12 ఏళ్లుగా ఇంట్లోనే బంధించి..!

కొట్టో, తిట్టో భార్యల్ని హింసించే భర్తల్ని చూశాం.. అనుమానం పెనుభూతమై ఆలిని వేధించే భర్తలూ చాలామందే! కానీ ఈ భర్త సమస్యేంటో ఎవరికీ అర్థం కావట్లేదు.. ఆఖరికి పోలీసులకు కూడా! అకారణంగా భార్యను 12 ఏళ్లుగా ఇంట్లోనే బంధించి వేధింపులకు గురిచేశాడు.

Published : 03 Feb 2024 12:39 IST

(Representational Images)

కొట్టో, తిట్టో భార్యల్ని హింసించే భర్తల్ని చూశాం.. అనుమానం పెనుభూతమై ఆలిని వేధించే భర్తలూ చాలామందే! కానీ ఈ భర్త సమస్యేంటో ఎవరికీ అర్థం కావట్లేదు.. ఆఖరికి పోలీసులకు కూడా! అకారణంగా భార్యను 12 ఏళ్లుగా ఇంట్లోనే బంధించి వేధింపులకు గురిచేశాడు.. అయితే పోలీసుల చొరవతో ఈ అభాగ్యురాలు ఇటీవలే ఆ నరక కూపం నుంచి బయటపడింది.. ‘నాకీ భర్తా వద్దు.. కాపురమూ వద్దం’టూ..’ పుట్టింటికి వెళ్లిపోయింది. మైసూరులో జరిగిన ఈ ఘటన ఇటీవలే వెలుగుచూసింది. మరి, వివరాల్లోకి వెళ్తే..!

మైసూర్‌కు చెందిన సుమతికి పెళ్లై పన్నెండేళ్లయ్యింది. అందరమ్మాయిల్లాగే దాంపత్య జీవితం గురించి వివాహానికి ముందు ఎన్నో కలలు కన్న సుమతి.. భర్తతో జీవితాంతం సంతోషంగా గడపాలనుకుంది. కానీ కొన్నాళ్లకే సీన్‌ రివర్సైంది. ఆమె భర్త నిజ స్వరూపమేంటో కొన్ని నెలల్లోనే ఆమెకు తెలిసిపోయింది. ఏ కారణం లేకుండానే చీటికీ మాటికీ అతడు తన మాటలు, చేతలతో ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. పైగా తన భార్య విషయంలో ఒక రకమైన అభద్రతా భావానికి గురయ్యేవాడు.

12 ఏళ్లుగా ఇంట్లోనే బంధించి..!

ఈ అభద్రతతోనే సుమతిని ఒక గదిలో బంధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు తమ పిల్లలిద్దరినీ స్కూల్‌కి పంపించి ఇంటికి తాళం వేయడం.. సాయంత్రం తాను తిరిగి ఇంటికొచ్చాకే తాళం తీయడం చేసేవాడు. ఆలోపే పిల్లలిద్దరూ స్కూల్‌ నుంచి ఇంటికొచ్చినా.. తండ్రి వచ్చే దాకా ఆరుబయటే గడిపేవారు. ‘అమ్మా ఆకలేస్తోంద’ని పిల్లలు అడుగుతుంటే.. తన గది కిటికీ సందులో నుంచి సుమతి వారికి ఏదో ఒక ఆహారం అందించేది. ఇలా భర్త, పిల్లలు ఉన్నా ఒంటరిగా తన ఇంట్లోనే పరాయివాళ్లలా బిక్కుబిక్కుమంటూ గడిపేదామె. కనీసం టాయిలెట్‌కు కూడా వెళ్లలేని దుస్థితి ఆమెది. దీంతో ఒక డబ్బానే టాయిలెట్‌గా వాడుకునేదట! గత 12 ఏళ్లుగా ఇలాంటి దుస్థితిలో మగ్గుతోన్న సుమతి.. తన భర్త పెడుతోన్న హింసను అటు పుట్టింటి వారితో, ఇటు పోలీసులతో కూడా చెప్పలేని పరిస్థితి. అయితే అదృష్టం బాగుండి.. ఇటీవలే స్థానిక పోలీసుల సహాయంతో ఈ నరక కూపం నుంచి బయటపడింది సుమతి. ఈ 12 ఏళ్లుగా తాను అనుభవించిన యాతనను పోలీసుల ముందు ఏకరువు పెట్టుకుంది.

