ఇండియా అబ్బాయినే పెళ్లాడతా..!

ఈ రోజుల్లో వివిధ దేశాల్లో పర్యటించేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలో దేశాలు, ఖండాలు దాటడానికి కూడా అమ్మాయిలు ఏమాత్రం సంకోచించడం లేదు. ఇలాంటి వారి కోసం కొన్ని దేశాలు ప్రత్యేకమైన వీసా వెసులుబాట్లు కూడా కల్పిస్తున్నాయి.

Updated : 07 Jun 2024 20:40 IST

(Photos: Instagram)

ఈ రోజుల్లో వివిధ దేశాల్లో పర్యటించేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలో దేశాలు, ఖండాలు దాటడానికి కూడా అమ్మాయిలు ఏమాత్రం సంకోచించడం లేదు. ఇలాంటి వారి కోసం కొన్ని దేశాలు ప్రత్యేకమైన వీసా వెసులుబాట్లు కూడా కల్పిస్తున్నాయి. మనదేశంలో కూడా ఈ-వీసా విధానాన్ని తీసుకొచ్చారు. ఫలితంగా వివిధ దేశాల నుంచి ఎంతోమంది మన దేశాన్ని సందర్శిస్తున్నారు.. భారతీయుల ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో రష్యాకు చెందిన దినరా అనే అమ్మాయి కూడా ఇటీవలే మన దేశాన్ని సందర్శించింది.

అయితే మన దేశానికొచ్చి వివిధ పర్యటక ప్రాంతాలు సందర్శించడంతో ఆగిపోలేదు దినరా. 'ఎలాగైనా సరే- పెళ్లంటూ చేసుకుంటే.. ఇండియా అబ్బాయినే పెళ్లాడతా' అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతోంది. అవి నెట్టింట వైరల్‌గా మారడంతో దినరా ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో ఈ అమ్మాయి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా..!

2 కోట్ల వీక్షణలు..!

రష్యాకు చెందిన దినరా (26)కు ట్రావెలింగ్‌ అంటే మక్కువ. ఆ ఇష్టంతోనే ఆమె ఇప్పటివరకు 30 దేశాలను చుట్టేసింది. తన పర్యటనలో భాగంగా కొన్ని నెలల క్రితం భారత్‌కు వచ్చింది. ఈ క్రమంలో మన దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆమె ఇక్కడి సంప్రదాయాలకు ముగ్ధురాలైంది. అది ఎంతలా అంటే.. ఇక్కడి అబ్బాయినే పెళ్లి చేసుకోవాలనేంతగా..! ఈ క్రమంలో తన కోరికను వివిధ సందర్భాల్లో వివిధ వీడియోల రూపంలో పోస్ట్‌ చేసింది. తాజాగా ఓ షాపింగ్‌ మాల్‌లో నిలబడి ‘భారతీయ వరుడి కోసం ఎదురుచూస్తున్నాను’ అంటూ ఒక ప్లకార్డును చూపిస్తూ వీడియోను పోస్ట్‌ చేసింది. అందులో తనకు మెసేజ్‌ చేయడానికి వీలుగా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకు సంబంధించిన క్యూఆర్‌ కోడ్‌ను కూడా పొందుపరిచింది.

అలాంటి అబ్బాయి కావాలి!

అంతేకాదు.. మరో వీడియోలో తనకు కాబోయే భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండాలో కూడా చెప్పుకొచ్చింది. ఆరడుగుల ఎత్తు ఉండడంతో పాటు.. అతనికి ట్రావెలింగ్‌, మ్యూజిక్‌ అంటే ఇష్టం ఉండాలంటోంది. వీటికి తోడు కుటుంబ విలువలకు గౌరవం ఇవ్వాలని కూడా చెబుతోంది ఈ రష్యన్‌ భామ. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటివరకు దాదాపు 2 కోట్ల మంది ఈ వీడియోను వీక్షించారు.

కేవలం నెల రోజుల్లోనే..!

దినరా ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచిన దగ్గర్నుంచీ భారత్‌కు చెందిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లుగా చెబుతుండడం గమనార్హం. అందుకు తగ్గట్టుగా మొదటి రోజు నుంచే ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలను సైతం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తోందట. ఈ క్రమంలో మన దేశానికి వచ్చిన మొదటి రోజునే చీర కట్టుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం తాను దిగిన హోటల్‌ రిసెప్షనిస్ట్‌ సహాయం తీసుకున్నట్టుగా ఓ వీడియోలో పంచుకుంది. ఆ తర్వాత నుంచి సొంతంగానే చీర కట్టుకుని వివిధ ప్రాంతాలను సందర్శించింది. వీటికి సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్స్టా అభిమానులతో పంచుకుంది. అలా తక్కువ వ్యవధిలోనే ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారింది. ఈ ఏడాది మార్చి 14న ఆమెకు కేవలం 250 మంది ఫాలోవర్లు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 1.3 లక్షలకు పెరగడం విశేషం.

పబ్లిసిటీ కోసం కాదు..!

అయితే ఇలా తక్కువ సమయంలోనే పాపులారిటీ సాధించిన దినరాకు కొంతమంది నుంచి ప్రతికూల స్పందన కూడా వస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైరలవడం కోసమే ‘భారతీయ వరుడు కావాలంటూ..’ పోస్టులు పెడుతోందని కొంతమంది కామెంట్లు చేశారు.

ఇందుకు దినరా స్పందిస్తూ.. ‘నాలుగేళ్ల క్రితం వరకు నాకు భారత్‌ గురించి తెలియదు. నేను ఆస్ట్రేలియాలో చదువుతున్న సమయంలో మొదటిసారి భారతీయులు పరిచయమయ్యారు. వారి ద్వారా ఇక్కడి సంప్రదాయాలపై ఇష్టం కలిగింది. ఆ ఇష్టం క్రమంగా పెరిగింది. నాకు భారత్‌ అంటే చాలా ఇష్టం. ఇక్కడి సంగీతం, సంప్రదాయాలంటే మరింత ఇష్టం. నేను నిజంగానే ఈ దేశంలోని అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నా కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నాను’ అని చెప్పుకొచ్చింది. అన్నట్లు ఈ రష్యా భామకు మన దేశంలోని తాజ్‌మహల్‌ అంటే కూడా చాలా ఇష్టమట.

యూరప్‌లోనూ చీరకట్టుతోనే..!

దినరా పోస్టుల్లో ఎక్కువ భాగం చీరకట్టులోనే దర్శనమిచ్చింది. దీనిని బట్టే ఆమెకు భారత్‌పై ఎంత ప్రేమ ఉందో అంటున్నారు కొంతమంది నెటిజెన్లు. ఇటీవలే ఆమె తన భారత్‌ పర్యటనను పూర్తి చేసుకుని యూరప్‌కి వెళ్లింది. అక్కడ కూడా చీరకట్టును కొనసాగించడంతో పాటు.. ‘ఇండియా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుంది’ అంటూ పోస్టులు పెట్టడం గమనార్హం.

మరి సోషల్ మీడియాలో చెబుతున్నట్లుగా దినరా నిజంగానే మన దేశం అబ్బాయినే పెళ్లాడుతుందో లేదో వేచి చూడాలి!Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్