ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!

ట్రావెలింగ్‌.. ప్రతి ఒక్కరి బకెట్‌ లిస్ట్‌లో ఉంటుందిది. అయితే ఈ క్రమంలో వీలు చిక్కినప్పుడు ప్రయాణాలకు ప్లాన్‌ చేసుకొనే వారు కొందరైతే.. మరికొందరు వీలు కుదుర్చుకొని మరీ నచ్చిన ప్రదేశాలకు వెళ్తుంటారు. ఒంటరి ప్రయాణాల్ని ఇష్టపడే వారు ఇంకొందరుంటారు.

Updated : 27 Mar 2024 19:14 IST

ట్రావెలింగ్‌.. ప్రతి ఒక్కరి బకెట్‌ లిస్ట్‌లో ఉంటుందిది. అయితే ఈ క్రమంలో వీలు చిక్కినప్పుడు ప్రయాణాలకు ప్లాన్‌ చేసుకొనే వారు కొందరైతే.. మరికొందరు వీలు కుదుర్చుకొని మరీ నచ్చిన ప్రదేశాలకు వెళ్తుంటారు. ఒంటరి ప్రయాణాల్ని ఇష్టపడే వారు ఇంకొందరుంటారు. హైదరాబాద్‌కు చెందిన శేషరత్నంకు కూడా సోలో ట్రావెలింగ్‌ అంటే మక్కువ. ఈ ఇష్టమే ఆమెను ఉత్తర భారతదేశంలోని పలు చారిత్రక ప్రదేశాల్ని సందర్శించేలా చేసింది. ఒక్క రోజులోనే, అదీ ఒంటరిగా నచ్చిన ప్రదేశాల్ని చుట్టేసిన ఆమె.. తన ప్రయాణ అనుభవాల్ని ‘వసుంధర.నెట్‌’తో ప్రత్యేకంగా పంచుకున్నారు. ఆ అనుభూతులు ఆమె మాటల్లోనే మీకోసం..!

హాయ్,

‘వెయ్యి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది..’ అన్నారు చైనీస్‌ తత్త్వవేత్త లావో ట్జు.

‘సోలో ట్రావెలింగ్ నీలో దాగున్న భయాలను తొలగిస్తుంది’ అన్న మాటలు విన్నప్పట్నుంచి జీవితంలో ఒక్కసారైనా ఒంటరిగా ప్రయాణించాలనుకున్నా. ఈ క్రమంలోనే నా మొదటి ప్రయాణం అద్భుతంగా ఉండేలా ప్లాన్ చేసుకున్నా. ఎప్పట్నుంచో కొన్ని ప్రదేశాలు చుట్టేయాలన్న కోరిక నాలో ఉంది. అందుకే వాటిని నా బకెట్‌ లిస్ట్‌లో చేర్చుకున్నా. వాటిలో అహ్మదాబాద్ దగ్గర్లోని మొధేరా సన్ టెంపుల్, రాణీ కీ వావ్, మాతృగయ తీర్థ స్థలం ఉన్నాయి. ఒక్కరోజులోనే వీటన్నింటినీ సందర్శించాలని ప్లాన్‌ చేసుకున్నా. నా సహోద్యోగి సహకారంతో ట్యాక్సీ అద్దెకు తీసుకొని, ఉదయాన్నే అల్పాహారం ముగించుకొని ఎనిమిది కల్లా హోటల్‌ నుంచి బయల్దేరాను. మొధేరా సన్ టెంపుల్‌కు చేరుకొనే సరికి పదైంది.

52 పిల్లర్లు.. 52 వారాలకు సూచికలు!

గుజరాత్‌లోని మెహ్‌సానా జిల్లాలో మొధేరా అనే గ్రామంలో ఉందీ సూర్య దేవాలయం.. సాధారణంగా మన దేశంలో సూర్య దేవాలయం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఒడిశాలోని కోణార్క్‌ సూర్య దేవాలయం, ఆపై ఆంధ్రప్రదేశ్‌ శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి సూర్య నారాయణ స్వామి ఆలయం. వీటితో పాటు మొధేరా సన్‌ టెంపుల్‌ కూడా ప్రసిద్ధి గాంచింది. బ్రహ్మ పురాణంలోనూ ఈ ఆలయ వైశిష్ట్యం గురించి ప్రస్తావించారు. ఈ ఆలయాన్ని 11 వ శతాబ్దంలో సోలంకి రాజవంశానికి చెందిన రాజు భీందేవ్‌-1 నిర్మించినట్లు ఆలయ ప్రాంగణంలో ఉన్న శాసనాల ద్వారా తెలుస్తోంది. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఈ టెంపుల్‌ను కోణార్క్‌ కంటే ముందే నిర్మించారట! ఈ ఆలయ నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు, అద్భుతాలు దాగున్నాయి. వాస్తు శిల్ప కళా నైపుణ్యానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచే ఈ సూర్య దేవాలయంలో సూర్యుడికి సంబంధించిన విశేషాల దగ్గర్నుంచి రామాయణం వరకు.. ఎన్నో ఆసక్తికర విషయాల్ని అక్కడి రాళ్లపై స్పష్టంగా చెక్కారు. అంతేకాదు ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కడా సున్నం ఉపయోగించలేదట! ఇక ఈ దేవాలయంలో ఉన్న తూర్పు సూర్య కుండ్ తటాకం, దాని చుట్టూ నిర్మించిన 108 చిన్న చిన్న గుళ్లు, 52 పిల్లర్లతో నిర్మించిన అసెంబ్లీ హాల్, గర్భ గుడి హంగులు.. ఇవన్నీ నాటి చారిత్రక సంపదకు నిలువుటద్దంలా నిలుస్తున్నాయి. ఇక ఈ 52 పిల్లర్లు ఏడాది పొడవునా 52 వారాల్ని సూచిస్తాయట! చూపు తిప్పుకోలేని అద్భుత శిల్ప కళా నైపుణ్యంతో ఈ ఆలయం అలరారుతోంది. ఇక సాయంత్రం ఇక్కడ జరిగే లైట్-సౌండ్ షో అచ్చెరువొందిస్తుంది. ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే.. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో మన దేశంలో ఎన్నో దేవాలయాలు కూల్చివేతకు గురయ్యాయి. ఈ క్రమంలో మొధేరా సూర్య దేవాలయంలోని కొంత భాగం కూడా నష్టపోయింది. 2014లో ఈ ఆలయాన్ని ‘ప్రపంచ వారసత్వ ప్రదేశం’గా యునెస్కో గుర్తించింది.

