ఇంటికో సీతమ్మ తల్లి!

దయ.. ధైర్యం.. వివేకం.. ఆత్మాభిమానం వంటి సకల గుణాల కలబోత 'సీత'. సీత లేనిదే రామాయణం లేదు. సీత లేకుండా రాముని జీవితాన్ని అసలు ఊహించలేం. సీతలోని సుగుణాలు నేటి మగువలకు ఎంతో ఆదర్శం.. ఆమె చరితం ఓ స్ఫూరిదాయకమైన కథాసాగరం. రామాయణంలో ఏ ఘట్టం తీసుకున్నా సీత గుణగణాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తాయి.

Published : 17 Apr 2024 13:06 IST

దయ.. ధైర్యం.. వివేకం.. ఆత్మాభిమానం వంటి సకల గుణాల కలబోత 'సీత'. సీత లేనిదే రామాయణం లేదు. సీత లేకుండా రాముని జీవితాన్ని అసలు ఊహించలేం. సీతలోని సుగుణాలు నేటి మగువలకు ఎంతో ఆదర్శం.. ఆమె చరితం ఓ స్ఫూరిదాయకమైన కథాసాగరం. రామాయణంలో ఏ ఘట్టం తీసుకున్నా సీత గుణగణాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తాయి. ఆ మాటకొస్తే- ఈ ఆధునిక యుగంలో సైతం సీతమ్మ తల్లికి ప్రతీకలుగా నిలిచే మహిళలు ఎందరో! ఎప్పుడో త్రేతా యుగంలోనే కాదు.. ఈ టెక్నాలజీ శకంలోనూ ఇంటికో సీతమ్మ తల్లి వారసురాలు కనిపిస్తుంది.

ధర్మమూర్తి

ఒక ఇల్లాలిగా తన భర్త బాధ్యతలో, కర్తవ్య దీక్షలో తను కూడా పాలుపంచుకొని ఆదర్శ గృహిణిగా మారిన మహాసాధ్వి 'సీతాదేవి'. రాముడు తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి అరణ్యవాసానికి వెళ్లినప్పుడు భర్త అడుగుజాడల్లో తనూ నడిచి, అతని కష్టసుఖాల్లో పాలుపంచుకోవడానికి సిద్ధమై ధర్మపత్నిగా తన ధర్మాన్ని నిర్వర్తించింది.

అభిమానవతి

సీతకు ఆత్మాభిమానం ఎక్కువ. చిత్రకూటానికి సీతారాములు వచ్చారని తెలిసి, ఆమె తండ్రి జనకుడు వారిని కలిసి వనవాసం పూర్తయ్యే దాకా మిథిలా నగరానికి వచ్చి తనతో పాటు ఉండమని కోరినప్పుడు, ఆ మాటలను సున్నితంగా తిరస్కరించిన ఆత్మాభిమాని సీత. మెట్టినింటికొచ్చాక ఎన్ని విషమ పరిస్థితులెదురైనప్పటికీ తామే పరిష్కరించుకోవాలి గానీ, పుట్టింటి వారిని ఇబ్బంది పెట్టకూడదన్న అభిమానవతి ఆమె.

జంతు ప్రేమికురాలు

ప్రకృతి మీద, పశుపక్ష్యాదుల మీద ఎనలేని ప్రేమ కలిగిన స్త్రీమూర్తి సీత. అదే ప్రేమతో అందమైన జింకను తన కోసం తీసుకురమ్మని భర్తను అభ్యర్థిస్తుంది ఆమె.

దయాశీలి

పేదవారిని ఆదరించి అన్నం పెట్టాలన్న దయాగుణం గల స్త్రీమూర్తి సీత. అదే భావనతో తనింటికి మారువేషంలో భిక్షాటనకు వచ్చిన రావణుడికి లక్ష్మణరేఖ దాటి మరీ భిక్ష వేసిన దయామూర్తి ఆమె.

వివేకవంతురాలు:

రావణాసురుడు తనను అపహరించి తీసుకెళ్లిపోతున్నప్పుడు, రాముడికి తన ఆనవాళ్లు చిక్కడం కోసం బంగారు నగలను నేల మీద జారవిడిచిన వివేకవంతురాలు సీత.

ప్రేమమూర్తి

సీతకు రామునిపై ఎంతటి ప్రేమానురాగాలంటే .. ఆ ప్రేమలో తనను తానే మైమరిచిపోయేది. రావణుడి చెరలో బందీగా ఉండి కూడా నిత్యం శ్రీరామ నామస్మరణ చేస్తూ అనుక్షణం పతి క్షేమాన్ని కోరేది.

చైతన్యశీలి

సీత ఎంత చైతన్యశీలి అంటే అపాయంలో కూడా భయంతో ఆమె శత్రువులకు లొంగలేదు. రావణుడు సీతను బెదిరించి, తన వశం కావాలని ఆదేశించినప్పుడు, ఒక గడ్డిపరకను చూపించి నువ్వు దీంతో సమానం అని చెప్పకనే చెప్పిందామె. అలా అతని ధర్మహీనతను ప్రశ్నించిన ప్రజ్ఞావంతురాలు సీతమ్మ.

క్షమాగుణం

రాక్షస సంహారం తర్వాత సీతను అశోకవనం నుంచి విడిపించి తీసుకువెళ్తున్న సమయంలో, తను బందీగా ఉన్నప్పుడు ఆ వనంలో తనను మాటలతో హింసించిన రాక్షసులకు ఏ కీడు తలపెట్టవద్దని, వారు స్వామిభక్తితో తమ బాధ్యతను మాత్రమే నిర్వర్తించారని హనుమంతునితో చెప్పిన క్షమాగుణం సీత సొంతం.

ధైర్యశాలి

పాతివ్రత్య నిరూపణ కోసం సీతను అగ్నిప్రవేశం చేయమని రాముడు అడిగినప్పుడు ఆ పనికి సిద్ధమైన ధైర్యశాలి సీత. రాముని మాటలు ఆమె గుండెను గాయపరిచినా సహనంతో భరించింది. తానే తప్పు చేయలేదన్న ఆమె ఆత్మవిశ్వాసం చివరికి నిందారోపణ చేసిన వారిని సైతం తలదించుకునేలా చేసింది.

ఆదర్శమూర్తి

అడవిలో ఆశ్రమవాసిగా కాలం గడుపుతూ కూడా తన కుమారులను ప్రయోజకుల్ని చేయాలని ఎల్లవేళలా తపిస్తూ, వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడం ఆమె ఉత్తమ పెంపకానికి నిదర్శనం.

సీతమ్మ తల్లి గురించి మనం ఇప్పటివరకు చెప్పుకున్న ప్రతి లక్షణాన్నీ పుణికిపుచ్చుకొని కుటుంబం మొత్తానికి ఒక దిక్సూచిలా నిలిచే మహిళలు ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు. జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా.. తమదైన కార్యదక్షతతో, ధైర్య సాహసాలతో, నాయకత్వ లక్షణాలతో, అసమాన ప్రజ్ఞాపాటవాలతో ఇంటా బయటా విజయ బావుటా ఎగరేస్తున్న ఆధునిక సీతమ్మ తల్లులందరికీ పాదాభివందనం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్