Samantha : మయోసైటిస్‌.. ఆ డైట్ పాటిస్తున్నా!

ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే డాక్టర్‌ సూచించిన మందులు వాడడమే కాదు.. ఆహార-వ్యాయామ నియమాల్లో పలు మార్పులు చేర్పులు చేసుకోవడం తప్పనిసరి! ప్రస్తుతం తానూ అదే పనిలో ఉన్నానంటోంది టాలీవుడ్‌ అందాల తార సమంత. ప్రస్తుతం మయోసైటిస్‌ అనే ఆరోగ్య సమస్యకు చికిత్స....

Published : 28 Jan 2023 19:06 IST

ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే డాక్టర్‌ సూచించిన మందులు వాడడమే కాదు.. ఆహార-వ్యాయామ నియమాల్లో పలు మార్పులు చేర్పులు చేసుకోవడం తప్పనిసరి! ప్రస్తుతం తానూ అదే పనిలో ఉన్నానంటోంది టాలీవుడ్‌ అందాల తార సమంత. ప్రస్తుతం మయోసైటిస్‌ అనే ఆరోగ్య సమస్యకు చికిత్స తీసుకుంటోన్న ఆమె.. దాంతో పాటు అత్యంత కఠినమైన ఆహార నియమాలు పాటిస్తున్నానని, మరోవైపు వ్యాయామాలూ చేస్తున్నానని చెబుతోంది.. ఈ క్రమంలోనే ఇటీవలే జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌ చేస్తోన్న ఓ వీడియోను పోస్ట్‌ చేసిన ఈ ముద్దుగుమ్మ.. తాను పాటిస్తోన్న డైట్‌ సీక్రెట్‌ గురించి చెప్పుకొచ్చింది.

తాను గత కొంత కాలంగా మయోసైటిస్‌ అనే ఆటోఇమ్యూన్‌ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు గతేడాది అక్టోబర్‌లో సమంత వెల్లడించిన విషయం తెలిసిందే! అప్పట్నుంచి ఈ సమస్యకు చికిత్స తీసుకుంటోన్న ఆమె.. ఈ క్రమంలో తనకెదురైన అనుభవాల్ని సోషల్‌ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు పంచుకుంటోంది. అంతేకాదు.. సమస్య నుంచి బయటపడే క్రమంలో తన జీవనశైలిలో పలు మార్పులు, చేర్పులు కూడా చేసుకున్నానంటూ ఇన్‌స్టా వేదికగా తాజాగా ఓ పోస్ట్‌ పెట్టింది సామ్‌.

ఆ డైట్‌తో ఫలితం!

జిమ్‌లో వ్యాయామం చేస్తోన్న వీడియోను పోస్ట్‌ చేసిన సమంత.. మయోసైటిస్‌ నుంచి బయటపడేందుకు ప్రస్తుతం తాను తీసుకుంటోన్న డైట్‌ సీక్రెట్‌ గురించి చెప్పుకొచ్చింది. ‘మయోసైటిస్‌ సమస్య నుంచి బయటపడే వరకు విశ్రమించను. ఈ క్రమంలో అత్యంత కఠినమైన ఆటోఇమ్యూన్‌ డైట్‌ను పాటిస్తున్నా. అయితే మనం ఏం తింటున్నామన్న దాని కంటే.. ఆహారపు కోరికల విషయంలో మన ఆలోచనల్ని ఎలా అదుపు చేసుకుంటున్నామన్నదే ముఖ్యం. అప్పుడే కచ్చితమైన డైట్‌ని పాటించగలిగే బలం మన సొంతమవుతుంది. ఈ డైట్‌ నుంచి నేను నేర్చుకున్న మంచి విషయం ఇదే!’ అంది సామ్‌. ఇలా పాజిటివిటీతో తాను పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఆలియా భట్‌, శిల్పా రెడ్డి, సుస్మిత కొణిదెల.. వంటి ప్రముఖులు స్పందిస్తూ.. ‘కిల్లర్‌’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. నెటిజన్లూ ఈ ముద్దుగుమ్మను ప్రశంసిస్తూ కామెంట్లు పోస్ట్‌ చేస్తున్నారు.

ఇంతకీ ఏంటీ డైట్‌?

ఆటోఇమ్యూన్‌ ప్రొటోకాల్‌ డైట్‌.. శరీరంలో వాపు, నొప్పి, నీరసం, అలసట.. వంటి ఆటోఇమ్యూన్‌ వ్యాధికి సంబంధించిన లక్షణాల్ని తగ్గించడమే ఈ డైట్‌ ముఖ్యోద్దేశం. ఈ క్రమంలో శరీరంలో వాపుకి కారణమయ్యే కొన్ని రకాల ఆహార పదార్థాల్ని పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఇక లక్షణాలు తగ్గే కొద్దీ పక్కన పెట్టిన పదార్థాల్ని నెమ్మదిగా శరీరానికి అలవాటు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గింజలు, పప్పులు, నట్స్‌, విత్తనాలు, గుడ్లు, పాలు-పాల పదార్థాలు, కాఫీ, ప్రాసెస్‌ చేసిన చక్కెరలు.. వంటివి పూర్తిగా పక్కన పెట్టేయాలి. ఇలా కనీసం మూడు నెలల పాటు కచ్చితంగా పాటిస్తే క్రమంగా లక్షణాలు తగ్గి.. ఆరోగ్యం విషయంలో మెరుగైన ఫలితాలు కనిపించడం గమనించచ్చు. ఈ సమయంలో పక్కన పెట్టిన పదార్థాల్ని.. స్వల్ప మోతాదుల్లో ఆహారంలో చేర్చుకొని.. అది పడుతుందో, లేదో పరీక్షించుకోవాలి.

ఏమేం తినాలి?

అలాగే ఈ డైట్‌లో భాగంగా కచ్చితంగా తీసుకోవాల్సిన పదార్థాలు కూడా కొన్నున్నాయి. కాయగూరలు, పండ్లు, పులియబెట్టిన ఆహార పదార్థాలు, తక్కువగా ప్రాసెస్‌ చేసిన మాంసం, వంట కోసం ఆలివ్‌-అవకాడో-కొబ్బరి నూనెలు, వెనిగర్‌, తేనె-మేపుల్‌ సిరప్‌.. వంటి సహజసిద్ధమైన స్వీట్‌నర్స్‌, గ్రీన్‌-బ్లాక్‌ టీలు, పాయా.. వంటివి తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి జీర్ణాశయం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఆటోఇమ్యూన్‌ వ్యాధులకు సంబంధించిన లక్షణాల్ని క్రమంగా తగ్గించడంలోనూ సహకరిస్తాయి. అయితే ఏవి తీసుకున్నా మోతాదుకు మించకూడదని గుర్తుంచుకోండి. ఇక మరో విషయం ఏంటంటే.. ఈ డైట్‌ను ఎక్కువ రోజుల పాటు పాటించినా అన్ని పోషకాలు శరీరానికి అందవని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఎంత కఠినంగా పాటిస్తే అంత త్వరగా కోలుకొని తిరిగి పక్కన పెట్టిన పదార్థాల్ని డైట్‌లో చేర్చుకోవచ్చు. తద్వారా అన్ని పోషకాల్నీ తిరిగి పొందచ్చు. అందుకే డాక్టర్‌ సలహా మేరకు ఎన్ని రోజులు పాటించాలి? లక్షణాలను బట్టి ఏయే పదార్థాల్ని క్రమంగా డైట్‌లో చేర్చుకోవాలి? వంటి విషయాలన్నీ తు.చ. తప్పకుండా పాటిస్తే ఫలితం ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్