ఎందుకంత ఖర్చు?

ఆన్‌లైన్‌లో తగ్గింపు అని కనిపించినా, సరదాగా బయటికి వెళ్లినా ఒకటో రెండో డ్రెస్సులు వెంటబెట్టుకొచ్చేస్తారు. అప్పటికే బోలెడు క్రీములు ఇంట్లో ఉన్నా.. ఎవరో సిఫారసు చేశారనో, తక్కువకే వస్తున్నాయనో మరిన్ని తెచ్చేస్తుంటారు.

Published : 10 Apr 2024 02:23 IST

ఆన్‌లైన్‌లో తగ్గింపు అని కనిపించినా, సరదాగా బయటికి వెళ్లినా ఒకటో రెండో డ్రెస్సులు వెంటబెట్టుకొచ్చేస్తారు. అప్పటికే బోలెడు క్రీములు ఇంట్లో ఉన్నా.. ఎవరో సిఫారసు చేశారనో, తక్కువకే వస్తున్నాయనో మరిన్ని తెచ్చేస్తుంటారు. అప్పుడు అమ్మల నుంచి ఎదురయ్యే ప్రశ్న ‘ఇప్పటికే ఉన్నాయిగా? మళ్లీ ఇవన్నీ ఎందుకు? దండగ ఖర్చు కాకపోతే’ అనే కదూ! నిజంగానే ఎందుకిలా కొనేస్తాం?

  • కొన్ని వస్తువులు, దుస్తులు ఎంత నచ్చినా ఆర్థిక పరిస్థితి అనుకూలించక కొనలేరు కొందరు. అదలా మనసులో నాటుకు పోతుందేమో... సొంతంగా సంపాదించడం మొదలుపెట్టాక తెలియకుండానే అలా ఖర్చు చేస్తుంటారు. కొందరికి ఆర్థిక పరిస్థితులు బాగున్నా అలమరాలు నింపేస్తారుగా అంటే... దానికీ కారణముంది అంటున్నాయి కొన్ని పరిశోధనలు. ఆత్మవిశ్వాసంగా కనిపించడానికి అమ్మాయిలు ఎంచుకునే మార్గాల్లో దుస్తులూ ఒకటి. వాళ్ల వ్యక్తిత్వం, స్టైల్‌ని వాటి ద్వారా వ్యక్తపరుస్తారట. అందుకే ఎన్ని ఉన్నా తాజా ధోరణులను తెలుసుకుని మరీ వేసుకున్నా వేసుకోకపోయినా దుస్తులు, చెప్పులు వగైరా కొంటూనే ఉంటారు. ఇంకొందరైతే అలా కొనడం ద్వారా ఒత్తిడి దూరమైనట్లుగా భావిస్తారు. అందుకే ‘ఎందుకింత ఖర్చు’ అన్నా తీరు మాత్రం మార్చుకోలేరు.
  • బ్యూటీ ఉత్పత్తుల మాటేంటి? ముఖ్యమైన సందర్భం... అందంగానో, నలుగురిలో ఉత్తమంగానో కనిపించాలనుకుంటారు. తీరా ఏ కాటుకో, మరేదో కనిపించదు... చూసేవాళ్లకు చిన్నగానే కనిపిస్తుంది. మనసులో ఆ లోటు వాళ్లకి తెలుస్తూనే ఉంటుంది. సందర్భమేదైనా ‘పర్‌ఫెక్ట్‌’గా ఉండాలనుకునే అమ్మాయిలే ఎక్కువ. అలాంటివాళ్లు వీటినెలా తట్టుకుంటారు చెప్పండి. అందుకని ముందుగానే సిద్ధంగా ఉండాలన్న తాపత్రయంలో తెలియకుండానే ఇలా ఖర్చు చేస్తుంటారు.
  • ఈ తీరు ఇబ్బంది కదా! అంటే... అవుననే అంటున్నాయి అధ్యయనాలు. ఖర్చుపెట్టే స్థోమత ఉందన్న ధైర్యం, అందుబాటులో ఉన్న క్రెడిట్‌ కార్డులు ‘అనవసర ఖర్చేమో’ అన్న ఆలోచనే రానీయడం లేదట. కాబట్టి, నెలకి దుస్తులు, సౌందర్య ఉత్పత్తులకు ఇంత అని బడ్జెట్‌ పెట్టుకోవాలి. దాన్ని తు.చ. తప్పకుండా పాటించడమే దీనికి సరైన పరిష్కారం అంటున్నారు నిపుణులు. ఒకవేళ దానిలో మిగిలితే మరుసటి నెలకు బదిలీ చేసుకోవచ్చు. పరిధి దాటితే మాత్రం అడ్డుకట్ట వేసుకోవడం ఒక్కటే మార్గం. ప్రయత్నిస్తారా మరి?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్