పనిలో ప్రశాంతత కావాలా?

ఇంట్లో కంటే ఆఫీసులోనే ఎక్కువగా గడిపే రోజులివి... పనిచేసే వాతావరణంలోని సమస్యలనూ, ఉద్వేగాల్ని ఇంటివరకూ తీసుకెళ్లకూడదంటే కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడే వర్క్‌లైఫ్‌ బ్యాలెన్స్‌ సాధ్యమవుతుంది.

Updated : 22 Feb 2024 04:55 IST

ఇంట్లో కంటే ఆఫీసులోనే ఎక్కువగా గడిపే రోజులివి... పనిచేసే వాతావరణంలోని సమస్యలనూ, ఉద్వేగాల్ని ఇంటివరకూ తీసుకెళ్లకూడదంటే కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడే వర్క్‌లైఫ్‌ బ్యాలెన్స్‌ సాధ్యమవుతుంది.

  • ఆఫీసులో మీది ఏ స్థాయి ఉద్యోగమైనా కానివ్వండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు అవతలివారిని నొప్పించాలనో, వ్యతిరేకించాలనో, ఎత్తిచూపాలనో ప్రయత్నించడంవల్ల సుహృద్భావ వాతావరణం దెబ్బతింటుంది. వివాదాలకు పునాది అక్కడే పడుతుంది. పని ఒత్తిడితో ఒక్కోసారి కోపం, అసహనం వచ్చేస్తాయి. అలాగని వాటిని ఇతరుల మీద చూపించడం సరికాదు. తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు ఉండటం వల్ల మీ ఉత్పాదకత శక్తి పెరగడమే కాదు...చికాకులూ, చిక్కులకు దూరంగా ఉండొచ్చు.
  • సహచరుల వ్యక్తిత్వం ఏదైనా సరే... మీరు మీరులానే ఉండటానికి ప్రయత్నించండి. పనిలో పోటీ... కొన్నిసార్లు అసూయ, ద్వేషాలకు కారణం అవుతుంది. అయినంత మాత్రాన వారు మీకేం శత్రువులు కాదు. ఏదైనా ఆ పనివరకే అని అర్థం చేసుకుంటే ఈ ఇబ్బందులు ఉండవు. మీ మధ్య ఏవైనా మనస్పర్థలు వస్తే వాటిని తొలగించుకోవడానికి మొదటి అడుగు మీరే వేయండి.
  • పని చేస్తోన్న చోట కొందరి స్నేహం, ఇతరుల మధ్య వచ్చే విభేదాలు, తోటివారి పనితీరు వంటి విషయాలు... మీ దృష్టిని మరలుస్తూ ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి... అనవసర సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉందని మరచిపోవద్దు. ముఖ్యంగా ఇతరుల విషయాలను పదే పదే చర్చించుకోవడం, వదంతులు క్రియేట్‌ చేయడం, నచ్చని సహోద్యోగులను చులకన చేసి మాట్లాడటం వంటివి చేయొద్దు. ఇవన్నీ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకునేలా చేస్తాయి. ఒకవేళ మీకు సంబంధం లేని విషయాలను ఇతరులు ప్రస్తావిస్తుంటే వీలైనంతవరకూ వాటిని ఇగ్నోర్‌ చేయండి. క్రమంగా వారే ఆ పని మానేస్తారు. ఈ అలవాటు మీ సమయాన్ని సద్వినియోగం చేయడమే కాదు... ఒత్తిడినీ దరిచేరనివ్వదు.
  • పని ప్రదేశంలో రాజకీయ, కుల, మతాలకు సంబంధించిన విషయాల్లో వాదనల్లోకి వెళ్లకపోవడమే మంచిది. ప్రతి ఒక్కరూ వారికెదురైన అనుభవాలు, పెరిగిన నేపథ్యాలకు అనుగుణంగా స్పందిస్తూ ఉంటారు. ఎవరైనా మీ అభిప్రాయాలకు అనుగుణంగా మాట్లాడితే... వీలైనంతవరకూ స్పందించొద్దు. వీటి వల్ల గొడవలు పెరుగుతాయే తప్ప తగ్గవు. పైగా మిమ్మల్ని వర్గాలుగా విడగొట్టి పని వాతావరణాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్