Shweta Sharda: ఆ కొరియోగ్రాఫరే.. ఈ అందాల రాణి!

‘నాణ్యమైన విద్యను అందుకోవడం ప్రతి అమ్మాయీ హక్కు.. సామాజిక కట్టుబాట్ల పేరుతో దాన్ని కాలరాయొద్దు..’ అంటోంది 22 ఏళ్ల శ్వేత శార్దా. నాన్న ప్రేమకు దూరమై.. అమ్మ ఆలనలోనే పెరిగిన ఆమె.. ఉన్నత విద్యనభ్యసించే క్రమంలో పలు ఆర్థిక కష్టాల్ని ఎదుర్కొంది.

Updated : 29 Aug 2023 21:00 IST

(Photos: Instagram)

‘నాణ్యమైన విద్యను అందుకోవడం ప్రతి అమ్మాయీ హక్కు.. సామాజిక కట్టుబాట్ల పేరుతో దాన్ని కాలరాయొద్దు..’ అంటోంది 22 ఏళ్ల శ్వేత శార్దా. నాన్న ప్రేమకు దూరమై.. అమ్మ ఆలనలోనే పెరిగిన ఆమె.. ఉన్నత విద్యనభ్యసించే క్రమంలో పలు ఆర్థిక కష్టాల్ని ఎదుర్కొంది. మరెవరికీ ఇలాంటి సమస్యలు రాకూడదన్న ఉద్దేశంతో.. ప్రస్తుతం బాలికా విద్యపై అవగాహన కల్పిస్తోంది. డ్యాన్స్‌పై మక్కువతో పలు టీవీ షోలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించిన ఆమె.. తాజాగా ‘మిస్‌ దివా యూనివర్స్‌-2023’ కిరీటాన్ని సొంతం చేసుకుంది. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌ను స్ఫూర్తిగా తీసుకొనే అందాల పోటీల్లో పాల్గొన్నానంటోన్న శ్వేత గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..!

శ్వేతది చండీగఢ్. చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు విడిపోవడంతో తల్లి వద్దే పెరిగిందామె. ఇక తనను పెంచి పెద్ద చేసే క్రమంలో ఆమె తల్లి పడిన కష్టాల్ని దగ్గర్నుంచి గమనించిన శ్వేత.. సందర్భానికి తగినట్లుగా తనను తాను మలచుకోవడం, అర్థం చేసుకొని మసలుకోవడం నేర్చుకుంది. ఎలాంటి పరిస్థితినైనా పాజిటివ్‌గా తీసుకోవడం అలవాటు చేసుకుంది.

డ్యాన్స్‌తో పాపులారిటీ!

16 ఏళ్ల వయసులో తన తల్లితో కలిసి ముంబయి చేరిన శ్వేత.. పైచదువుల కోసం పలు ఆర్థిక కష్టాల్ని ఎదుర్కొంది. అయినా పట్టుదలతో ఇంటర్‌ పూర్తిచేసి.. ప్రస్తుతం దూరవిద్యలో డిగ్రీ చదువుతోంది. ‘అమ్మానాన్నలు విడిపోయాక నేను, అమ్మ సొంతింటిని వదిలి అద్దె ఇంట్లోకి మారాం. సింగిల్‌ మదర్‌గా అమ్మ నన్ను పెంచే క్రమంలో పడిన ఇబ్బందుల్ని దగ్గర్నుంచి గమనించా. ఎలాగైనా తన కష్టాల్ని దూరం చేయాలనుకున్నా. ఈ ఆలోచనతోనే ఇటు చదువుకుంటూనే.. అటు నాకిష్టమైన డ్యాన్స్‌పై దృష్టి పెట్టా. అనతి కాలంలోనే డ్యాన్స్‌ రియాల్టీ షోల్లో పాల్గొనే అవకాశమొచ్చింది. ఇక ఆపై వెనుతిరిగి చూడలేదు. ఇప్పటివరకు ‘డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌’, ‘డ్యాన్స్‌ దీవానే’, ‘డ్యాన్స్‌ +’.. వంటి షోలలో పాల్గొన్నా. ఝలక్‌ దిఖ్లాజా షోకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించా. ఈ వేదికల పైనే దీపికా పదుకొణె, సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌, మౌనీ రాయ్‌, మాధురీ దీక్షిత్‌.. వంటి ప్రముఖ తారలతో కలిసి పనిచేయడం, వారితో కలిసి స్టెప్పులేయడం మర్చిపోలేను..’ అంటోంది శ్వేత.

ఆమె స్ఫూర్తితో.. అందాల కిరీటం!

ఇలా కేవలం డ్యాన్సర్‌గానే కాదు.. ప్రస్తుతం ఔత్సాహికులకు డ్యాన్స్‌ మెలకువలు నేర్పుతూ డ్యాన్స్‌ మాస్టర్‌గానూ మారిపోయింది శ్వేత. ఈ క్రమంలో కొన్ని వర్క్‌షాప్స్‌ కూడా నిర్వహిస్తోంది. అయితే మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌ను చూశాకే.. అందాల పోటీల్లో పాల్గొనాలన్న ఆలోచన వచ్చిందంటోన్న ఈ బ్యూటీ క్వీన్‌.. తాజాగా ‘మిస్‌ దివా యూనివర్స్‌-2023’ కిరీటాన్ని గెలుచుకుంది.

