మనం తినేది విషమా.. ఆహారమా?

రమ, రాకేష్‌... సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. దంపతులిద్దరూ ఆహార ప్రియులు... ఇక చెప్పేదేముంది వారాంతం వచ్చిందంటే చాలు. కనీసం రెండు మూడు రెస్టరంట్లలో అయినా పదార్థాలను రుచి చూడాల్సిందే.. పిల్లల ప్లానింగ్‌ కోసమని ఆసుపత్రికి వెళ్తే... దీర్ఘకాలం కలుషితాహారం తినడం వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిందని చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు.

Updated : 07 Jun 2024 16:04 IST

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా...

రమ, రాకేష్‌... సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. దంపతులిద్దరూ ఆహార ప్రియులు... ఇక చెప్పేదేముంది వారాంతం వచ్చిందంటే చాలు. కనీసం రెండు మూడు రెస్టరంట్లలో అయినా పదార్థాలను రుచి చూడాల్సిందే.. పిల్లల ప్లానింగ్‌ కోసమని ఆసుపత్రికి వెళ్తే... దీర్ఘకాలం కలుషితాహారం తినడం వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిందని చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు.

ఎంబీఏ చదువుతోన్న నీలిమ స్నేహితులతో కలిసి ఉంటోంది. వండుకునే తీరిక లేక తరచూ బయట తింటోంది. జ్వరం వచ్చిందని ఆసుపత్రికి వెళ్తే కలుషితాహారం, నీటి వల్ల కామెర్ల వ్యాధి బారిన పడిందన్నారు. ఇది తీవ్ర స్థాయిలో కిడ్నీలపైనా ప్రభావం చూపిస్తోందనడంతో ఆమెకు నోట మాట రాలేదు.

వీరేకాదు.. మనలో చాలామంది సాయంత్రమైతే చాలు... వేడివేడిగా తినాలని బయటకు వెళ్తుంటాం, నచ్చిన వంటకాలను ఇంటికే ఆర్డర్లు పెట్టుకుంటాం. కానీ వాటి రుచి గురించే తప్ప నాణ్యత, శుభ్రతల్ని పెద్దగా పట్టించుకోం. ఫలితంగా తీవ్ర అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నాం.

‘తిండి కలిగితే కండ కలదోయ్‌!’ అన్న మహాకవి గురజాడ అప్పారావు మాటకు సందర్భం వేరు కానీ, ఆ కండలు రావడానికి గట్టిగా తింటే సరిపోదంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఎందుకంటే అవి నాణ్యమైన పదార్థాలై ఉండాలి, అప్పుడే ఆరోగ్యమూ సహకరిస్తోందని చెబుతోంది. లేదంటే కలుషిత ఆహారం వల్ల అతిసారం, అలర్జీలు వంటి సమస్యలతో పాటు ప్రాణానికీ ప్రమాదం రావొచ్చనీ హెచ్చరిస్తోంది. ఇది ప్రధానంగా మహిళలు, ముఖ్యంగా గర్భిణులు, పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందట. ఈ తీరు ప్రపంచ జనాభానూ తీవ్రంగా ప్రభావితం చేయడంతో పాటు ప్రతి పదిమందిలో ఒకరు దీనివల్లే అనారోగ్యం పాలవుతున్నారనీ డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. అంతేకాదు, నాణ్యతతో కూడిన శుభ్రమైన ఆహారాన్ని తినడం వల్ల సుమారు 200 రకాల అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చనీ సూచిస్తోంది.

కలుషిత ఆహారంతో...

బ్యాక్టీరియా, వైరస్, రసాయనాలు వంటి హానికరమైనవి ఆహార ఉత్పత్తుల్లోకి చేరితే అవి కలుషితం అవుతాయి. ప్రాసెసింగ్, రవాణా, స్టోరేజ్, వండేటప్పుడు, నిల్వ చేసేటప్పుడు... ఇలా ఎప్పుడైనా సరే ఈ పరిస్థితి ఎదురుకావొచ్చు. సరైన పరిశుభ్రతా పద్ధతులు పాటించకపోవడం, పురుగు మందుల వినియోగం, రుచి కోసం వాడే రసాయనాలు ఇందుకు దారి తీయొచ్చు. యూరోపియన్‌ యూనియన్‌ ఫుడ్‌ సేఫ్టీ అధికారుల నివేదిక ప్రకారం- మన దేశంలో సుమారు 527 రకాల ఉత్పత్తుల్లో క్యాన్సర్‌ కారకమైన ఇథలీన్‌ ఆక్సైడ్‌ ఎక్కువగా ఉంటోందట. వీటిల్లో నిత్యం మనం వాడే పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, గుడ్లు వంటివెన్నో ఉన్నాయి. ఇక, సరిగా ఉడకని మాంసం, సీఫుడ్‌లో ఉండే సాల్మోనెల్లా, కాంపీలోబ్యాక్టర్, ఈ-కొలీ వంటి బ్యాక్టీరియాలు జీర్ణాశయ ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. అలానే, ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ చేయడం వల్ల లేదా తేమతో వచ్చే బూజు (అఫ్లాటాక్సిన్‌) కొన్నిసార్లు ప్రాణానికి ప్రమాదకరంగా మారుతుంది. కాడ్మియం, సీసం... వంటివి ఒంట్లో చేరితే  కాలేయం, మూత్రపిండాలు వంటి అవయవాలతో పాటు రోగనిరోధక వ్యవస్థా దెబ్బతింటుంది. ఇవన్నీ మహిళల పునరుత్పత్తి సామర్థ్యంపైనా తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఘుమఘుమలాడుతున్నాయనో, కంటికింపుగా కనిపిస్తున్నాయనో బయటి ఆహారానికి అలవాటు పడితే వాటి కల్తీ వల్ల మీ ఆరోగ్యానికి జరిగే నష్టం ఎక్కువే. కుళ్లిన కూరగాయలూ, పురుగు పట్టిన పిండ్లూ, గడువుదాటినవీ, పాడైన గుడ్లు వంటివి నిర్భీతిగా వాడేస్తున్నారు. ఇందుకు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల బయటపడిన సంఘటనలే ఉదాహరణ. అయితే బయట తినేటప్పుడే కాదు, ఇంట్లో వండుకునేటప్పుడూ సరైన నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సిందే.


