బుర్ర పాప్‌కార్న్‌ అయిపోద్ది!

సరదాగా ఇన్‌స్టాగ్రామ్‌లో నచ్చిన పోస్టులన్నీ అలా అలా తిరగేస్తున్నారు. ఇంతలో అమ్మ నుంచి పిలుపు. ‘ఆ కూరగాయలు తరిగిపెట్టు’ అనో ‘ఫ్రిజ్‌లో ఫలానాది తీసి ఇవ్వు’ అనో అంది. ఎంత చిన్నపని? అయినా కోపం ముంచుకొస్తుంది. ‘దీనికీ నన్నే డిస్టర్బ్‌ చేయాలా’ అని అరిచేశారా? చేయాల్సిన పనేమో బోలెడంత ఉంది. ఎలాగైనా పూర్తిచేయాలి అని బలంగా అనుకున్నారు. అయినా బుర్రేమో కొద్దిసమయానికే విరామం కావాలంటోంది.

Updated : 29 May 2024 08:15 IST

  • సరదాగా ఇన్‌స్టాగ్రామ్‌లో నచ్చిన పోస్టులన్నీ అలా అలా తిరగేస్తున్నారు. ఇంతలో అమ్మ నుంచి పిలుపు. ‘ఆ కూరగాయలు తరిగిపెట్టు’ అనో ‘ఫ్రిజ్‌లో ఫలానాది తీసి ఇవ్వు’ అనో అంది. ఎంత చిన్నపని? అయినా కోపం ముంచుకొస్తుంది. ‘దీనికీ నన్నే డిస్టర్బ్‌ చేయాలా’ అని అరిచేశారా?
  • చేయాల్సిన పనేమో బోలెడంత ఉంది. ఎలాగైనా పూర్తిచేయాలి అని బలంగా అనుకున్నారు. అయినా బుర్రేమో కొద్దిసమయానికే విరామం కావాలంటోంది. చేయి పదే పదే ఫోన్‌కేసి లాగుతోంది. తీరా గ్రహించేసరికి సమయం మించిపోతుంది. పనేమో కొండలా కనిపిస్తుంటుంది. ‘అబ్బా... అనవసరంగా ఫోన్‌ పట్టుకున్నా’ అని అప్పుడనిపిస్తుంది.

ఇవే కాదు... ఏ నోటిఫికేషన్‌ రాకపోయినా పదే పదే తెరకేసి చూడటం, యాప్‌లన్నీ తెరవడం చేస్తున్నా... మీరూ ‘పాప్‌కార్న్‌ బ్రెయిన్‌’ పాలిట పడ్డట్టే!
ఇదేమీ సైంటిఫిక్‌ పదం కాదు. కానీ ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. మేమేమైనా దీని పాలిట పడ్డామా అని చెక్‌ చేసుకుంటున్నవారూ చాలామందే. అసలు ఇదేమిటంటే... దేనిమీదా కొన్ని నిమిషాలైనా దృష్టి పెట్టలేకపోవడం, పదే పదే ఫోన్‌ కేసి మనసు లాగడం, మానసిక అలసట, చిన్న నోటిఫికేషన్‌ వచ్చినా దాన్ని చూసేవరకూ మనసు లాగడం... వంటివన్నీ దీనికి ఉదాహరణలే. వేడికి మొక్కజొన్న విత్తనాలు ఒక్కొక్కటిగా విచ్చుకున్నట్టే ఈ స్థితిలో మన ఆలోచనలూ ఒక దాన్నుంచి మరోదానికి పరుగెడతాయి. కాబట్టే ‘పాప్‌కార్న్‌ బ్రెయిన్‌’ అనే పేరొచ్చింది. ఒక అధ్యయనం ప్రకారం దీనిబారిన పడుతున్నవారిలో పిల్లలు, అమ్మాయిల సంఖ్యే ఎక్కువ. ఆందోళన, ఎవరితోనూ కలవాలి, మాట్లాడాలి అనిపించకపోవడం, చిరాకు, కోపం, చిన్న పనులకీ గుర్తింపు కోరుకోవడం వంటివి పెద్దవారిలోనూ... దేనిమీదా దృష్టిపెట్టలేకపోవడం, హైపర్‌ యాక్టివిటీ, చిన్నవాటికే కోపం, నిద్ర సరిగా పోలేకపోవడం వంటి లక్షణాలు పిల్లల్లోనూ కనిపిస్తున్నాయట.

ఎందుకిలా... అంటే... ఫోన్‌ నుంచి వెలువడే నీలికాంతి, శబ్దాలకు మెదడు ఆకర్షితమవుతుందట. టైపింగ్‌ చేసేప్పుడు వచ్చే శబ్దాలేకాదు, ఒకటి పూర్తయ్యాక మరొకటంటూ మనం చేసే స్క్రోలింగ్‌ కూడా తెలియని ఉత్సాహాన్ని తెచ్చిపెడుతుందట. అంతేకాదు, ఒత్తిడి తగ్గి, ఆనందం పొందుతున్న అనుభూతిని కలిగిస్తుంది. అందుకే హాయిని పొందుతున్నామన్న మాయలో అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నాం.


మరేం చేయాలి?

  • వాడని యాప్స్‌ ఏమున్నాయో చెక్‌ చేసి, తీసేయండి. షాపింగ్, సర్వీసులకు సంబంధించిన యాప్‌ల నోటిఫికేషన్లు డిసేబుల్‌ చేస్తే సరి. ఆఫర్ల వివరాలు మనల్ని ఆకర్షించవు. అనవసర ఖర్చూ తగ్గుతుంది.
  • పనులన్నీ ఫోన్‌తోనే పూర్తిచేస్తున్న రోజులివి. పూర్తిగా పక్కన పెట్టేయడం కుదరదు. కాబట్టి, సమయం కేటాయించుకోండి. ఈ పని పూర్తయ్యాకే ఫోన్‌ పట్టుకోవాలి, అదీ ఇన్ని నిమిషాలే అని నియమం పెట్టుకోండి. సమయం తెలియలేదు అనిపిస్తే రిమైండర్‌ పెట్టుకున్నా మంచిదే. అయితే కచ్చితంగా పాటించాలి మరి!
  • నిద్రకి గంట ముందు ‘నో ఫోన్‌’ నియమం పెట్టండి. ఇంకా భోజనాల సమయంలోనూ ఉండకూడదు. రోజూ ఈ సమయంలో అందరూ కబుర్లు చెప్పుకోవాలని రూల్‌ పెట్టేయండి. ఇంట్లోవాళ్లంతా కలిసి ఓ పుస్తకం చదవడం, సరదాగా చల్లగాలికి అలా నాలుగు అడుగులు వేయడం లాంటివీ మార్పు తెచ్చేవే.
  • ఫోన్‌ వద్దంటే చాలు పిల్లలు చేసే యాగీ మామూలుగా ఉండదు కదూ! పైగా ‘ఏం తోచట్లేదు’ అని మారాం చేస్తారు. అప్పుడు కొత్త హాబీలు అలవాటు చేయండి. మీరూ చేసుకుంటే ఇంకా మంచిది. మీరు పక్కన పెడితే వాళ్ల దృష్టీ దానిపైకి పోదు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్