మళ్లీ ‘అమ్మ’య్యే ఆనందంలో..!

మాతృత్వం ఓ వరం. దాన్ని రెండోసారి పొందితే ఆ ఆనందం వర్ణనాతీతం! ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే మునిగి తేలుతున్నారు గాయని గీతామాధురి - నటుడు నందు దంపతులు. ఐదేళ్ల క్రితం కూతురికి జన్మనిచ్చిన వీరు.. త్వరలోనే రెండో బిడ్డను ఆహ్వానించబోతున్నట్లు గతేడాది డిసెంబర్‌లో ప్రకటించారు....

Updated : 10 Feb 2024 11:36 IST

మాతృత్వం ఓ వరం. దాన్ని రెండోసారి పొందితే ఆ ఆనందం వర్ణనాతీతం! ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే మునిగి తేలుతున్నారు గాయని గీతామాధురి - నటుడు నందు దంపతులు. ఐదేళ్ల క్రితం కూతురికి జన్మనిచ్చిన వీరు.. త్వరలోనే రెండో బిడ్డను ఆహ్వానించబోతున్నట్లు గతేడాది డిసెంబర్‌లో ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా గీత సీమంతం ఘనంగా నిర్వహించారు ఆమె కుటుంబ సభ్యులు. ఈ ముద్దుల జంట ఈ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో అవి వైరల్‌గా మారాయి.

టాలీవుడ్‌ సింగర్‌ గీతామాధురి, నటుడు నందు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే! కెరీర్‌లో రాణించే క్రమంలోనే 2014లో వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2019లో దాక్షాయణి ప్రకృతి అనే పాపకు జన్మనిచ్చారు. అయితే తామిద్దరం మరోసారి తల్లిదండ్రులం కాబోతున్నట్లు ఇటీవలే ప్రకటించిందీ జంట. ‘దాక్షాయణి ప్రకృతి త్వరలోనే అక్క కాబోతోంది.. ఫిబ్రవరిలో మా రెండో చిన్నారి రాబోతోంది..’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టిందీ అందాల జంట.

వేడుకగా సీమంతం!

అయితే ఇటీవలే గీతామాధురికి ఘనంగా సీమంతం నిర్వహించారు ఆమె కుటుంబ సభ్యులు. ఈ వేడుకలో ఆమె పూర్తి సంప్రదాయబద్ధంగా మెరిసిపోయింది. పీచ్‌-గ్రీన్‌ కలర్‌ కాంబినేషన్‌తో కూడిన పట్టు చీర ధరించిన ఈ బ్యూటిఫుల్‌ సింగర్‌.. మ్యాచింగ్‌ గ్రీన్‌ బ్లౌజ్‌తో కట్టిపడేసింది. ఫ్లోరల్‌ జ్యుయలరీతో తన లుక్‌ని పూర్తిచేసింది. ఇదే లుక్‌కి బంగారు ఆభరణాలు జత చేసి మరికొన్ని ఫొటోలకు పోజిచ్చింది. తన భర్త నందు, కూతురు దాక్షాయణితో కలిసి దిగిన ఫొటోలు, వీడియోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ మురిసిపోయింది. ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి. సెలబ్రిటీల దగ్గర్నుంచి సామాన్యుల దాకా ఈ టాలీవుడ్‌ జంటకు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్‌లు పెడుతున్నారు.

విరుష్క కూడా!

మరోవైపు బాలీవుడ్‌-క్రికెట్‌ కపుల్‌ అనుష్కా శర్మ-విరాట్‌ కోహ్లీ కూడా రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారట! ఈ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటించకపోయినా.. కోహ్లీ ఫ్రెండ్‌, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ సోషల్‌ మీడియా వేదికగా బయటపెట్టాడు. ఇటీవల అభిమానులతో ముచ్చటించిన క్రమంలో.. ‘ఈ మధ్యే కోహ్లీతో చాటింగ్‌ చేశా. ప్రస్తుతం అతడు ఆటకు దూరంగా ఉంటూ.. తన కుటుంబంతో గడపడానికే ప్రాధాన్యమిస్తున్నాడు. విరాట్‌-అనుష్కలు త్వరలోనే రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న మాట వాస్తవమే!’ అంటూ అసలు రహస్యాన్ని అందరి ముందుంచాడు డివిలియర్స్‌. 2017లో వివాహ బంధంతో ఒక్కటైన విరుష్క జంట.. 2021లో వామిక అనే పాపకు జన్మనిచ్చింది. ఇక ఇప్పుడు రెండో బేబీ కోసం ఎదురుచూస్తోంది.

నిజానికి అనుష్క రెండోసారి తల్లి కాబోతోందంటూ గతంలోనూ పలుమార్లు వార్తలొచ్చాయి. గతేడాది ప్రపంచకప్‌ సమయంలో అనుష్క బేబీ బంప్‌తో కనిపించడంతో ఆమె ప్రెగ్నెన్సీ విషయం బయటికొచ్చింది. ఇక ఇప్పుడు విరాట్‌ ఇంగ్లండ్‌తో టెస్టులకు దూరంగా ఉండడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. ఆఖరికి డివిలియర్స్‌ నోటి నుంచి అసలు నిజం బయటికొచ్చింది.

కంగ్రాట్స్‌ క్యూట్‌ కపుల్స్‌!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్