ఏదో... సరదాకి!

‘అమ్మాయిలు పద్ధతిగా ఉండా’లన్న మాటే మనకి ఎక్కువగా చెబుతారు కదా! అల్లరంటూ లేకపోతే జీవితం బోర్‌ కొట్టదూ? ఎలాగూ సందర్భముంది. అదేనండీ... నేడు ఏప్రిల్‌ 1 కదా! సరదాగా స్నేహితులను ఆటపట్టిద్దామా? యువతులకే అని గృహిణులూ... మీరు పక్కకి వెళ్లిపోయేరు! పిల్లలతో చేయించడమో... మీరే ఆత్మీయులను ఆటపట్టించడమో చేసేయండిలా.

Updated : 01 Apr 2024 15:26 IST

‘అమ్మాయిలు పద్ధతిగా ఉండా’లన్న మాటే మనకి ఎక్కువగా చెబుతారు కదా! అల్లరంటూ లేకపోతే జీవితం బోర్‌ కొట్టదూ? ఎలాగూ సందర్భముంది. అదేనండీ... నేడు ఏప్రిల్‌ 1 కదా! సరదాగా స్నేహితులను ఆటపట్టిద్దామా? యువతులకే అని గృహిణులూ... మీరు పక్కకి వెళ్లిపోయేరు! పిల్లలతో చేయించడమో... మీరే ఆత్మీయులను ఆటపట్టించడమో చేసేయండిలా...

  • కార్పెట్‌ కిందో... గుమ్మం దగ్గర కాళ్లు తుడుచుకునే పట్టా కిందో బబుల్‌ రాప్‌ పెట్టేయండి. గాజు వస్తువులు పగలకుండా బుడగల్లాంటి షీట్‌ వస్తుంది కదా... అది! దాన్ని పెట్టేయండి. వాళ్లు అడుగు వేయగానే చిటపట మంటూ శబ్దం వచ్చేస్తుంది. అడుగేసినవాళ్లు కాస్త కంగారు పడతారు కానీ... విషయం అర్థమయ్యాక పకపకలు ఖాయం.
  • ‘ఏమోయ్‌ టీ’ ప్రతిరోజూ ఉదయం పక్క మీద నుంచి శ్రీవారి పిలుపు సర్వసాధారణమా? పంచదారకు బదులు ఉప్పు కలిపేసి ఇచ్చేయండి. కోపిష్టి రకాలనుకోండి... ‘అయ్యయ్యో చూసుకోలేదు’ అనేయొచ్చు. సరదాగా తీసుకునేవారికి ‘ఏప్రిల్‌ ఫూల్‌’ అనేస్తే సరి. కోపంగా ఉండేవారితో సరదా ఏముందని మూతి ముడుచుకోనక్కర్లేదు. వారి అవస్థ ఎప్పుడో మనం పడ్డ ఇబ్బందికి చిన్న ప్రతీకారం తీర్చుకున్నామన్న భావన కలిగించి, ఆనందాన్నిస్తుందట.
  • సోఫా కవర్‌ లేదా బెడ్‌షీట్‌ కింద చిప్స్‌, బిస్కట్లు, అప్పడాలు వంటివి ఉంచండి. కూర్చోగానే శబ్దానికి షాకవడం, ఆపై నవ్వులు ఒకదాని తరవాత ఒకటి
  • వచ్చేస్తాయి.
  • సబ్బుకు నెయిల్‌ పాలిష్‌ పట్టించేసి, ఏమీ ఎరగనట్లు బాత్రూమ్‌లో పెట్టేయండి. ఇక స్నానం చేయడానికి దాన్ని రుద్దే వారి అవస్థ మామూలుగా ఉండదు. ఎంత రుద్దినా నురగే రాదు. ఇక లోపల్నుంచి కేకలు మొదలైపోతాయి. అయితే ఇది ఆరడానికి కాస్త సమయం కావాలి. ఉదయాన్నే అందరూ లేవకముందే సాధ్యమా అనేది గమనించుకోవాలి మరి!
  • చాక్లెట్‌ అంటే ఇష్టపడని పిల్లలుండరు కదా! జాగ్రత్తగా చాక్లెట్‌ కవర్‌ తీసి, దానిలో అదే రంగు కార్డ్‌బోర్డు పెట్టి ఇవ్వండి. ఆశగా విప్పుతారా... కొద్దిసేపటికే విషయం అర్థమవుతుంది. వెంటనే ‘ఏప్రిల్‌ ఫూల్‌’ చెప్పేయండి. అయితే చిన్నవాళ్లు కదా... ఏడ్చేసే అవకాశాలు ఎక్కువ. ఆయుధంగా అసలైన చాక్లెట్‌ని దగ్గర ఉంచుకోవాలి మరి.
  • స్నేహితురాలినీ ఆటపట్టించొచ్చు. కొత్త నంబరు తీసుకొని గొంతు మార్చి మాట్లాడేయండి. మెచ్చిన సెలబ్రెటీ ఉంటే వారిలానూ నటించొచ్చు. అందుకు సాయపడే యాప్‌లూ బోలెడు. ఫ్రెండ్స్‌తో కొన్ని మధురానుభూతులు పంచుకున్నట్టూ అవుతుంది.
  • చీకటి పడింది. కానీ మీలోని చిన్నపిల్ల ఇంకా మేల్కొని ఉందా... అయితే దీన్ని ప్రయత్నించేయండి. దిండు కవర్లలో దిండు తీసేసి బెలూన్లతో నింపండి. గమనించుకోకుండా పడుకుంటారు కదా! అప్పుడు బాంబుల్లా మోత మొదలవుతుంది. మీ నవ్వుతో అవతలివారికి విషయం చెప్పకనే అర్థమై పోతుంది.

ఎంతసేపూ సీరియస్‌గా గడిపేస్తే ఎలా? అప్పుడప్పుడూ సరదాలు, చిలిపితనం జోడైతేనే జీవితం అందంగా తోస్తుంది. ‘ఏప్రిల్‌ ఫూల్‌’ చిన్నపిల్లల ఆట అని తోసేయక ఆత్మీయులతో ప్రయత్నించేయండి. పిల్లలకీ సరదా... మీలోని మరో కోణం కూడా పరిచయం అవుతుంది. అంతేకాదు... ఈ చిలిపి పనులు ఆనందాన్ని నింపడమే కాదు, ఒత్తిడినీ దూరం చేస్తాయి. మరి ప్రయత్నిస్తారు కదూ!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్