Mahima Chaudhry: ముందే గుర్తించా.. రొమ్ము క్యాన్సర్‌ను జయించా!

చాలా వరకు లక్షణాలు తెలియనివ్వకుండా, చాపకింద నీరులా విస్తరిస్తూ.. ప్రాణాల మీదకు తెచ్చిపెట్టే ఆరోగ్య సమస్యల్లో క్యాన్సర్‌ ముందుంటుంది. దేశంలో ప్రతి 28 మంది మహిళల్లో ఒకరు రొమ్ము క్యాన్సర్‌ బారిన పడుతున్నారని తాజా గణాంకాలు......

Published : 10 Jun 2022 18:21 IST

(Photos: Instagram)

చాలా వరకు లక్షణాలు తెలియనివ్వకుండా, చాపకింద నీరులా విస్తరిస్తూ.. ప్రాణాల మీదకు తెచ్చిపెట్టే ఆరోగ్య సమస్యల్లో క్యాన్సర్‌ ముందుంటుంది. దేశంలో ప్రతి 28 మంది మహిళల్లో ఒకరు రొమ్ము క్యాన్సర్‌ బారిన పడుతున్నారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. అయితే స్వీయ పరీక్ష, నిర్ణీత వ్యవధుల్లో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వల్ల దీన్ని ఆదిలోనే గుర్తించి చికిత్స చేయించుకోగలుగుతామని.. తన స్వీయానుభవంతో చెబుతోంది బాలీవుడ్‌ అందాల తార మహిమా చౌధరి. కొన్ని నెలల క్రితం రొమ్ము క్యాన్సర్‌ బారిన పడిన ఆమె.. నాలుగు నెలల పాటు ఈ మహమ్మారితో పోరాడి గెలిచింది. పూర్తి ఆత్మవిశ్వాసంతో తిరిగి సెట్‌లో అడుగుపెట్టిన ఈ బ్రేవ్‌ బ్యూటీ.. తన క్యాన్సర్‌ జర్నీని ఓ వీడియో రూపంలో పంచుకుంది. ప్రాణాంతకమైన ఈ మహమ్మారిని జయించిన మహిమ ధైర్యాన్ని సెలబ్రిటీల దగ్గర్నుంచి సామాన్యుల దాకా ప్రశంసిస్తున్నారు.

నటించిన తొలి చిత్రం ‘పర్‌దేశ్‌’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది మహిమా చౌధరి. ఆపై పలు బాలీవుడ్‌ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ‘మనసులో మాట’ సినిమాతో తెలుగు వారికీ సుపరిచితమే! అయితే ప్రస్తుతం ‘ది సిగ్నేచర్‌’ అనే సినిమాలో నటిస్తోన్న ఆమె.. కొన్ని నెలల కిందే క్యాన్సర్‌ను గుర్తించానని, చికిత్స కోసం యూఎస్‌ వెళ్లానంటూ తన క్యాన్సర్‌ జర్నీని వీడియో రూపంలో పంచుకుంది.

క్యాన్సర్‌ అని తెలిసి షాకయ్యా!

‘నాకు రొమ్ము క్యాన్సర్‌ అని తెలిసి నేనే షాకయ్యా. ఎందుకంటే దీనికి సంబంధించిన ఎలాంటి లక్షణాలు నాలో కనిపించలేదు. ప్రతి సంవత్సరం ఆరోగ్య పరీక్షలు, సోనోగ్రఫీ, రక్త పరీక్షలు.. వంటివి చేయించుకోవడం నాకు అలవాటు. అయితే ఓ రోజు నా వ్యక్తిగత డాక్టర్‌ రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించిన పరీక్షలు చేయించుకోమని సలహా ఇచ్చారు. దీంతో నాకు తెలిసిన డాక్టర్‌ వద్దకు వెళ్లా. బయాప్సీలో ఎలాంటి క్యాన్సర్‌ కణాలు గుర్తించలేదు. కానీ DCIS కణాలున్నాయని తేలింది. ఇవి ప్రి-క్యాన్సరస్‌ కణాలు. అంటే క్యాన్సర్‌ వస్తుందనడానికి సంకేతాలన్నమాట! అయితే ఇవి కొన్నిసార్లు క్యాన్సర్‌గా రూపాంతరం చెందచ్చు.. మరికొన్నిసార్లు చెందకపోవచ్చు. అయినా రిస్క్‌ చేయడం ఎందుకని డాక్టర్‌ సలహా మేరకు వీటిని తొలగించుకోవాలని నిర్ణయించుకున్నా.

