ఈ కార్తీక ఆచారాలుఎందుకు పాటించాలో తెలుసా?

కార్తీక మాసం.. శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో స్త్రీలు ఎంతో భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడిని పూజిస్తారు. అనేక వ్రతాలు, నోములు ఆచరిస్తారు.

Published : 26 Nov 2023 12:21 IST

కార్తీక మాసం.. శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో స్త్రీలు ఎంతో భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడిని పూజిస్తారు. అనేక వ్రతాలు, నోములు ఆచరిస్తారు. సూర్యోదయానికి ముందే లేవడం, చన్నీటితో స్నానం, నదిలో దీపాలు వదలడం, గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టడం, కాళ్లకు పసుపు రాసుకోవడం, ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేయడం.. ఇలా చాలా రకాల పద్ధతులు పాటిస్తుంటారు. వీటివల్ల దైవానుగ్రహం పొందడంతో పాటు ఆరోగ్య పరంగా కూడా అనేక ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి..

నదీస్నానం..

కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నిద్ర లేచి నదులకు వెళ్లి స్నానం చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఫలితంగా ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అదెలాగంటే.. నది నీరు కొండలు, కోనలు, చెట్లు.. ఇలా అన్నింటినీ తాకుతూ ప్రవహిస్తుంది. దీనివల్ల వాటిపై ఉండే మూలికల రసం ఆ నీటిలో కలుస్తుంది. కాబట్టి ఈ నీటితో స్నానం చేయడం ఆరోగ్యదాయకం. అలాగే నది నీరు చల్లగా ఉంటుంది. కాబట్టి చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగి ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయి. అందుకే ఈ మాసంలో చాలామంది చన్నీటి స్నానానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అయితే కలుషితమైన నదుల్లో, చెరువుల్లో స్నానం చేసే ముందు మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే.

దీపాలు వదలడం..

నదీస్నానం ముగిసిన తర్వాత నదిలో దీపాల్ని వదలడం కూడా కార్తీకమాసంలో పాటించే ముఖ్యమైన ఆచారం. ఇందుకోసం.. బియ్యప్పిండిలో కొన్ని నీళ్లు పోసి ముద్దలా చేసుకోవాలి. దాంతో ప్రమిద ఆకారంలో చేసి అందులో ఆవు నెయ్యి, వత్తులు వేసి దీపం వెలిగించాలి. అలాగే ఉసిరి కాయతో అయితే.. ఉసిరి కాయ పైభాగంలో తొక్క తీసేసి లోపలి గుజ్జంతా తొలగించాలి. దానిలో ఆవునెయ్యి, వత్తులు వేసి దీపం వెలిగించాలి. వాటిని అరటి దొప్పలో పెట్టి నదిలో వదిలేయాలి. దీనివల్ల దీపాల వేడికి వాతావరణంలోని క్రిములు, కీటకాలు, దోమలు నశించిపోయి గాలి శుద్ధవుతుంది. దాన్ని మనం పీల్చుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండచ్చన్నది ఈ ఆచారంలోని అంతరార్థం!

దీపారాధన..

కార్తీక మాసం అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది దీపారాధన. సాయం సంధ్యలో ఇంటి ముంగిలిలో, ఇంటి చుట్టూ, తులసి కోట దగ్గర.. ఇలా దీపాలతో అలంకరిస్తే ఇళ్లంతా శోభాయమానంగా కనిపిస్తుంది. అలాగే చలికాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి దీపాల వేడికి, పొగకు దోమలు పారిపోతాయి. ఫలితంగా దోమకాటు బారిన పడకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే గుళ్లలో కూడా చాలామంది దీపారాధన చేస్తుంటారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున, కొంతమంది కార్తీక సోమవారాల్లో 365 వత్తులతో అఖండ దీపం వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల సంవత్సరమంతా దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందన్నది భక్తుల విశ్వాసం.

గుమ్మాలకు తోరణాలు..

ఏ శుభకార్యానికైనా, పండగలకైనా గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టడం మన సంప్రదాయం. ఇలా పచ్చటి ఆకుల్ని ముఖద్వారాలకు కట్టడం వల్ల ఆ ఆకులు గాలిలోని కార్బన్‌ డై ఆక్సైడ్‌ను పీల్చుకొని స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను మనకు అందిస్తాయి. ఇలా గాలిని శుద్ధిచేసి మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి మామిడాకులకు ఉంది.

