Janhvi Kapoor: అలాంటి వెబ్‌సైట్లలో నా ఫొటోలు చూసి షాకయ్యా!

సెలబ్రిటీలకే కాదు.. వాళ్ల పిల్లలకూ విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంటుంది. అందుకే వాళ్లెక్కడ కనిపించినా కెమెరా కళ్లు వారినే వెంటాడతాయి. ఏ ఈవెంట్లో పాల్గొన్నా వెంటనే ఓ ఫొటో క్లిక్‌మనిపిస్తాయి. అలా వారి ఫొటోలు నెట్టింట్లో, సోషల్‌ మీడియా సైట్లలో వైరలవడం సహజమే!

Published : 23 May 2024 13:23 IST

సెలబ్రిటీలకే కాదు.. వాళ్ల పిల్లలకూ విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంటుంది. అందుకే వాళ్లెక్కడ కనిపించినా కెమెరా కళ్లు వారినే వెంటాడతాయి. ఏ ఈవెంట్లో పాల్గొన్నా వెంటనే ఓ ఫొటో క్లిక్‌మనిపిస్తాయి. అలా వారి ఫొటోలు నెట్టింట్లో, సోషల్‌ మీడియా సైట్లలో వైరలవడం సహజమే! కానీ టెక్నాలజీని దుర్వినియోగం చేయడమే పనిగా పెట్టుకున్న కొందరు సైబర్‌ మోసగాళ్లు ఈ ఫొటోల్ని మార్ఫింగ్‌ చేసి.. ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేస్తుంటారు.. తద్వారా వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తుంటారు. ఓ సెలబ్రిటీ కిడ్‌గా ఇలాంటి చేదు అనుభవం తనకూ ఓసారి ఎదురైందంటోంది బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌. అప్పుడు తనెంతో అవమానకరంగా, ఇబ్బందికరంగా ఫీలయ్యానంటోన్న ఈ ముద్దుగుమ్మ.. వీటి తాలూకు చేదు అనుభవాల నుంచి బయటపడేందుకు చాలా సమయం పట్టిందని ఇటీవలే ఓ సందర్భంలో పంచుకుంది. మరి, సినీ పరిశ్రమలో పేరున్న జాన్వీకే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయంటే.. మామూలు అమ్మాయిల పరిస్థితేంటి? అసలు ఈ ‘ఆన్‌లైన్‌ సెక్సువలైజేషన్‌’కి దూరంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రండి తెలుసుకుందాం!

బాలీవుడ్‌ స్టార్‌ పేరెంట్స్‌ శ్రీదేవి-బోనీ కపూర్‌ల ముద్దుల తనయగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది జాన్వీ. వరుస చిత్రాలు చేస్తూ, విభిన్న పాత్రల్ని ఎంచుకుంటూ తన నట ప్రతిభను ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. బాలీవుడ్‌కే పరిమితం కాకుండా.. ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ రెండు సినిమాలు చేస్తోన్న జాన్వీ.. త్వరలోనే ‘దేవర’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనుంది.

అదో చేదు అనుభవం!
ప్రస్తుతం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహీ’ చిత్ర ప్రమోషన్లతో బిజీగా గడుపుతోంది జాన్వీ. ఈ క్రమంలోనే ఇటీవలే ఓ సందర్భంలో భాగంగా.. తన టీనేజ్‌ వయసులో తానెదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది.
‘నేటికీ ఈ సమాజం మహిళల్ని ఓ వస్తువుగానే భావిస్తోంది. వారి మనోభావాలు, హక్కులు, అభిప్రాయాలతో పనిలేకుండా తమ ఆనందం కోసం వారిని ఉపయోగించుకుంటోంది. టీనేజ్‌లో నేనూ ఇలాంటి ఓ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నా. అప్పుడు నా వయసు 13 ఏళ్లు. మా అమ్మానాన్నలతో కలిసి ఓ కార్యక్రమానికి వెళ్లాను. అక్కడున్న కెమెరా కళ్లు నన్ను ఫొటోల్లో బంధించాయి. ఆ తర్వాత ఆ ఫొటోలు ఆన్‌లైన్‌లోనూ వైరలయ్యాయి. అయితే నన్ను బాధించిన విషయమేంటంటే.. నా ఫొటోలు కొన్ని అశ్లీల వెబ్‌సైట్లలోనూ కనిపించడం! మరుసటి రోజు స్కూల్లో నన్ను చూసి అబ్బాయిలు నవ్వుతుంటే.. ఫ్రెండ్స్ ద్వారా ఆ విషయం నాకు తెలిసింది. అది విని చాలా బాధేసింది.. ఇబ్బందిగా అనిపించింది. మానసికంగానూ ఒత్తిడికి గురయ్యా. దీన్నుంచి బయటపడేందుకు చాలా సమయం పట్టింది. ప్రతి ఒక్కరూ తమ శరీరాన్ని కవర్ చేస్తూనే, సౌకర్యవంతంగా ఉండే దుస్తులు ధరించడానికి ఇష్టపడతారు. అయితే కేవలం డ్రస్సింగ్‌ని బట్టే వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం మాత్రం సరికాదు..’ అందీ బాలీవుడ్‌ అందం.