‘1994లో విశ్వసుందరి కిరీటం గెలుచుకున్న సుస్మితా సేన్‌ స్ఫూర్తితోనే అందాల పోటీల్లో పాల్గొనాలనుకున్నా.. ఆమెలాగే కిరీటం గెలుచుకోవాలనుకున్నా.. ఈ ఏడాది మిస్‌ దివా యూనివర్స్‌తో నా కల నెరవేరింది. ఈ విజయం నాలో ఆత్మవిశ్వాసం నింపింది. ఈ రోజుల్లో ఎంతోమంది అమ్మాయిలు అటు కుటుంబం నుంచి, ఇటు సమాజం నుంచి ప్రోత్సాహం లేక పలు సవాళ్లు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి అండగా నిలబడాలనుకుంటున్నా. ఉన్నత విద్య-సమాన అవకాశాలపై అమ్మాయిలందరిలో అవగాహన పెంచుతున్నా. దీన్ని మరింత విస్తరించాలనుకుంటున్నా. అలాగే అమ్మాయిలకు, మహిళలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పాలనుకుంటున్నా. ఇక్కడిదాకా రాగలిగానంటే అడుగడుగునా మా అమ్మ ప్రోత్సాహం ఎంతో ఉంది. తనకు సొంతిల్లు లేదన్న బాధ ఉంది. త్వరలోనే ఆమె కోరిక నెరవేరుస్తా..’ అంటోంది శ్వేత. ‘మిస్‌ దివా యూనివర్స్‌’గా గత విజేత అయిన దివితా రాయ్‌ చేతుల మీదుగా కిరీటాన్ని అలంకరించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగబోయే ‘మిస్‌ యూనివర్స్‌’ పోటీల్లో భారత్‌ తరఫున పాల్గొననుంది.


మానసిక ఆరోగ్యంపై అవగాహన!

‘మిస్‌ దివా యూనివర్స్-2023’ పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది కర్ణాటకకు చెందిన త్రిషా శెట్టి. ‘సైకాలజీ’ ప్రధానాంశంగా డిగ్రీ చదువుతోన్న ఆమె.. మోడల్‌గానూ కొనసాగుతోంది. ప్రస్తుతం మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడమే ముఖ్యోద్దేశంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోన్న త్రిష.. పాఠశాల దశ నుంచే మానసిక ఆరోగ్యాన్ని ప్రధాన సబ్జెక్టుగా పిల్లలకు బోధించాలని కోరుతోంది. అయితే తాను అందాల పోటీల వైపు అడుగు వేయడానికి.. బాలీవుడ్‌ తార, మాజీ విశ్వసుందరి లారా దత్తానే స్ఫూర్తి అంటోందీ ముద్దుగుమ్మ.
‘లారా దత్తా స్ఫూర్తితోనే అందాల పోటీల్లో పాల్గొనాలనుకున్నా. ఆమె అందం, ఆత్మ సౌందర్యం, తెలివితేటలు, ఆత్మవిశ్వాసం.. ఈ సుగుణాలన్నీ నాకు ఆమెపై గౌరవాన్ని రెట్టింపు చేశాయి. గతంలో పలు ఫ్యాషన్‌ షోలు, ఫ్యాషన్‌ వీక్‌లలో పాల్గొన్న అనుభవాలు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి..’ అంటోన్న త్రిషకు భరతనాట్యం, కథక్‌, బెల్లీ డ్యాన్స్‌.. వంటి నృత్యరీతుల్లోనూ ప్రవేశం ఉంది. అంతేకాదు.. ఈ చక్కనమ్మకు ట్రావెలింగ్‌ అన్నా మక్కువేనట! ఈ క్రమంలోనే తన పర్యటనలకు సంబంధించిన విశేషాల్ని, ఫొటోల్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకుంటుంటుంది త్రిష.


వ్యాపారంలోనూ రాణిస్తూ..!

ఇక దిల్లీకి చెందిన సోనల్‌ కుక్రేజా ‘మిస్‌ దివా సుప్రా నేషనల్‌ - 2023’గా కిరీటం అందుకుంది. అమెరికాలోని ‘పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్సిటీ’ నుంచి ‘మార్కెటింగ్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌’ విభాగాల్లో డిగ్రీ పూర్తిచేసిన ఆమె.. ‘Unicas’ పేరుతో ఓ ఆర్థిక వేదికను నెలకొల్పింది. నగదుతో సంబంధం లేకుండా డిజిటల్‌ ఆస్తుల్ని పెంపొందించే వేదిక ఇది. ‘నటి ప్రియాంక చోప్రా జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన ఆమె అంతర్జాతీయ స్థాయికి ఎదగడమంటే మాటలు కాదు. ఆత్మవిశ్వాసం, పట్టుదల, మూసధోరణుల్ని బద్దలు కొట్టే ఆమె నైజం.. ఇవే ఆమెను అందలమెక్కించాయి.. ఆమెలోని ఈ లక్షణాలే నాలో స్ఫూర్తి నింపాయి..’ అంటోంది సోనల్‌. త్వరలో జరగబోయే ‘మిస్‌ సుప్రా నేషనల్‌-2023’ పోటీల్లో భారత్‌ తరఫున పాల్గొననుందీ బ్యూటీ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్