వావివరసలు మరిచి.. లైంగికంగా వేధించారు!

మంచేదో-చెడేదో తెలుసుకోలేని పసితనం.. మనవాళ్లకు-పరాయివాళ్లకు తేడా తెలియని చిన్న వయసు.. దీన్నే అలుసుగా తీసుకొని పసిమొగ్గలపై ఎంతోమంది కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ముక్కూమొహం తెలియని వాళ్లే కాదు.. కుటుంబ సభ్యులు, సన్నిహితులు....

Updated : 16 Mar 2023 14:38 IST

(Photos: Instagram)

మంచేదో-చెడేదో తెలుసుకోలేని పసితనం.. మనవాళ్లకు-పరాయివాళ్లకు తేడా తెలియని చిన్న వయసు.. దీన్నే అలుసుగా తీసుకొని పసిమొగ్గలపై ఎంతోమంది కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ముక్కూమొహం తెలియని వాళ్లే కాదు.. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు.. వావివరసలు మరిచి ఈ అకృత్యాలకు ఒడిగడుతున్నారు. దీంతో తమకు ఏం జరుగుతోందో తెలుసుకోలేక, దీని గురించి ఎవరికి చెప్పాలో అర్థం కాక.. ఆ వయసులో అమ్మాయిలు పడే మనోవేదన వర్ణనాతీతం. తమ చిన్నతనంలో అలాంటి లైంగిక వేధింపులు తామూ ఎదుర్కొన్నామంటున్నారు కొందరు సినీ తారలు. ఎవరో ముక్కూ మొహం తెలియని వ్యక్తులు కాదు.. కంటికి రెప్పలా కాచుకోవాల్సిన కన్నతండ్రే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని నటి ఖుష్బూ, దిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్‌ పెదవి విప్పారు. ఇన్నేళ్లూ ఈ బాధను తమలోనే భరించిన వారు మౌనం వీడి తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టి ఎంతోమంది బాధితుల్లో స్ఫూర్తి నింపారు. ఈ నేపథ్యంలో చిన్నతనంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో లైంగిక వేధింపుల్ని ఎదుర్కొన్న కొందరు నటీమణులు, సెలబ్రిటీల స్వీయానుభవాలు వారి మాటల్లోనే..!

ఖుష్బూ, సినీ నటి-జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు

అది అమ్మాయైనా, అబ్బాయైనా.. చిన్నతనంలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల తాలూకు చెడు జ్ఞాపకాలు, చేదు గుర్తులు జీవితాంతం వారిని వెంటాడతాయి. నా జీవితంలోనూ ఇలాంటి గడ్డు రోజులున్నాయి. భార్యాపిల్లల్ని హింసించడం, ఒక్కగానొక్క కూతురిని లైంగికంగా వేధించడం తన జన్మ హక్కుగా భావించే మా నాన్న వల్ల అమ్మ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఎనిమిదేళ్ల వయసు నుంచే ఆయన నన్ను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. నాకు 15 ఏళ్లొచ్చేదాకా ఇవి కొనసాగాయి. ఆ సమయంలో నా సమస్య గురించి అమ్మకు చెప్పే ధైర్యం చేయలేకపోయా. ఎందుకంటే ‘ఏదేమైనా భర్తే దైవం, సర్వస్వం’ అని నమ్మే తత్వం ఆమెది. ఇక 15 ఏళ్ల తర్వాత వాటిని భరించదలచుకోలేదు. అందుకే ఎదురుతిరగడం మొదలుపెట్టా. ఆపై ఏడాది తిరక్కముందే ఆయన ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఆపైనా మరెన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయితే ఆలస్యంగానైనా నాకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టినందుకు నేనేమీ సిగ్గుపడట్లేదు. నేను కాదు.. తప్పు చేసిన ఆ వ్యక్తి తలదించుకోవాలి. ఇలాంటి హింసను మౌనంగా భరిస్తోన్న మహిళల్లో స్ఫూర్తి రగిలించడానికే ఇప్పుడు ఈ విషయం బయటపెట్టా. ప్రతి ఒక్కరూ తమను కించపరిచే వాటిని మౌనంగా భరించకుండా వాటి గురించి అందరితో పంచుకునే ధైర్యాన్ని కూడగట్టుకోవాలి.