ఈ భర్తా వద్దు.. కాపురమూ వద్దు..!

‘నాకు పెళ్లై 12 ఏళ్లైంది. వివాహంతో నా జీవితంలోని సంతోషం ఆవిరైపోయిందని ఆ తర్వాతే తెలుసుకున్నా. నా భర్త నన్నెప్పుడూ ఒక గదిలో బంధించి ఉంచేవాడు.. వేధింపులకు గురిచేసేవాడు. ఇరుగు పొరుగు వాళ్లూ ఈ విషయం తెలిసినా మౌనం వహించారు. ఎందుకిలా చేస్తున్నారని అడిగిన వాళ్లు ఒక్కరూ లేరు. నా పిల్లలిద్దరూ సాయంత్రం స్కూల్‌ నుంచి తిరిగొచ్చినా నా భర్త వచ్చేవరకు ఆరుబయటే వేచి చూసేవారు. ఆకలని అడిగితే నా గదిలో ఏ ఆహార పదార్థముంటే దాన్ని గది కిటికీలో నుంచి వారికి అందించేదాన్ని. గత 12 ఏళ్లుగా ఇదే నరకంలో మగ్గుతూ వచ్చా..’ అంటూ పోలీసుల ఎదుట మొరపెట్టుకుంది సుమతి. ఈ క్రమంలో పోలీసులు భార్యాభర్తలిద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చి చూశారు. అయినా ఫలితం లేకపోవడంతో ‘నాకీ భర్తా వద్దు.. కాపురమూ వద్దు.. పిల్లలతో కలిసి అమ్మానాన్నలతోనే ఉంటా..’నని సుమతి అనడంతో ఇక చేసేది లేక ఆమెను పుట్టింటికి పంపించేశారు. అయితే ఇంత జరిగినా.. సుమతి తన భర్తకు వ్యతిరేకంగా కేసు పెట్టకపోవడం గమనార్హం. అలాగే సుమతిని తన భర్త గత 12 ఏళ్లుగా కాకుండా.. గత కొన్ని వారాల నుంచే బంధించి ఉంచినట్లు, గతంలో ఆమె తన తల్లిదండ్రుల వద్దకూ పలుమార్లు వెళ్లొచ్చినట్లు పోలీసులు చెప్పడం కొసమెరుపు! ఇక మరో విషయం ఏంటంటే.. సుమతితో అతడికి ఇది మూడో వివాహమట.

మౌనం వీడరా..?

ఏదేమైనా గృహహింసకు, వేధింపులకు పరాకాష్టగా నిలుస్తుందీ ఘటన. నిజానికి ఇలాంటి వేధింపుల్లో వెలుగు చూసేవి కొన్నే! వ్యక్తిగత కారణాల వల్లో, పరువు పోతుందనో, తల్లిదండ్రుల ఒత్తిడితోనో.. ఇలాంటి హింసను మౌనంగా భరిస్తోన్న మహిళలు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇలా శారీరకంగా, మానసికంగా హింసకు గురవుతూ నరకంలో మగ్గే కంటే.. వీటిని ధైర్యంగా బయటపెట్టినప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో బాధితులు గృహహింస చట్టాన్ని ఆశ్రయించచ్చు.. పోలీసులకు ఫిర్యాదు చేసి రక్షణ పొందచ్చు.. వాళ్లు కౌన్సెలింగ్‌ ఇచ్చి జంటల మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నిస్తారు.. ఒకవేళ పరిస్థితులు సానుకూలంగా ఉంటే అనుబంధాన్ని నిలబెట్టుకోవచ్చు.. లేదంటే ధైర్యంగా నిర్ణయం తీసుకునే హక్కు ప్రతి మహిళకూ ఉంది.. అంతేకానీ.. వేధింపుల్ని మౌనంగా భరిస్తూ చేయని తప్పుకి శిక్ష అనుభవించడం మాత్రం అవివేకం అంటున్నారు నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్