మరో పెళ్లి చేసుకున్నాక... కాపురం చేస్తానంటున్నాడు!

మా అమ్మాయి ఒకబ్బాయిని ప్రేమించి గుళ్లో పెళ్లి చేసుకుంది. మూడేళ్లకు మనస్పర్థలతో వాళ్లు విడిపోయారు. కోర్టు నుంచి విడాకులు తీసుకోలేదు కానీ, పెద్దల ముందు మాత్రం ఎవరిదారి వారిదని అనుకున్నాం.

Published : 16 Apr 2024 17:52 IST

మా అమ్మాయి ఒకబ్బాయిని ప్రేమించి గుళ్లో పెళ్లి చేసుకుంది. మూడేళ్లకు మనస్పర్థలతో వాళ్లు విడిపోయారు. కోర్టు నుంచి విడాకులు తీసుకోలేదు కానీ, పెద్దల ముందు మాత్రం ఎవరిదారి వారిదని అనుకున్నాం. తరవాత ఇద్దరూ వేర్వేరుగా పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే, ఇప్పుడతడు రెండో భార్యతోనూ విడిపోయాడు. తాను చట్టప్రకారం మొదటి భార్యకు విడాకులివ్వలేదు కాబట్టి రెండో పెళ్లి చెల్లదనీ, మా అమ్మాయితోనే కాపురం చేస్తానని గొడవ చేస్తున్నాడు. ఇప్పుడిప్పుడే కుదుటపడుతోన్న నా కూతురు జీవితం ఏమవుతుందోనని భయంగా ఉంది. చట్ట ప్రకారం అతడిపై చర్యలు తీసుకునేదెలా?

ఓ సోదరి.

మీ అమ్మాయి గుళ్లో పెళ్లి చేసుకుంది అంటున్నారు. అక్కడ కేవలం దండలు మార్చుకుంటే అది పెళ్లవ్వదు. కచ్చితంగా ఆ సమయంలో హిందూ వివాహ సంప్రదాయాలను అనుసరిస్తేనే చట్టబద్ధంగా వివాహం అయినట్లు లెక్క. అలానే, కాగితాల మీద రాసుకునే విడాకులకు ఎటువంటి విలువా ఉండదు. తప్పనిసరిగా కోర్టు నుంచే తీసుకోవాలి. మొదటి భార్యకు విడాకులివ్వలేదు కాబట్టి ఆమెతోనే ఉంటానని అతడనుకుంటే కుదరదు. మీ అమ్మాయికి అతడితో ఉండటం ఇష్టం లేకపోతే ముందు తనతో హిందూ మ్యారేజ్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ -13 ప్రకారం కోర్టులో విడాకులకు దరఖాస్తు చేయమనండి. ఇక, డివోర్స్‌ తీసుకోకుండా మీ బిడ్డకు చేసిన పెళ్లి చట్ట సమ్మతం కాదు. రెండో భర్తకు అన్నీ వివరంగా చెప్పండి. లేకపోతే అపార్థాలు, గొడవలు వస్తాయి. ముందు మీ కూతురితో విడాకులకు దరఖాస్తు చేయించండి. అలానే, మొదటి భర్త తన జీవితంలోకి అనవసరంగా ప్రవేశించకుండా, తన ప్రశాంతతకు భంగం కలిగించకుండా చూడమంటూ కోర్టులో ఇంజంక్షన్‌ పిటిషన్‌ వేయొచ్చు. అలానే, విడాకులొచ్చాక ఆమె రెండో పెళ్లిని చట్టబద్ధం చేసేందుకు రిజిస్ట్రేషన్‌ చేయించండి. అంతేకాదు, తనని మొదటి భర్త వేధిస్తున్నాడని పోలీస్‌స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చు. పిలిపించి కౌన్సెలింగ్‌ చేస్తారు. భర్త హోదాతో స్త్రీలను వేధించే హక్కు ఎవరికీ లేదు. కాబట్టి అనవసరంగా భయపడకుండా తొందరగా విడాకుల నిర్ణయం తీసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్