Rashmika: అందుకే అప్పుడు అర్ధరాత్రి ఒంటి గంటకు జిమ్‌కి వెళ్లా!

నైట్‌షిఫ్టులున్నప్పుడు శరీరం, మనసు అలసిపోయి ఒత్తిడికి గురవడం సహజం! ఈ ఒత్తిడిని దూరం చేసుకోవడానికి పగలు నిద్ర పోవడం, పుస్తకం చదవడం, తమకు నచ్చిన పనులు చేయడం.. వంటివి చేస్తుంటారు చాలామంది. కానీ తాను మాత్రం ఈ నిద్రలేమి గందరగోళాన్ని దూరం చేసుకోవడానికి వ్యాయామాన్ని ఎంచుకున్నానంటోంది నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న.

Published : 02 May 2024 18:07 IST

(Photos: Instagram)

నైట్‌షిఫ్టులున్నప్పుడు శరీరం, మనసు అలసిపోయి ఒత్తిడికి గురవడం సహజం! ఈ ఒత్తిడిని దూరం చేసుకోవడానికి పగలు నిద్ర పోవడం, పుస్తకం చదవడం, తమకు నచ్చిన పనులు చేయడం.. వంటివి చేస్తుంటారు చాలామంది. కానీ తాను మాత్రం ఈ నిద్రలేమి గందరగోళాన్ని దూరం చేసుకోవడానికి వ్యాయామాన్ని ఎంచుకున్నానంటోంది నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న. ప్రస్తుతం ‘కుబేర’ షూటింగ్‌లో బిజీగా ఉన్న ఈ భామ.. వరుసగా రాత్రిపూట షూటింగ్స్‌కి హాజరవుతోంది. ఇలా త్యాగం చేసిన నిద్రను పగటి నిద్రతో పూడ్చుకోవడమే కాదు.. కఠినమైన వ్యాయామాలు చేస్తూ మరింత ఎనర్జిటిక్‌గా ఫీలవుతున్నానంటోంది. ఇందులో భాగంగానే ఏకంగా వంద కిలోల బరువెత్తి ‘బీస్ట్‌’లా ఫీలయ్యానంటూ తాజాగా ఇన్‌స్టా స్టోరీస్‌లో తన వర్కవుట్‌ వీడియోను పంచుకుంది. ప్రస్తుతం ఇది వైరలవుతోంది.

పాన్‌ ఇండియా స్టార్‌గానే కాదు.. ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌గానూ రష్మికకు పేరుంది. చక్కటి వర్కవుట్‌ రొటీన్‌తో తన శరీరాన్ని ఎప్పుడూ ఫిట్‌గా ఉంచుకొనే ఈ ముద్దుగుమ్మ.. తాను చేసే వ్యాయామాలకు సంబంధించిన విశేషాల్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకుంటుంటుంది. మరోవైపు తన వ్యక్తిగత జీవితం, కెరీర్‌కు సంబంధించిన విశేషాల్ని ‘డియర్‌ డైరీ’ పేరుతో తరచూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తోన్న ఈ భామ.. తాజాగా ‘కుబేర’ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ అనుభవాన్ని ఈ వేదికగానే పంచుకుంది.

అంతలోనే నిద్ర పట్టేసింది!

‘కుబేర’ సినిమా చిత్రీకరణలో భాగంగా వరుసగా నైట్‌ షూట్స్‌కి హాజరవుతోంది రష్మిక. ఇలా రాత్రి పూట నిద్రను త్యాగం చేయడం వల్ల కాస్త ఒత్తిడి, అలసటకు గురవుతున్నానని చెబుతోన్న ఈ ముద్దుగుమ్మ.. వంద కిలోల బరువెత్తి మరీ తన అలసటను దూరం చేసుకున్నానంటూ రాసుకొచ్చింది.

‘గత కొన్ని రోజులుగా వరుసగా నైట్‌ షూట్స్‌ చేయడం వల్ల రోజును ఎలా ప్రారంభించాలో అర్థం కావట్లేదు. ఈ క్రమంలోనే ఇటీవలే ఓ రోజు ఉదయాన్నే 8 కల్లా రూమ్‌కి చేరుకొని బ్రేక్‌ఫాస్ట్‌ చేశా. ఆపై నిద్ర రాకపోయేసరికి పుస్తకం చదువుతూ కూర్చున్నా. ఎప్పుడు పడుకున్నానో తెలియదు కానీ మధ్యాహ్నం 12 కల్లా నిద్ర పట్టేసింది. సాయంత్రం 6 గంటలకు మెలకువ వచ్చింది. కాస్త ఫ్రెష్‌ అయ్యి కార్డియో చేద్దామనుకున్నా.. కానీ చేయాలనిపించలేదు. కాసేపు ఫోన్‌ చూస్తూ, మరికాసేపు పుస్తకం చదివే సరికి ఆకలేసింది. స్నాక్స్‌ తిని అలా కూర్చున్నా..’

‘బీస్ట్‌’లా ఫీలయ్యా!

