బాపూ బొమ్మ కావాలట..

మాది ప్రేమ పెళ్లి. చిన్ననాటి స్నేహితుణ్ణి రెండేళ్ల కిందట పెళ్లి చేసుకున్నాను. ఈమధ్య తను ముభావంగా, నాకు దూరంగా ఉంటున్నాడు. నేను టామ్‌బాయ్‌లా ఉంటానని, నన్ను చూస్తుంటే ఫీలింగ్సే రావడంలేదని అంటున్నాడు.

Updated : 07 Aug 2023 14:14 IST

మాది ప్రేమ పెళ్లి. చిన్ననాటి స్నేహితుణ్ణి రెండేళ్ల కిందట పెళ్లి చేసుకున్నాను. ఈమధ్య తను ముభావంగా, నాకు దూరంగా ఉంటున్నాడు. నేను టామ్‌బాయ్‌లా ఉంటానని, నన్ను చూస్తుంటే ఫీలింగ్సే రావడంలేదని అంటున్నాడు. పైగా తన కొలీగ్‌ బాపూ బొమ్మలా అందంగా ఉంటుందని పొగుడుతున్నాడు. ఇవన్నీ వింటుంటే నాకు అవమానంగా, బాధగా ఉంటోంది. నేనేం చేయాలో పాలుపోవడంలేదు..

- ఓ సోదరి

మీరు ఉత్సాహంగా, అన్నింట్లో ముందుండి చురుగ్గా పనిచేయడం లాంటి లక్షణాలను చూసి మీపై అతడు అభిమానం పెంచుకుని ఉండొచ్చు. మొదట్నుంచీ స్నేహితులు కనుక పరస్పర అవగాహనతో సుఖంగా ఉండొచ్చు అనిపించి ఉంటుంది. కానీ, పెళ్లి తర్వాత అతను స్నేహితురాలిలా కాకుండా భార్య దృష్టితో లైంగికపరంగా చూసినప్పుడు.. వేరే స్త్రీతో పోల్చినప్పుడు మీలో ఆ లక్షణాలు కనిపించలేదేమో! వేరెవరిలోనో స్త్రీత్వం ఎక్కువుందనో, అందంగా అలంకరించుకుందనో ఆకర్షితుడై ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ మీరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, ఇతర విషయాల్లో పేచీ లేదు కనుక అనుబంధం విచ్ఛిన్నం కాకుండా మానసికంగా దగ్గరై, అతని ధోరణి, అపోహలు మార్చగలరేమో.. లైంగికంగా లేదా ఇతరత్రా విషయాల్లో మీ నుంచి అతనేం కోరుకుంటున్నాడో తెలుసుకోండి. వ్యతిరేక ఆలోచనల్ని సరిదిద్దడానికి ప్రయత్నించండి. ఈ విషయాలు పెద్దలకు చెబితే.. ఇరు కుటుంబాల్లో, మీ ఇద్దరి మధ్యా మరింత దూరం పెరిగే అవకాశముంది. అందువల్ల మారిటల్‌ కౌన్సెలింగ్‌కు వెళ్లండి. అక్కడ వారు అతడి ప్రస్తుత మానసిక పరిస్థితి, ఆలోచనా విధానం, ఎందుకు ముభావంగా ఉంటున్నాడు, మీరెలా మారాలని కోరుకుంటున్నాడు వంటివి తెలుసుకుంటారు. అతని ఆలోచనలు ఎంతవరకూ సబబు అనేది అంచనా వేస్తారు. మీరు ఏ విషయాల్లో మారాలో చెబుతూ...మీ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తారు. ఈ విషయమై ఇద్దరూ ఓ సారి చర్చించుకుని కౌన్సెలర్‌ను కలవండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్