వంటగది పాఠాలు...

ఫ్రిజ్‌లో పెడితే పదార్థాలు పాడైపోవు అనుకుంటారు చాలామంది. అందుకే కనిపించిందల్లా అందులోకి తోసేస్తారు. కానీ, అవి చూడ్డానికీ రుచికీ బాగున్నా మన ఆరోగ్యాన్ని పాడు చేసే బ్యాక్టీరియా వాటిలో అభివృద్ధి చెందుతుంది. పాలు, పాల పదార్థాలు, మాంసం, చేపలు.. వంటివాటిని బయటి నుంచి తెచ్చిన రెండు గంటల్లోపే ఫ్రిజ్‌లో పెట్టేయాలి. ముఖ్యంగా గడ్డకట్టిన పదార్థాలను చల్లటి నీటిలో/మైక్రోవేవ్‌ అవెన్‌లో పెట్టి కరిగించడం సురక్షితం. అలాకాకుండా వాటంతటవే కరిగిపోతాయనుకుంటే అది గది ఉష్ణోగ్రత వద్దకు చేరే సరికి ఆయా పదార్థాల్లోని బ్యాక్టీరియా రెండింతలవుతుంది. ఇది ఆరోగ్యానికి
ప్రమాదకరం.

  • వండిన ఆహార పదార్థాలను గది ఉష్ణోగ్రతలో ఆరు గంటల కంటే ఎక్కువ సమయం ఉంచకూడదు. ఫ్రిజ్‌లో నాలుగు రోజుల కంటే ఎక్కువ పెట్టినవి తినొద్దు. వేడివి అరవై డిగ్రీల సెల్సియస్‌ అంతకంటే ఎక్కువగా, చల్లటివి నాలుగు డిగ్రీల కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి.
  • అసలే వర్షాకాలం ఆకుకూరలపై చిన్న చిన్న పురుగులూ, జీవులూ గుడ్లు పెడుతుంటాయి. వండుకోవడానికి ముందు వాటిని ఉప్పు, పసుపు వేసి బాగా శుభ్రం చేసి ఆరబెట్టాకే ఫ్రిజ్‌లో పెట్టాలి. తరవాత మరోసారి కడిగి వండుకోవాలి. వంటకు శుభ్రమైన నీటినే వాడాలి. సురక్షిత మంచినీటి వ్యవస్థ లేనప్పుడు ఆ నీటిని మరిగించి వాడొచ్చు. లేదంటే అతిసారం ముప్పు ముంచుకొస్తుంది.
  • పచ్చి మాంసం, కోడిగుడ్లు, చికెన్, చేపలు.. వంటి వాటి నుంచి క్రిములు త్వరగా వ్యాపించే ప్రమాదం ఉంది. బాగా ఉడికించాకే తినాలి. వీటిని కోసేందుకు, వండేందుకు కటింగ్‌ బోర్డులు, కత్తులు, పాత్రలూ విడిగా ఉంచాలి. .
  • వండకుండా నేరుగా తినే పండ్లు, ఇతర పదార్థాల పైకి బ్యాక్టీరియా, ఫంగస్‌ చేరితే ఆరోగ్యానికి చేటు. కాబట్టి వంటకాలు, పండ్లూ విడివిడిగా పెట్టాలి. ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ని కొనుగోలు చేసినప్పుడు లేబుల్స్‌ పరిశీలించి తీసుకోవాలి.
  • కోడిగుడ్లు కడిగి పెట్టకూడదు. కడిగితే పెంకులోని సన్నని రంధ్రాలనుంచి బ్యాక్టీరియా లోపలికి చేరి అపాయాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి, వండే ముందే కడగాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్