‘రాణీ కీ వావ్‌’ గురించి తెలుసా?

ఈ ఆలయ దర్శనం పూర్తయ్యాక మోధేశ్వరి మాతను దర్శించుకొని.. అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాటన్ సిటీ వైపు నా ప్రయాణం సాగింది. మీరంతా రూ. 100 నోటు మీదున్న బావి ఫొటో చూసే ఉంటారు. అదే ‘రాణీ కీ వావ్‌’. ఏడంతస్తుల దిగుడు బావి అది. 11 వ శతాబ్దంలో రాణి ఉదయమతి ఈ బావిని కట్టించారు. సోలంకి రాజ్యాన్ని పాలించిన తన భర్త, రాజు భీందేవ్‌-1 జ్ఞాపకార్థం ఈ బావిని ఆమె నిర్మింపజేశారు. దాదాపు ఏడు శతాబ్దాల పాటు వరదలకు మట్టిలో కూరుకుపోయిన ఈ బావిని 1980ల్లో భారత పురావస్తు శాఖ గుర్తించి పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. భారత్‌లో నాటి ప్రత్యేక భూగర్భ నిర్మాణ కౌశలానికి, కళాత్మకతకు దీన్ని ఒక ఉదాహరణగా కొనియాడుతూ.. ‘ప్రపంచ వారసత్వ ప్రదేశం’గా యునెస్కో దీన్ని గుర్తించింది. ఇక 2018, జులై 19 న ‘రిజర్వ్‌ బ్యాంక్‌’ విడుదల చేసిన కొత్త వంద రూపాయల నోటుపై ‘రాణీ కీ వావ్‌’ను మోటిఫ్‌గా ప్రచురించారు.

ఎన్నెన్నో అనుభూతులు!

ఇలా ఈ బావి అందాల్ని తనివి తీరా ఆస్వాదించిన అనంతరం.. పాటోలా చీరలు నేసే మగ్గాలను, ఆ చీరల సొగసును చూసేందుకు సిద్ధ్‌పూర్‌ వైపు ప్రయాణం కొనసాగించాను. ఈ ప్రదేశాన్ని ‘మాతృగయ’గానూ పిలుస్తారు. ఈ భూమ్మీద తల్లికి తర్పణం వదిలి తల్లి రుణం తీర్చుకొనే ఏకైక ప్రదేశంగా పేరుగాంచిన ఈ ప్రాంతం బిందు సరోవరం అనే చిన్న చెరువు ఒడ్డున ఉంది. పంచ సరోవరాల్లో ఇది ఒకటి. ఇక్కడే పరశురాముడు కూడా తన తల్లికి తర్పణం వదిలి బంగారు పిండ ప్రదానం చేశాడట!  ఇక అక్కడి నుంచి దారిలో ఉన్న కొన్ని జైన మందిరాల్ని దర్శిస్తూ.. గాంధీనగర్‌లోని అదలాజ్‌ మెట్ల బావికి చేరుకున్నా. రుడాబాయి మెట్ల బావిగా పిలిచే దీన్ని.. 1498లో అక్కడి రాజు రాణా వీర్ సింగ్ జ్ఞాపకార్థం అతని భార్య రాణి రుడాబాయి నిర్మించారు. ఇలా నేను చూసిన ఈ అత్యద్భుతమైన కట్టడాలు కొన్ని తెలుగు సినిమాల్లోనూ కనిపిస్తుంటాయి. ఒక్క రోజులోనే ఇన్ని అత్యద్భుతమైన, చారిత్రక కట్టడాల్ని చూసిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. ఇలా నా జీవితంలోని మొదటి సోలో ట్రిప్‌ మర్చిపోలేని జ్ఞాపకంగా, మధురానుభూతిగా మిగిలిపోయింది.

- శేషరత్నం, హైదరాబాద్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్