స్వాతి మలివాల్, ఛైర్‌పర్సన్, దిల్లీ మహిళా కమిషన్

నేను యుక్త వయసులో ఉన్నప్పుడు నా కన్న తండ్రే నన్ను లైంగికంగా వేధించాడు. కూతురినన్న కనికరం లేకుండా కొట్టేవాడు. తను ఇంటికి రాగానే భయపడుతూ, మంచం కింద దాక్కున్న సందర్భాలూ ఉన్నాయి. కొన్నిసార్లు నా జుట్టు పట్టుకొని గోడకేసి కొట్టేవారు. దాంతో తల నుంచి రక్తం కారేది. జీవితంలో ఇలాంటి దారుణాలను ఎదుర్కొన్న వారే ఇతరుల బాధను అర్థం చేసుకోగలరు. నేను ఎదుర్కొన్న వేధింపులు మహిళల హక్కుల కోసం ఏదైనా చేయాలన్న ఆలోచనను నాలో కలిగించాయి. ఈ తరహా దుర్మార్గాలకు పాల్పడే వారికి గుణపాఠం చెప్పాలనుకున్నా. మా కుటుంబ సభ్యుల సహకారంతోనే ఆ చేదు జ్ఞాపకాల నుంచి క్రమంగా బయటపడ్డా.


కుబ్రా సెయిత్‌, బాలీవుడ్‌ నటి

అప్పుడు నాకు 17 ఏళ్లుంటాయనుకుంటా. నేను నా కుటుంబంతో కలిసి బెంగళూరులో ఉండేదాన్ని. మా ఫ్యామిలీ అంతా తరచూ అక్కడి ఓ రెస్టరంట్‌కి వెళ్లేవాళ్లం. అలా ఆ హోటల్‌ యజమాని మాకు మంచి స్నేహితుడయ్యాడు. నేను, నా సోదరుడు అతడిని అంకుల్‌ అని పిలిచేవాళ్లం. మరోవైపు మాకు ఆర్థికంగా ఏదైనా సహాయం కావాలన్నా చేసిపెట్టేవాడు. ఆపద సమయంలో ఆదుకుంటున్నాడు కదా మంచి వ్యక్తి అనుకున్నాం.. కానీ దీన్నే అలుసుగా తీసుకొని నాతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. తరచూ మా ఇంటికొచ్చేవాడు. ఎంత ముద్దొస్తున్నావో అంటూ బుగ్గలపై ముద్దులు పెట్టేవాడు. అసభ్యంగా తాకేవాడు.. ఇలా అతని ప్రవర్తన ఇబ్బందిగా అనిపించినా నోరు మెదపలేకపోయా. అక్కడితో ఆగకుండా.. ఓసారి హోటల్‌ గదికి తీసుకెళ్లి నాపై అత్యాచారం కూడా చేశాడు. ఇలా నా జీవితంలో జరిగిన ఈ చేదు సంఘటనల్ని ‘ఓపెన్‌ బుక్‌ : నాట్‌ క్వైట్ ఎ మెమాయిర్’ అనే పుస్తకంలో పొందుపరిచా.


అనౌష్కా శంకర్‌, సితార ప్లేయర్

నా 14 ఏళ్ల వయసులో మా కుటుంబానికి నమ్మకస్తుడైన ఓ సంగీత కళాకారుడి చేతిలో నేను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురయ్యా. ఒకానొక దశలో తన గదికీ రమ్మన్నాడు. ఇలా నేనే కాదు.. ఈ సమాజంలో ఎంతోమంది మహిళలు, ఎదిగే క్రమంలో అమ్మాయిలు లైంగిక, మానసిక వేధింపులకు గురవుతున్నారు. అసభ్యంగా తాకడం, నోటికొచ్చినట్లు మాట్లాడడం.. ఇలా వారి ప్రవర్తనతో మహిళల్ని కుంగదీస్తున్నారు. నేనూ ఇలాంటి వేధింపుల్ని ఎదుర్కొన్నా. ఇలాంటి అనుభవాలతో కొన్నేళ్ల పాటు భయపడుతూనే జీవితాన్ని సాగించా. రాత్రిపూట ఒంటరిగా బయటికెళ్లాలంటే భయమేసేది. ఎవరైనా వ్యక్తి నా ఎదుటపడి మాట్లాడితే వణికిపోయేదాన్ని. నిజానికి ఆ సమయంలో ఏం చేయాలో, ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అర్థమయ్యేది కాదు. కానీ కొన్నేళ్ల తర్వాత మా కుటుంబ సభ్యుల సహకారంతో ఈ మానసిక వేదన నుంచి బయటపడగలిగా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్