ఆ మౌనానికి కారణం తెలుసా!

మయూరి కూతురు అకస్మాత్తుగా మాట్లాడటం తగ్గించింది. పలకరించినా కూడా సరైన సమాధానమివ్వకుండా నిత్యం ఏదో కోల్పోయినట్లు ఉండటం చూసి తల్లిగా ఆమెకు ఏం చేయాలో తెలియడం లేదు.

Published : 06 May 2024 02:04 IST

మయూరి కూతురు అకస్మాత్తుగా మాట్లాడటం తగ్గించింది. పలకరించినా కూడా సరైన సమాధానమివ్వకుండా నిత్యం ఏదో కోల్పోయినట్లు ఉండటం చూసి తల్లిగా ఆమెకు ఏం చేయాలో తెలియడం లేదు. ఇటువంటప్పుడు పిల్లలను సాధారణ స్థితికెలా తీసుకురావాలో చెబుతున్నారు నిపుణులు...

పిల్లలు ఎదుగుతున్నప్పుడు పలురకాల భావోద్వేగాలకు గురవుతుంటారు. చదువులో అనుకున్న ర్యాంకు సాధించలేకపోవడం, ఇంట్లోవాళ్లు అడిగింది ఇవ్వకపోవడం వంటివి ఏవైనా కావొచ్చు. ఇటువంటి సందర్భాల్లో మౌనాన్ని వారెక్కువగా ఆశ్రయిస్తారు. అలాగే ఏదో కోల్పోయిన భావన వాళ్లలో కనిపిస్తుంది. ఈ మార్పును అమ్మానాన్నలే గుర్తించగలగాలి. ఆపై ముందు వాళ్ల మనసు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.  ప్రేమగా దగ్గరకు తీసుకుని ఏది ఏమైనా మేమున్నామనే భరోసానివ్వాలి. వాళ్ల మనసులోని మాటను బయటకు చెప్పే ధైర్యాన్నివ్వగలగాలి.

నిందించకూడదు...

ఏదైనా పొరపాటు జరిగినా, మార్కులు తగ్గినా, అనుకున్న సీటు సంపాదించలేకపోయినా... పిల్లలను వెంటనే నిందించకూడదు. ‘నిన్ను చదివించడానికి మేమెంత కష్టపడుతున్నామో.. నీకు చదువు వృథా’ వంటి మాటలతో గాయపరచకూడదు. అప్పటికే వారెంతో ఆందోళన చెందుతుంటారు. అటువంటి సమయంలో వారికి వేదన కలిగిస్తే కుంగుబాటుకు దారితీసే ప్రమాదం లేకపోలేదు. అలా కాకుండా మరోసారి ప్రయత్నిస్తే అనుకున్నది సాధించగలవనే ధైర్యాన్నిస్తే మంచిది. ప్రతి చిన్న విషయాన్ని ప్రతికూలతగా ఆలోచించకుండా సానుకూల ధోరణి అలవడేలా చేయాలి. అప్పుడే వారిలో తిరిగి మరోసారి కృషి చేద్దామనే ఆలోచన మొదలవుతుంది.

స్ఫూర్తి నింపాలి...

ఏ విషయాన్నైతే తమ సమస్యగా భావిస్తున్నారో దాన్ని పరిష్కరించుకునే పలు మార్గాలను వారెదుట ఉంచాలి. తీరని సమస్య అంటూ లేదని అవగాహన కలిగించాలి. ఇవన్నీ వారిలోని ఆత్మన్యూనతను దూరం చేసి, ప్రేరణ పొందేలా చేస్తాయి. అంతేకాదు, దేన్నైనా సాధించగలిగే సామర్థ్యం నీలో ఉందంటూ ఉత్సాహపరచాలి. గతంలో తను చేసిన సాధనలను గుర్తు చేసి, ప్రశంసించాలి. ప్రతిభను మెచ్చుకుంటూ.. ముందడుగు వేసేలా ప్రోత్సహిస్తే చాలు. చదువులోనే కాదు, జీవితంలో ఎదురయ్యే సమస్యలకూ ఎదురు నిలిచి పోరాడే తత్వాన్ని నేర్చుకుంటారు. అనుకున్నవన్నీ సాధించి విజేతలుగా నిలుస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్