‘ఇక రాత్రి ఒంటిగంట కావస్తోంది. ఏదైనా వ్యాయామం చేయాలని మనసు లాగింది. వెంటనే జిమ్‌కి వెళ్లా. నేరుగా వెయిట్‌ లిఫ్టింగ్‌ సెక్షన్‌ వద్దకెళ్లి.. 100 కిలోల బరువులెత్తా. అంతే.. ఏదో తెలియని శక్తి, ఉత్సాహం నన్ను ఆవరించినట్లనిపించింది. నాకు నేనే ‘బీస్ట్‌’లా ఫీలయ్యా. ఆపై సినిమా చూస్తూ అక్కడే కాసేపు సేదదీరా. తద్వారా నా మోకాళ్లకూ కాస్త విశ్రాంతి దొరికినట్లయింది. ఆ తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి రూమ్‌కి చేరుకున్నా. లైట్‌గా డిన్నర్‌ చేసి తిరిగి షూటింగ్‌కి హాజరయ్యా. ఇలా నా నిద్ర సమయాలకు అంతరాయం కలిగినా షూటింగ్‌లో మాత్రం బోలెడంత సరదా, మధురానుభవాలు సొంతమవుతున్నాయి..’ అంది రష్మిక. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పెట్టిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నైట్‌షిఫ్ట్‌ హ్యాంగోవర్‌ను దూరం చేసుకోవడానికి రష్మిక పెట్టిన పోస్ట్‌ స్ఫూర్తినిస్తోందంటూ చాలామంది స్పందిస్తున్నారు.

ఇలా ఇప్పుడే కాదు.. గతంలోనూ పలు సందర్భాల్లో ‘డియర్‌ డైరీ’లో భాగంగా తన అనుభవాలు పంచుకుంది రష్మిక. ‘Anime Awards’లో భాగంగా జపాన్‌లోని టోక్యోకు వెళ్లిన ఈ బ్యూటీ.. అక్కడ తన స్నేహితులతో గడిపిన క్షణాల్ని, తాను సొంతం చేసుకొన్న మధురానుభూతుల్ని ఇన్‌స్టాలో పంచుకుంటూ మురిసిపోయింది. మరోసారి కూర్గ్‌లో తన సొంతింటికి వెళ్లినప్పటి మధుర క్షణాల్నీ ఓ లేఖ రూపంలో రాసుకొచ్చింది.


ఫిట్‌నెస్‌ కోసం నేనేం చేస్తానంటే..?!

శారీరక, మానసిక దృఢత్వానికి; సంపూర్ణ ఫిట్‌నెస్‌ కోసం పలు ఆహార, వ్యాయామ నియమాలు పాటిస్తానంటోంది రష్మిక.

⚛ ఇంటి ఆహారమే తీసుకుంటా.. అది కూడా మొక్కల ఆధారిత ఆహార పదార్థాలకు ప్రాధాన్యమిస్తా. జంక్‌ఫుడ్‌ను పూర్తిగా దూరం పెట్టేశా.

⚛ వారానికి నాలుగు రోజులు వ్యాయామానికి సమయం కేటాయిస్తా. ఇందులో భాగంగా కిక్‌బాక్సింగ్‌, స్కిప్పింగ్‌, డ్యాన్స్‌, ఈత, స్పిన్నింగ్‌, యోగా, బ్రిస్క్‌ వాక్‌.. వంటి ఎక్సర్‌సైజ్‌లు చేస్తా. ఇవే నాకు శక్తిని, దృఢత్వాన్ని అందిస్తాయి.

⚛ మహిళలకూ స్ట్రెంత్‌ ట్రైనింగ్‌ అవసరం. ఇది కండరాల దృఢత్వాన్ని పెంచి చక్కటి శరీరాకృతిని సొంతం చేస్తుంది. అందుకే నేను తరచూ బరువులెత్తడం, పుషప్స్‌, రోయింగ్‌ వ్యాయామాలు సాధన చేస్తా.

⚛ స్నాక్స్‌ అనగానే చిప్స్‌, బిస్కట్స్‌ వంటి అనారోగ్యపూరిత ఆహార పదార్థాలే చాలామందికి గుర్తొస్తాయి. కానీ స్నాక్స్‌ సమయంలో నేను.. ఉడికించిన చిలగడదుంపలపై దాల్చిన చెక్క పొడి చల్లుకొని తీసుకుంటా. ఇది నా ఆహార కోరికల్ని అదుపు చేయడంతో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలనూ అందిస్తుంది. అలాగే.. వారానికోసారి ఛీట్‌ మీల్స్‌నీ పోషకభరితంగానే తీసుకుంటా.

⚛ నాకు టొమాటో, క్యాప్సికం, కీరా, బంగాళాదుంప.. వంటి కాయగూరలు పడవు. అందుకే వాటిని దూరం పెడుతూనే.. వాటిలోని పోషకాలు ఇతర ఆహార పదార్థాల ద్వారా అందేలా నిపుణుల సలహా మేరకు చక్కటి ప్రణాళిక వేసుకొని పాటిస్తున్నా.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్