కాళ్లకు పసుపు..

పూజలు, వ్రతాలు, శుభకార్యాలు.. ఇలాంటి సందర్భాల్లో స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకోవడం పరిపాటే! ఈ మాసంలో చలి అధికంగా ఉంటుంది కాబట్టి కాళ్లు కూడా ఎక్కువగా పగులుతుంటాయి. ఇలా పసుపు రాసుకోవడం వల్ల అందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు పగుళ్లను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ క్రమంలో కొంతమంది మహిళలు స్నానానికి ముందు ఒంటికి కూడా పసుపు పెట్టుకొని స్నానం చేస్తారు.

ఉసిరి, తులసి.. పూజ

కార్తీక మాసంలో ఉసిరి, తులసి మొక్కలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. వీటిలో ఆరోగ్యానికి ఉపయోగపడే చాలా రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. కాబట్టి ఈ రెండు మొక్కల్ని ఆరాధించడం వల్ల సౌభాగ్యంతో పాటు ఆరోగ్యం కూడా కలకాలం తోడుంటుంది. అలాగే ఈ కాలంలో ఉసిరి కాయలు ఎక్కువగా లభిస్తాయి. వీటివల్ల శీతాకాలంలో ఎదురయ్యే జలుబు, దగ్గు, గొంతునొప్పి.. తదితర రుగ్మతల నుంచి ఉపశమనం పొందచ్చు. అలాగే శరీరంలోని విషపదార్థాలు కూడా తొలగిపోతాయి. మరికొంతమందైతే ఉసిరి కాయల్ని మెత్తగా నూరి ఆ గుజ్జును స్నానం చేసే నీటిలో కలుపుకొంటారు. ఇలా చేయడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. దీనివల్ల నీటిలో ఉండే క్రిములు నశించిపోతాయి. అలాగే చర్మానికి ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా జాగ్రత్తపడచ్చు.

వనభోజనాలు..

కార్తీక వనభోజనాల గురించి అందరికీ తెలిసిందే. కొంతమంది కలిసి ఇంట్లో చేసుకున్నవి కావచ్చు.. లేదంటే ఒక ప్రదేశానికి వెళ్లి అక్కడ చేసుకున్నవి కావచ్చు.. ఇలా కొన్ని రకాల వంటకాలు తయారు చేసుకుని అందరూ కలిసి ఒకచోట కూర్చుని ఆనందంగా ఆరగిస్తారు. ముఖ్యంగా ఉసిరి చెట్టుకింద కూర్చుని భోజనం చేయడం విశేషంగా భావిస్తారు. ఇలాంటి సందర్భంలో పై నుంచి ఉసిరి ఆకులు మనపై పడుతుంటాయి. ఈ ఆకుల్లో చాలా రకాల ఔషధ గుణాలుంటాయి. కాబట్టి ఇలా పైన పడినప్పుడు అందులోని ఔషధ గుణాల్ని మన శరీరం గ్రహించడం వల్ల ఆరోగ్యంగా ఉండచ్చు. అలాగే అందరూ కలిసి ఒకచోట చేరి వనభోజనాల పేరిట సత్కాలక్షేపం చేయడం వల్ల వ్యక్తుల మధ్య సంబంధబాంధవ్యాలు కూడా మెరుగవుతాయి.

ఉపవాసం చేయడం..

కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి.. మొదలైన రోజుల్లో ఎక్కువమంది ఉపవాస దీక్ష చేస్తుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల శరీరంలో క్లెన్సింగ్ ప్రక్రియ జరిగి విషపదార్థాలు తొలగిపోతాయి. ఫలితంగా శరీరం పునరుత్తేజితమవుతుంది.

మాంసం ముట్టరు..

ఈ మాసంలో కొంతమంది మాంసాహారం తినకపోవడం తెలిసిందే. కార్తీక మాసం పవిత్రతతో పాటు దీనికీ ఓ శాస్త్రీయ కారణం ఉంది. వాతావరణంలో వేడి తక్కువగా ఉండడం వల్ల ఈ కాలంలో మాంసాహారం సులభంగా జీర్ణం కాదు. దీనివల్ల పలు జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తడంతో పాటు శరీరానికి ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో మాంసాహారం తినకపోవడం వల్ల ఆరోగ్యంగా ఉండచ్చనేది పలువురి భావన.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్