోవ పట్టించేవైతే ఒకటికి రెండుసార్లు తరచి చూసుకోవడం తప్పనిసరి.

* ప్రతిఒక్కరిపై ఏదోక అభిప్రాయం సహజమే! అయితే దాన్నే పట్టుకొని వేలాడొద్దు. ఒక్కొక్కరు ఒక్కో సందర్భంలో ఒక్కోలా ప్రవర్తిస్తారు. అంతమాత్రాన వారిపై ఒక నిర్ణయానికి రావొద్దు. వాళ్లేదైనా సలహా ఇచ్చినా, ఏ విషయంలోనైనా సరిచేసినా కోపమొద్దు. ఆ తీరు వాళ్లనే కాదు.. ఇతరులనీ దూరం చేయగలదు. చర్చలకు తావివ్వనీయండి. పని విషయంలో సలహాలు తీసుకోండి. మీతో పనిచేయడానికి ఎంతమంది ఇష్టపడతారో మీరే గమనిస్తారు.

* ఏదైనా చేస్తా అని ఒప్పుకొంటే పూర్తిచేయండి. అదీ సకాలంలో! చేస్తా అని ముందుకు రావడం సులువే. దాన్ని ఇతరుల జోక్యం అవసరం లేకుండా పూర్తి చేయడమే గొప్ప. ఆ లక్షణాన్ని అలవాటు చేసుకోండి. ఈ నియమాలను అలవాటుగా మలచుకోగలిగితే పని ప్రదేశంలో స్నేహితులు, మీరు పక్కనుంటే బాగుంటుందని కోరుకునేవారే ఉంటారప్పుడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్