తీపి గుర్తులు.. రాసేయండి!

ఆఫీసులో గుర్తుండిపోయే రోజు.. పాపాయి తొలిసారి అమ్మా అని పలికిన క్షణం.. జీవితంలోనే అత్యంత ఆనందం పొందిన సమయం.. పోగేసుకోవాలే కానీ ఎన్ని మధురానుభూతులు.

Published : 08 Sep 2023 01:44 IST

ఆఫీసులో గుర్తుండిపోయే రోజు.. పాపాయి తొలిసారి అమ్మా అని పలికిన క్షణం.. జీవితంలోనే అత్యంత ఆనందం పొందిన సమయం.. పోగేసుకోవాలే కానీ ఎన్ని మధురానుభూతులు. ఒక్కసారి ఇంటి బాధ్యతల్లో పడ్డామంటే అవే లోకంగా బతికేస్తారు మన ఆడవాళ్లు. వీటిల్లో పడి ఆ క్షణాలను మర్చిపోతున్నారా? ఇప్పటినుంచైనా వాటిని ఓచోట రాయడం మొదలుపెట్టండి. దీనివల్ల బోలెడు లాభాలూ ఉన్నాయంటున్నారు నిపుణులు.

  • హార్మోనుల ప్రభావం, పని ఒత్తిడి కారణాలేవైతేనేం.. శారీరకంగానే కాదు మానసికంగానూ ‘అలసిపోయా’ అన్న భావన కలుగుతుంది. దేనిమీదా ఆసక్తి రాదు. అలాంటప్పుడు ‘నువ్వు చేయగలవు’ అని ఎవరైనా వెన్నుతడితే బాగుంటుంది కదూ! కానీ అన్నిసార్లూ అది సాధ్యమేనా? అలాంటప్పుడు గత జ్ఞాపకాలను తిరగేయండి. పడిన కష్టం, సాధించిన ఆనందం తిరిగి ఉత్సాహాన్ని ఇస్తాయి. వాటన్నింటినీ ఎన్నని గుర్తుంచుకోగలం. పేపరు మీద పెడితే ప్రోత్సాహకంగా అనిపిస్తాయి.
  • ‘మావాడు చిన్నప్పుడు అలా చేశాడు.. ఇలా ప్రవర్తించేవాడు’.. అమ్మలు ఒకచోట చేరారంటే ఇలాంటివి ఎన్ని పుట్టుకొస్తాయో! ఈ హడావుడి జీవితంలో పిల్లలతో గడిపే సమయమే తగ్గిపోతోంది. ఇక ఇవన్నీ పంచుకునే సందర్భాలెన్ని? వాటినీ పుస్తకంగా మలచండి. ఫొటోలు ఉంటే ఇంకా మంచిది. మనకే కాదు.. పెద్దయ్యాక వాళ్లకీ మంచి జ్ఞాపకంగా మిగులుతుంది.
  • పెళ్లయిన కొత్తలో చూడండి.. కలిసి బయటకు వెళ్లడం, ఊసులు కలబోసుకోవడం ఎంత సాధారణ విషయం. పిల్లలు పుట్టాక వాళ్ల భవిష్యత్తు, వాళ్లకి అన్నీ సమకూర్చడంపైనే దృష్టి. ఒకరికోసం ఒకరు ఏమైనా చేసినా అదో అలవాటుగా మారుతుందే కానీ పెదవి దాటదు. లేదా ఆనందాన్ని చిరునవ్వుతో కూడిన ‘థాంక్యూ’తో సరిపెట్టేస్తాం. ఆ క్షణం ఏమనిపించిందో రాయండి. ఎప్పుడైనా విభేదాలు ఎదురైనా, కోపమొచ్చినా వాటినోసారి చూస్తే సరి. మనసు తేలికవ్వడమే కాదు.. అవతలి వాళ్లవైపు నుంచి ఆలోచించడమూ అలవాటవుతుంది.
  • ఒక్కోసారి చిన్న సాయమూ చేసే మేలెంతో. అప్పటికి వాళ్ల పట్ల కృతజ్ఞతగా భావిస్తాం. కొన్నిరోజులకు మర్చిపోవచ్చు కూడా. అలాంటివాటిని కాగితంపై పెట్టండి. ఇతరుల అవసరాలను తెలుసుకునే గుణం అలవడుతుంది. అంతేకాదు.. కృతజ్ఞతా భావాన్ని గుర్తుంచుకోవడం కూడా మనసుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మనసు శాంతంగా ఉంటే ఒత్తిడి, ఆందోళనకు తావేది? అందుకే.. రోజూ డైరీలా రాయకపోయినా పర్లేదు కానీ.. ముఖ్యమైన విషయాలనైనా పుస్తకంలో ఉంచండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్