చెలిమి చేసి.. వలలో వేసి!
నిజానికి ఇది జాన్వీ ఒక్కదాని సమస్యే కాదు.. ఈ రోజుల్లో చాలామంది బాలికలు, టీనేజీ అమ్మాయిలు, మహిళలు ఇలాంటి డిజిటల్‌ సెక్సువలైజేషన్‌ బాధితులవుతున్నారు. తమ ప్రమేయం లేకుండా తమ ఫొటోల్ని దొంగిలించి అసభ్యకరంగా మార్చడం, అభ్యంతరకరమైన సందేశాలు పంపడం, ఫోన్లు/సందేశాల్లో అసభ్యకరమైన ప్రవర్తనతో విసిగించడం.. ఇలా ఈ కాలపు అమ్మాయిలు వివిధ రూపాల్లో ఈ డిజిటల్‌ సమస్య బారిన పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ‘మనిద్దరి అభిరుచులు ఒకటేనం’టూ ముందు పరిచయం పెంచుకోవడం, చెలిమి పెరిగాక వారు పంచుకునే వ్యక్తిగత సమాచారం, ఫొటోల్ని ఉపయోగించుకొని వారిని బ్లాక్‌మెయిల్‌ చేయడం, మరో అడుగు ముందుకేసి వాళ్ల సోషల్‌ మీడియా అకౌంట్లనూ హ్యాక్‌ చేయడం.. ఇలా ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడే వారు ఎంతకైనా దిగజారే అవకాశాలున్నాయంటున్నారు.

మనసును దెబ్బతీస్తాయ్‌!
సెలబ్రిటీలు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు.. కొంతమంది సామాన్యులు కూడా తమ ఫొటోలు, తమ పిల్లల ఫొటోల్ని తరచూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు.. ఏదైనా వేడుక/ఈవెంట్లో పాల్గొన్నప్పుడు అక్కడున్న వారితో దిగిన ఫొటోలు నెట్టింట్లో దర్శనమిస్తుంటాయి. మనం ఎలా దిగామో ఫొటోలు అలా ఉంటే ఓకే.. కానీ కొంతమంది వీటిని మార్ఫింగ్‌ చేసి.. లేనిది ఉన్నట్లుగా సృష్టించి.. అసభ్యకరంగా మార్చి ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేస్తుంటారు. మన ప్రమేయం లేకుండా మారిపోయిన ఇలాంటి ఫొటోలు, వీడియోలు మన కంట పడితే మానసిక ఒత్తిడికి గురవుతాం. ఈ ఒత్తిడే క్రమంగా మనల్ని మనం విమర్శించుకునే, కుంగిపోయే స్థితికి తీసుకెళ్తుంది. అంతేకాదు.. కాస్త చిన్న పిల్లలైతే వీటిని చూసి తమ శరీరాకృతి విషయంలో అవాస్తవమైన అంచనాల్ని ఏర్పరచుకునే అవకాశమూ లేకపోలేదు. కొంతమందైతే బాడీ షేమింగ్‌ బారిన పడే ప్రమాదమూ ఉంటుంది. ఇక ఇలాంటి ఫొటోలు చూసి ఇతరులూ మనపై చెడు అభిప్రాయానికి వచ్చే ఆస్కారం ఎక్కువ! దీనివల్ల సామాజిక సంబంధాలు దెబ్బతింటాయి. ఇలా ఎలా చూసినా డిజిటల్‌ సెక్సువలైజేషన్‌ శారీరకంగా, మానసికంగా ప్రతికూల ప్రభావాల్నే మిగుల్చుతుందని చెబుతున్నారు నిపుణులు.


