అందగత్తెల కుటుంబం: ఈ ‘అమ్మాయి’ వయసెంతో తెలుసా?

వయసు పెరుగుతున్నా అందంగా మెరిసిపోవాలనుకోవడం సహజం. ఈ క్రమంలో చాలామంది మహిళలు వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించడంతో పాటు పలు జాగ్రత్తలు కూడా తీసుకుంటుంటారు. కానీ, ఎంత ప్రయత్నించినా వయసు ప్రభావం కనిపిస్తూనే ఉంటుంది. తైవాన్‌కు చెందిన ల్యూర్ మాత్రం ఇందుక...

Published : 06 Jan 2023 20:31 IST

(Photos: Instagram)

వయసు పెరుగుతున్నా అందంగా మెరిసిపోవాలనుకోవడం సహజం. ఈ క్రమంలో చాలామంది మహిళలు వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులను ఉపయోగించడంతో పాటు పలు జాగ్రత్తలు కూడా తీసుకుంటుంటారు. కానీ, ఎంత ప్రయత్నించినా వయసు ప్రభావం కనిపిస్తూనే ఉంటుంది. తైవాన్‌కు చెందిన ల్యూర్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. 47 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇలా కనిపించడానికి ఆమె ఏదైనా చికిత్స తీసుకుందేమో అని భావిస్తే పొరపాటే. కొన్ని సులభమైన చిట్కాలు పాటించడమే తన అందానికి కారణం అంటోంది ఈ తైవాన్‌ సుందరి. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందామా...

అందగత్తెల కుటుంబం!

ల్యూర్‌ 1975 ఆగస్టు 16 న తైవాన్‌లో జన్మించింది. ల్యూర్ తల్లి పేరు మే. ఆమె డ్యాన్స్‌ టీచర్‌గా చేసేవారు. ల్యూర్‌కు ఫెఫే (45), షారన్ (41) అనే ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ఫెఫే సోషలైట్ కాగా, షారన్‌ నటిగా రాణిస్తోంది. కేవలం ల్యూర్‌ మాత్రమే కాకుండా ఆమె చెల్లెళ్లు కూడా వారి వయసు కంటే చిన్నవాళ్లలా కనిపిస్తుంటారు. వారి తల్లి మే కూడా 68 ఏళ్ల వయసులో 30 ఏళ్ల మహిళగా కనిపిస్తారు. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ల మధ్య మే నిలబడితే.. ఆమెను వారి సిస్టర్‌ అని భావిస్తారంటే అతిశయోక్తి కాదు. అందుకే వీరి కుటుంబాన్ని తైవాన్‌ మీడియా ‘ది ఫ్యామిలీ ఆఫ్‌ ఫ్రోజెన్‌ ఏజెస్‌’ అని పిలుస్తుంటుంది. అయితే కొన్ని చిన్నపాటి చిట్కాలతోనే తాము అందంగా ఉండగలుగుతున్నామని అంటోంది ల్యూర్.

ప్రచారకర్తగా...

ఇంటీరియర్‌ డిజైనర్‌గా పనిచేసే ల్యూర్ ఓ సందర్భంలో షారన్ తో కలిసి ఓ ఈవెంట్‌కు వెళ్లింది. అప్పటినుంచి వివిధ పత్రికల్లో ఆమె గురించి ప్రచురించడంతో బాహ్య ప్రపంచానికి పరిచయమైంది. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల సంఖ్య పెరగడంతో తన పాపులారిటీ కూడా పెరిగింది. దాంతో పలు సౌందర్య ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో తనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకుంటుంది. అయితే వ్యక్తిగత విషయాలకు మాత్రం దూరంగానే ఉంటోంది. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 8 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.


ల్యూర్‌ పాటించే సౌందర్య చిట్కాలివే..!

రోజూ సరిపడినన్ని నీళ్లు తాగడం వల్ల చర్మం నవయవ్వనంగా కనిపిస్తుంటుంది. ఇదే చిట్కాను తాను కూడా పాటిస్తానని అంటోంది తైవాన్‌ బ్యూటీ. ఆమె ఉదయాన్నే గ్లాసు గోరువెచ్చటి నీళ్లను తీసుకుంటుందట.

వయసు పెరిగే కొద్దీ పలు చర్మ సమస్యలు వస్తుంటాయి. వీటిని నివారించడానికి చర్మాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. ఇందుకోసం ప్రతిరోజూ మాయిశ్చరైజర్‌ అప్లై చేసుకుంటానని చెబుతుంది ల్యూర్.

చర్మ సంరక్షణకు తగినంత ఎండ పడడం కూడా అవసరమే అంటోంది ఈ తైవాన్‌ సుందరి. అలాగని ఎక్కువసేపు ఎండలో ఉంటే సమస్యలు తప్పవని అంటోంది. అయితే వేసవిలో మాత్రం తప్పనిసరిగా సన్‌స్క్రీన్‌ను ఉపయోగిస్తుందట.

అందంగా ఉండాలంటే తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు పాటిస్తుండాలి. ఇందుకోసం చక్కెర అధికంగా ఉండే పదార్థాలతో పాటు, మాంసాహారానికి కూడా పూర్తి దూరంగా ఉంటానంటోంది ల్యూర్‌. వీటికి బదులుగా ఎక్కువ భాగం కూరగాయలను తన డైట్‌లో భాగం చేసుకుంటానని చెబుతుంది.

ల్యూర్‌ ప్రతి రోజూ ఉదయం బ్లాక్‌ కాఫీ తీసుకుంటుంది. వీటికి తోడు విటమిన్‌ సి, కొలాజెన్‌ సప్లిమెంట్లను తీసుకుంటుందట.

ఈ చిట్కాలను తమ కుటుంబంలోని అందరూ పాటిస్తారని అంటోంది ల్యూర్. ప్రతిరోజూ ఉదయాన్నే గోరువెచ్చటి నీళ్లు తాగడం మా కుటుంబ అలవాటుగా మారిపోయిందని చెబుతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్