తనే అండగా నిలిచింది!

ఇది ఒక వంతుకు మంచిదే అయింది. ఎందుకంటే ఆ కణాల్ని తొలగించాక మళ్లీ బయాప్సీ చేస్తే.. వాటిలో అతి సూక్ష్మ కణాలు అప్పటికే క్యాన్సర్‌గా రూపాంతరం చెందినట్లు వైద్యులు గుర్తించారు. ఇక ఈ మూడు నాలుగు నెలల చికిత్సలో భాగంగా యూఎస్‌లోనే ఉండాల్సి వచ్చింది. కీమోథెరపీ, లంపెక్టమీతో పాటు ఇతర చికిత్సలు చేశారు. ఈ క్రమంలో నా జుట్టు రాలిపోతుంటే చాలా బాధపడ్డా. ఏదైతేనేం.. ప్రస్తుతం నేను క్యాన్సర్‌ను జయించి హ్యాపీగా ఉన్నాను. ఇక ఈ సమయంలో నా కూతురు అరియానా నాకు తోడుగా నిలిచింది. కరోనా అనంతరం స్కూళ్లు తిరిగి తెరిచినా.. నా కోసం తను రెండు నెలల పాటు స్కూల్‌కి కూడా వెళ్లలేదు. ఇంటి నుంచే తరగతులకు హాజరైంది. క్యాన్సర్‌ అన్న మాట తొలుత నన్నూ భయభ్రాంతులకు గురిచేసింది. కానీ ఆదిలోనే గుర్తిస్తే ఈ మహమ్మారిని సులభంగా జయించచ్చు.. అందుకు స్వీయ పరీక్ష, నిర్ణీత వ్యవధుల్లో ఆయా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మాత్రం తప్పనిసరి..!’ అంటూ క్యాన్సర్‌ను జయించే క్రమంలో తానెదుర్కొన్న అనుభవాల్ని గుదిగుచ్చింది మహిమ. తద్వారా క్యాన్సర్‌ బాధితుల్లో స్ఫూర్తి నింపిందీ చక్కనమ్మ.

ఇక ఈ వీడియోను తొలుత బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ తన ఇన్‌స్టాలో పంచుకుంటూ ‘తను నిజంగా హీరో!’ అంటూ మహిమ ధైర్యాన్ని ప్రశంసించారు. ఈ వీడియో వైరలవడంతో ఇతర సెలబ్రిటీలు, నెటిజన్లు.. ‘బ్రేవ్‌ బ్యూటీ.. టేక్‌ కేర్‌!’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక ఇటీవలే టాలీవుడ్‌ నటి హంసానందిని, బాలీవుడ్‌ బుల్లితెర తార చవీ మిట్టల్‌ కూడా రొమ్ము క్యాన్సర్‌ను జయించారు. గతంలో తాహిరా కశ్యప్‌, గౌతమి, అలనాటి నటి ముంతాజ్‌, హాలీవుడ్‌ నటి ఏంజెలినా జోలీ, టెన్నిస్‌ తార మార్టినా నవ్రతిలోవా.. వంటి ప్రముఖులూ ఈ మహమ్మారిని జయించిన వారే. వీరంతా తమ అనుభవాల్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ క్యాన్సర్‌ బాధితుల్లో స్ఫూర్తి నింపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్