28 ఏళ్ల తర్వాత.. 120 మంది అందాల భామలతో..!

సాధారణంగా అందాల పోటీలంటే ‘మిస్‌ వరల్డ్‌’ పోటీలే గుర్తుకు వస్తాయి. ప్రతి ఏడాది జరిగే ఈ పోటీల్లో ఏ దేశానికి చెందిన భామ కిరీటాన్ని ఎగరేసుకుపోతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

Updated : 29 Feb 2024 13:25 IST

(Photo: Facebook)

సాధారణంగా అందాల పోటీలంటే ‘మిస్‌ వరల్డ్‌’ పోటీలే గుర్తుకు వస్తాయి. ప్రతి ఏడాది జరిగే ఈ పోటీల్లో ఏ దేశానికి చెందిన భామ కిరీటాన్ని ఎగరేసుకుపోతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అందుకు తగ్గట్టే నిర్వాహకులు సైతం పోటీలకు ప్రతిసారీ కొత్తదనాన్ని జోడించడానికి ప్రయత్నిస్తుంటారు. అందుకే ఏడు దశాబ్దాలుగా సాగుతోన్న ఈ పోటీలకు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఈవెంట్‌కు 28 ఏళ్ల విరామం తర్వాత మన దేశం ఆతిథ్యం ఇస్తోంది. ఈ సందర్భంగా ‘మిస్‌ వరల్డ్‌’ పోటీలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాల గురించి తెలుసుకుందామా..!

⚛ ఏడు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ అందాల పోటీలకు భారత్‌ ఆతిథ్యమివ్వడం ఇది రెండోసారి. గతంలో 1996లో తొలిసారి ఇక్కడ ఈ అందాల పోటీలు నిర్వహించారు. ఆ ఏడాది గ్రీస్ భామ ఇరెనె కిరీటాన్ని ఎగరేసుకుపోయింది.

⚛ ఈ దఫా పోటీల్లో 120 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొంటున్నారు. ఒక ఎడిషన్‌లో అత్యధిక మంది కంటెస్టెంట్స్ పాల్గొంటున్న ‘మిస్‌ వరల్డ్‌’ పోటీలు ఇవే కావడం విశేషం. 2023లో జరిగిన పోటీల్లో 113 మంది బ్యూటీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మన దేశం తరఫున కర్ణాటకకు చెందిన సిని శెట్టి ‘మిస్‌ వరల్డ్‌’ కిరీటం కోసం పోటీపడుతోంది.

⚛ మిస్‌ వరల్డ్ పోటీల్లో కేవలం అందాన్ని మాత్రమే కాకుండా సామాజిక బాధ్యత, సేవా దృక్పథాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఇందుకోసమే ఈ పోటీల్లో ‘బ్యూటీ విత్‌ ఏ పర్పస్’ (BWAP) రౌండ్ను ప్రవేశపెట్టారు. ఈ రౌండ్‌లో భాగంగా పోటీదారులు సమాజంలో సానుకూల ప్రభావం చూపించే విధంగా తాము చేసిన కార్యక్రమాల గురించి వివరించాల్సి ఉంటుంది. సమాజం పైన అవి కలిగించిన ప్రభావం, వైవిధ్యం, సుస్థిరత, ఆయా కార్యక్రమాల నిర్వహణలో పోటీదారుల నిబద్ధత వంటి అంశాలను న్యాయనిర్ణేతలు పరీక్షిస్తారు.

ఇందులో భాగంగానే మన దేశానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న సిని శెట్టి ‘Aashayein- The Power of Hope’ అనే పేరుతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా పాఠశాల విద్యకు దూరమైన విద్యార్థులకు విద్యను అందించడం.. యువతకు ఉపాధి అవకాశాలు అందించడానికి సహాయపడడం.. వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

⚛ సాధారణంగా అందాల పోటీల్లో వివిధ దేశాలకు చెందిన ముద్దుగుమ్మలు తమ ప్రతిభను స్టేజీ పైనే ప్రదర్శిస్తుంటారు. కానీ, మొదటిసారిగా ఆన్‌లైన్‌లో కూడా వారి ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా MissWorld.com వేదికగా ప్రతి ఒక్కరికీ సొంతంగా మీడియా ఛానల్‌ను క్రియేట్‌ చేస్తున్నారు. ఈ వేదిక ద్వారా పోటీదారులు తమ ప్రతిభా సామర్థ్యాలను వీక్షకులతో పంచుకునే వీలు కలుగుతుంది.

⚛ ఫిబ్రవరి 20న మొదలైన ఈ పోటీలు మార్చి 9న ముగుస్తాయి. మిస్‌ వరల్డ్‌ చరిత్రలో సుదీర్ఘ కాలం జరగనున్న పోటీలు కూడా ఇవే కావడం విశేషం. కాగా, ఫైనల్‌ పోటీలు మార్చి 9 న ముంబయిలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనున్నాయి. ఇవి సోనీ లివ్‌లో ప్రత్యక్షప్రసారమవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్