ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్‌-టీచర్‌ కథ చదివారా?!

పాఠశాలతో ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. కొంతమందికి స్నేహితులతో కొన్ని తీపి గుర్తులు ఉంటే.. మరికొంతమందికి టీచర్లతో ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధం ఏళ్లు గడిచినా చెక్కు చెదరదు. ముంబయికి చెందిన రేవతి అనే టీచర్‌, అలీషా అనే విద్యార్థి మధ్య ఇలాంటి ఆత్మీయ బంధమే ఏర్పడింది.

Updated : 28 Mar 2024 17:51 IST

(Photos : Twitter)

పాఠశాలతో ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. కొంతమందికి స్నేహితులతో కొన్ని తీపి గుర్తులు ఉంటే.. మరికొంతమందికి టీచర్లతో ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధం ఏళ్లు గడిచినా చెక్కు చెదరదు. ముంబయికి చెందిన రేవతి అనే టీచర్‌, అలీషా అనే విద్యార్థి మధ్య ఇలాంటి ఆత్మీయ బంధమే ఏర్పడింది. చిన్నప్పుడు ఆకతాయిగా ముద్ర వేసుకున్న అలీషా.. టీచర్‌గా మారి తన చిన్ననాటి గురువు రేవతిని కలుసుకుంది. 13 ఏళ్ల తర్వాత జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన అనుభవాల్ని రేవతి టీచర్‌ సోషల్‌ మీడియాలో పంచుకుంది. దాంతో ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. మరి, వాళ్ల స్టోరీ ఏంటో రేవతి టీచర్‌ మాటల్లోనే తెలుసుకుందాం రండి..

అల్లరి పిల్ల.. అయినా తెలివైంది!

‘నేను 13 ఏళ్ల క్రితం ఫెలోషిప్‌లో భాగంగా ఓ పాఠశాలకు టీచర్‌గా వెళ్లాను. అది ముంబయిలోని చిన్న స్కూల్‌. అందులో 20 మంది విద్యార్థులు ఉండే వారు. వారిలో అలీషా ఒకరు. తను చాలా అల్లరి చేసేది. ఎంతలా అంటే.. ఓసారి తోటి విద్యార్థి చికాకు పెడుతున్నాడని అతని పళ్లు విరగొట్టింది. ఇతర టీచర్లు కూడా అలీషాతో జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చేవారు. ఎందుకంటే తను ఫైర్‌బ్రాండ్‌. తనకు తనే బాస్. అలీషా ఏం చేయాలనుకుంటుందో అదే చేసేది. ఇలా తాను ఎంత అల్లరి చేసినా.. ఆమె తెలివైన విద్యార్థి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తనకు ఓపిక చాలా తక్కువ. కనీసం 3 గంటలు కుదురుగా ఒక్క చోట కూర్చొని తను పరీక్ష రాయడం గగనం.

అప్పుడు భావోద్వేగానికి లోనయ్యా..

నాకు అలీషాతో తెలియకుండానే చక్కటి అనుబంధం ఏర్పడింది. అక్కడ టీచర్‌గా పనిచేసినంత కాలం తన గురించే ఆలోచించేదాన్ని. తన అల్లరిని తగ్గించి మంచి విద్యార్థిగా మలచడానికి ప్రయత్నించేదాన్ని. అయితే రెండేళ్లలో నా ఫెలోషిప్‌ ముగిసింది. దాంతో వేరే ప్రాంతానికి వెళ్లాను. అయితే ఆపై కొన్నాళ్లకు అక్కడ పనిచేసే ఒక టీచర్‌ నాకు పంపిన ‘స్టోరీ’ చూసి భావోద్వాగానికి లోనయ్యా. అది అలీషా రాసిన స్టోరీ. ‘పాఠశాలలో మీ ఆరాధ్య టీచర్‌ ఎవరు?’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు పెట్టగా.. అలీషా నా గురించే రాసిందని తెలుసుకొని భావోద్వేగానికి లోనయ్యా. ఆ తర్వాత నుంచి తను నాతో టచ్‌లోనే ఉంది. ఆమె డిగ్రీ చేస్తున్నా తన భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆందోళనగా ఉండేది. దానికి తోడు కుటుంబ పరంగా కూడా తను పలు సవాళ్లను ఎదుర్కొంది. అలీషా తండ్రి ఇంటి బాధ్యతల్ని పట్టించుకోకపోవడంతో కుటుంబ బాధ్యతలన్నీ తన తల్లే మోసేది. ముగ్గురు పిల్లల బాధ్యతలను చూసుకోవడంతో పాటు రోజుకు 12 గంటలకు పైగా పనిచేసేది.

13 ఏళ్ల తర్వాత...

ఇక 13 ఏళ్ల తర్వాత ఇటీవలే అలీషాను కలుసుకున్నాను. ఇప్పుడు ఆమె ముంబయిలోని ఓ ప్రముఖ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. అందులోనూ.. ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు పాఠాలు బోధిస్తోందని తెలుసుకొని ఆశ్చర్యపోయా.. ఆనందపడ్డా. ఎందుకంటే మొదట్నుంచి అల్లరి పిల్లగా ముద్ర వేసుకున్న ఆమె.. ఇప్పుడిలా ఎదగడం చూసి ముచ్చటేసింది. అందుకే తనను కలిసిన వెంటనే ‘నువ్వు టీచింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవడానికి కారణమేంటి? ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకే పాఠాలు చెప్పాలని ఎందుకనుకున్నావ్‌?’ అని అడిగా. అందుకు తను.. ‘మీలా ఉత్తమ టీచర్‌ని కావాలని ప్రతిసారీ అనుకునేదాన్ని. మీరు నన్ను నమ్మారు. నా అల్లరిని ఓపికతో భరించారు. అదేవిధంగా నేనూ ప్రత్యేక అవసరాలున్న చిన్నారులకు నా వంతు సహాయం చేయాలనుకున్నా.. మీ స్ఫూర్తితోనే ఈ కెరీర్‌ని ఎంచుకున్నా..’ అని చెప్పడంతో ఆనందంతో నా మనసు ఉరకలెత్తింది. నేను టీచర్‌గా కెరీర్‌ ప్రారంభించినప్పుడు నా జీవితం మరొకరికి స్ఫూర్తినిస్తుందని నేను అనుకోలేదు. కానీ, అలీషానే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ!’ అంటూ రేవతి టీచర్‌ పెట్టిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ స్టూడెంట్‌-టీచర్‌ కథ చదివిన వారంతా వీళ్ల అనుబంధాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు తమ జీవితాల్లో స్ఫూర్తి నింపిన టీచర్లను స్మరించుకుంటూ పోస్టులు షేర్‌ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్