గోప్యత ముఖ్యం!

ఇలా వేరొకరి వ్యక్తిగత గోప్యత, ప్రతిష్టకు భంగం కలిగించడమే పనిగా పెట్టుకున్న సైబర్‌ నేరగాళ్ల చేతిలో చిక్కకుండా ఉండాలంటే కొన్ని ముందస్తు జాగ్రత్తలు పాటించడం, పిల్లల విషయంలోనూ తల్లిదండ్రులు అలర్ట్‌గా ఉండడం మంచిదంటున్నారు నిపుణులు.
* వీలైనంత వరకు వ్యక్తిగత సమాచారం, ఫొటోల్ని ఇతరులకు పంపించకుండా జాగ్రత్తపడాలి.. అలాగే సోషల్‌ మీడియాలోనూ ఇతరులకు మన ఫొటోలు, వీడియోలు కనిపించకుండా ఆయా ఖాతాల్లో ప్రైవసీ సెట్టింగ్స్‌ చేసుకోవాలి.
* వేడుకలు, ఇతర ఈవెంట్లకు వెళ్లినప్పుడు ఇతరుల ఫోన్లలో ఫొటోలు దిగడం, సెల్ఫీలకు పోజివ్వడం.. వంటివి చేయకూడదు. దీనివల్ల కూడా డిజిటల్‌ సెక్సువలైజేషన్‌ ముప్పు పొంచి ఉండచ్చు.
* చిన్నారులు, టీనేజీ దశలో ఉన్న అమ్మాయిలు దేనికైనా ఇట్టే ఆకర్షితులవుతారు. అలాగే ఆన్‌లైన్లో మార్ఫింగ్‌కి గురైన తమ ఫొటోల్ని చూసుకొని మానసిక ఒత్తిడికి గురవడం, ఇతరుల విమర్శల్ని తట్టుకోలేకపోవడం, లైంగిక అంశాలపై అవగాహన కొరవడి.. కంటికి కనిపించేదే నిజమని నమ్మడం.. ఇలాంటి సమస్యల వలలో చిక్కుకోకుండా తల్లిదండ్రులు వాళ్లను ముందే అలర్ట్‌ చేయాలి. డిజిటల్‌ సెక్సువలైజేషన్‌, లైంగిక అంశాలపై సున్నితంగా వారికి వివరించే ప్రయత్నం చేయాలి.
* తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం, తెలిసిన వారే కదా అని వారికి పంపించడం.. వంటి అలవాట్లు మానుకోవాలి. ఎందుకంటే దీనివల్ల కూడా చిన్నారుల ఫొటోలు మార్ఫింగ్‌కి గురయ్యే ప్రమాదం ఉంటుంది. తద్వారా వారి వ్యక్తిగత గోప్యత దెబ్బతింటుంది.
* అమ్మాయిలు-అబ్బాయిలు అన్న తేడా లేకుండా చిన్నారులకు స్కూల్లో కూడా లైంగిక అంశాలపై అవగాహన కల్పించాలి. ఈ క్రమంలో టీచర్లు చొరవ చూపాలి. ఇది కూడా ఆన్‌లైన్‌ సెక్సువలైజేషన్‌కు అడ్డుకట్ట వేసేందుకు దోహదం చేస్తుందంటున్నారు నిపుణులు.
* ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఒకవేళ ఇలాంటి ఫొటోలు, వీడియోలు ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లలో అసభ్యకరంగా కనిపించినట్లయితే భయపడకుండా.. ఆందోళన చెందకుండా.. వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి; సదరు ఫొటోలు, వీడియోలను వెంటనే తొలగించేలా జాగ్రత్తపడాలి.
* తమ ఫొటోలు ఆన్‌లైన్లో అసభ్యకరంగా కనిపిస్తే.. ఎవరైనా ఆందోళనకు గురవడం సహజం. ఈ క్రమంలో ఇతరుల నుంచి వచ్చే విమర్శల తాకిడి వల్ల లేదంటే బాడీ షేమింగ్‌కి గురవడం వల్ల తమను తాము నిందించుకుంటూ, గిల్టీగా ఫీలవుతారు కొందరు. దీనివల్ల మానసిక ఒత్తిడి తప్ప మరే ప్రయోజనం ఉండదు. కాబట్టి దీన్నుంచి బయటపడాలంటే స్వీయ ప్రేమను పెంపొందించుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ఇదే మనలో పాజిటివిటీని నింపుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్