Published : 05/10/2022 11:18 IST

ఈ చిట్కాలతో రోజంతా పరిమళభరితంగా..!

చక్కని స్ప్రే లేదా పెర్‌ఫ్యూమ్‌ ఉపయోగిస్తే దాని ప్రభావంతో పరిమళాలు వెదజల్లడమే కాదు.. మనసు కూడా కాస్త ఉత్సాహంగా మారుతుంది. అయితే ఇలా చేయడం వల్ల వచ్చే పరిమళం కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. మరి, రోజంతా పరిమళభరితంగా ఉండాలంటే మనం ఉపయోగించే బ్యూటీ ఉత్పత్తులు, వేసుకునే దుస్తులు.. తదితర విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం రండి..

❀ ఉదయం స్నానం చేసిన తర్వాత సాయంత్రం వరకు రకరకాల పనుల మీద బయటకి వెళ్లి వస్తుంటాం. అటువంటప్పుడు ముఖం జిడ్డుగా అనిపిస్తే సబ్బుతో ఫేస్‌వాష్‌ చేసుకోవడం కంటే బేబీ వైప్స్‌తో తుడుచుకోవడం మేలు. ఫలితంగా మురికి తొలగిపోయి ముఖం తాజాగా కనిపించడమే కాదు. పరిమళభరితంగా కూడా ఉంటుంది.

❀ రోజంతా పరిమళభరితంగా ఉండాలనుకున్నప్పుడు అలంకరణలో భాగంగా ఉపయోగించే నెయిల్‌ పాలిష్‌ వంటివి కూడా సెంటెడ్‌ ఉత్పత్తులని ఎంపిక చేసుకోవడం మంచిది. అలాగే హెయిర్‌స్ప్రే, బాడీ స్ప్రే.. వంటివన్నీ ఉపయోగించి చెమట వాసన రాకుండా జాగ్రత్తపడాలి.

❀ చాలామందిలో పాదాలకు చెమట పట్టి వాసన వస్తుంటుంది. మీరూ ఇదే సమస్యతో సతమతమవుతున్నారా? అయితే స్నానం చేసిన తర్వాత కాళ్లను బాగా ఆరనిచ్చి సెంటెడ్‌ మాయిశ్చరైజర్‌ అప్లై చేయండి. అలాగే సాక్సులు ధరించేవారు వాటిలో పరిమళాలు వెదజల్లే పౌడర్ వేసినట్లయితే పాదాల నుంచి చెమట వాసన రాకుండా చెక్‌ పెట్టవచ్చు.

❀ శరీరం పరిమళభరితంగా ఉండాలంటే వేసుకునే దుస్తులు కూడా సువాసనలు వెదజల్లడం చాలా ముఖ్యం. అందుకే దుస్తులు ఉతికేటప్పుడు ఫ్యాబ్రిక్‌ కండిషనర్లు వంటి ఉత్పత్తుల్ని వాడుతూనే, వార్డ్‌రోబ్‌లో భద్రపరిచేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

❀ చేతులు, మణికట్టు, మెడ భాగాల్లో తప్పకుండా పెర్‌ఫ్యూమ్‌ స్ప్రే చేసుకోవాలి. అలాగే స్ప్రే చేసుకున్న వెంటనే దాన్ని చేత్తో తాకకూడదు. అప్పుడే ఆ పరిమళం ఎక్కువ సమయం నిలిచి ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని