ఉద్యోగం మానేయడమే నయమేమో!

మా బాబు ప్రిమెచ్యూర్‌ బేబీ. దీంతో పదే పదే జబ్బు పడుతున్నాడు. గత మూడు నెలల్లో ఏకంగా అయిదుసార్లు ఆసుపత్రి పాలయ్యాడు.

Updated : 13 Mar 2024 15:36 IST

మా బాబు ప్రిమెచ్యూర్‌ బేబీ. దీంతో పదే పదే జబ్బు పడుతున్నాడు. గత మూడు నెలల్లో ఏకంగా అయిదుసార్లు ఆసుపత్రి పాలయ్యాడు. ప్రతిసారీ కనీసం 5 రోజులు సెలవు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి. ఇలా ఇన్నిసార్లు సెలవులు అడగాలంటే నాకే ఇబ్బందిగా ఉంది. పనిభారం పక్కవాళ్ల మీద పడేయడం కంటే ఉద్యోగం మానేయడమే నయమేమో అనిపిస్తోంది. ఏం చేయను?

ఓ సోదరి

తల్లిగా, ఉద్యోగినిగా... రెండు బాధ్యతలూ ఒకేసారి నిర్వహించడం చాలా కష్టం. దీనికితోడు గిల్ట్‌, పని, ఇంటి సమన్వయం,  సమాజ ఒత్తిళ్లు... మానసికంగా, శారీరకంగా అలసిపోయేలా చేస్తాయి. పని ప్రదేశంలో ఎంత సాధించినా, ఇంట్లో ఎంత ప్రేమ కురిపించినా వెలితి కనపడుతూనే ఉంటుంది. దీంతో మారథాన్‌లోలా పరుగు తీస్తూనే ఉంటారు. భర్తకు అండగా ఉంటూ, పిల్లలకు కావాల్సినవన్నీ అమరుస్తూ, ఆఫీసులో పనులన్నీ చక్కబెడుతూ అందరినీ సంతృప్తి పరచడం అసాధ్యం. ముందు దాన్ని మీరు గుర్తించండి. ఇక ప్రస్తుత పరిస్థితికొస్తే... మీరు బాబు బాధ్యత ఎవరికైనా అప్పజెబితే మంచి తల్లి కాదంటారు. అదే దగ్గరుండి చూసుకుంటే కెరియర్‌ అంటే లెక్కలేదంటారు. వాటన్నింటినీ పట్టించుకోవడం మానేయండి.  ఈ రెండింటి మధ్యా పరుగులు తీస్తూ మీరెంత అలసిపోతున్నారో గమనించండి. కాస్త ఈ ఆలోచనలన్నీ పక్కనపెట్టి,  మనసు స్థిమితపరచుకోండి. తరవాత నెమ్మదిగా మీ పరిస్థితి అంతటినీ పైవాళ్లకు, తోటివాళ్లకు చెప్పండి. కొన్నిరోజులు విరామం తీసుకోండి. వైద్యులతో నేరుగా మాట్లాడి, బాబు పరిస్థితినీ అంచనా వేసుకోండి. దాని ప్రకారం జాగ్రత్తలు తీసుకోండి. పూర్తిగా కోలుకున్నాడు అనిపించాక తిరిగి చేరితే మేలు. మళ్లీ చెబుతున్నా. అమ్మగా ఉద్యోగం చేయడం చాలా కష్టం. సవాళ్లు, చీవాట్లూ ఎదురు చూస్తుంటాయి. భయపడకుండా ధైర్యంగా కొనసాగడంపైనే మీ విజయం ఆధారపడుతుంది. అయితే మీ పరిస్థితి రేపు వేరేవాళ్లకీ రావొచ్చు. ఆ సమయంలో మీరూ వాళ్లకి తోడుగా ఉండగలగాలి మరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్