Twin Sisters: 23 ఏళ్లుగా ఒకే రకమైన దుస్తుల్లో మెరిసిపోతున్నారు!

కవలలంటే ఒకేలా ఉంటారు.. ఒకే తరహా దుస్తులు వేసుకుంటారు. కానీ పెరిగి పెద్దయ్యే కొద్దీ వారి రుచులు, అభిరుచులు మారుతుంటాయి. వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, శరీరాకృతికి తగ్గట్లుగా దుస్తులు ఎంచుకోవడం చూస్తుంటాం.

Published : 15 Sep 2023 12:06 IST

(Photos: Facebook)

కవలలంటే ఒకేలా ఉంటారు.. ఒకే తరహా దుస్తులు వేసుకుంటారు. కానీ పెరిగి పెద్దయ్యే కొద్దీ వారి రుచులు, అభిరుచులు మారుతుంటాయి. వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, శరీరాకృతికి తగ్గట్లుగా దుస్తులు ఎంచుకోవడం చూస్తుంటాం. కానీ యూకేకు చెందిన ఈ ఇద్దరు అక్కచెల్లెళ్లు మాత్రం ఏకంగా 23 ఏళ్ల నుంచి ఒకే రకమైన దుస్తులు ధరిస్తూ తమ అనుబంధాన్ని చాటుకుంటున్నారు. కేవలం దుస్తులే కాదు.. హెయిర్‌స్టైల్‌, యాక్సెసరీస్‌.. వంటివన్నీ ఒకేలా ఎంచుకుంటూ మెరిసిపోతున్నారు. అక్కడితో ఆగకుండా.. తమ మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ డ్రస్సులకు సంబంధించిన ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ పాపులర్‌గానూ మారిపోయారీ స్వీట్‌ సిస్టర్స్.

రోజీ కోల్స్‌, క్యాథీ హెఫెర్నాన్‌.. వీళ్లిద్దరూ కవల సోదరీమణులు. ఇంగ్లండ్‌లోని హ్యాంప్‌షైర్‌ నగరంలో ఎదురెదురు ఫ్లాట్స్‌లో నివాసముంటున్నారు. ప్రస్తుతం వీరి వయసు 70 ఏళ్లు. కలిసి పుట్టిన వీరు చిన్న వయసు నుంచి ఒకే రకమైన దుస్తులు ధరించడానికి ఇష్టపడేవారు. హెయిర్‌స్టైల్‌, యాక్సెసరీస్‌, చెప్పులు.. ఇలా అన్నీ ఒకే తరహాలో ఉన్నవి ఎంచుకునేవారు. అలా 13 ఏళ్లొచ్చే వరకూ ఒకేలా రడీ అయిన తమను చూసి కుటుంబ సభ్యులు తప్ప ఇరుగుపొరుగు వారెవరూ గుర్తుపట్టలేకపోయేవారని చెబుతున్నారీ స్వీట్‌ సిస్టర్స్.

పెళ్లితో ఫ్యాషన్‌కు బ్రేక్!

‘నేను, రోజీ ఐడెంటికల్‌ ట్విన్స్‌. ఇంట్లో వాళ్లు తప్ప బయటి వాళ్లు మమ్మల్ని గుర్తుపట్టడం చాలా అరుదు. అలాంటిది ఇద్దరం ఒకే రకమైన దుస్తులు ధరిస్తే.. ఎవరెవరో పోల్చుకోలేకపోయేవారు. పెద్దయ్యే క్రమంలో ఇద్దరం ఒకే రకమైన దుస్తులు ఎంచుకోవడానికే ఇష్టపడేవాళ్లం. అంతేకాదు.. చెయిన్‌, బ్రేస్‌లెట్‌, చెప్పులు, కళ్లద్దాలు.. ఇలా ప్రతిదీ ఒకేలా ఉండేలా చూసుకునేవాళ్లం. ఇలా దుస్తులు, యాక్సెసరీస్‌తో మా వార్డ్‌రోబ్స్‌ నిండిపోయేవి. అంతేకాదు.. ఒకే రకమైన హెయిర్‌స్టైల్‌ మెయింటెయిన్‌ చేసేవాళ్లం కూడా! 13 ఏళ్లొచ్చే వరకూ ఇదే పద్ధతిని ఫాలో అయ్యాం. ఆపై ఇద్దరికీ పెళ్లిళ్లైపోవడంతో మా ట్విన్‌ ఫ్యాషన్‌ స్టైల్‌కు బ్రేక్‌ పడింది..’ అంటోన్న ఈ కవల సోదరీమణులు.. తిరిగి 2000 సంవత్సరం నుంచి మళ్లీ ఒకే రకమైన దుస్తులు వేసుకోవడం ప్రారంభించారు. ఇలా గత 23 ఏళ్లుగా తమ భర్తల నుంచి దూరంగా ఉంటోన్న ఈ అక్కచెల్లెళ్లిద్దరూ.. అప్పట్నుంచే తమ మిక్స్‌ అండ్‌ మ్యాచింగ్‌ ఫ్యాషన్‌ని తిరిగి మొదలుపెట్టేశామంటున్నారు.

షాపింగ్‌.. మాకిష్టం!

ప్రస్తుతం రోజీ ఇద్దరు పిల్లల తల్లి, క్యాథీకి ఒకరు సంతానం. ఇన్నేళ్లూ పిల్లల ఆలనాపాలనలోనే గడిపిన వీరు.. తమ పిల్లలు వాళ్ల వాళ్ల జీవితాల్లో స్థిరపడడంతో.. తిరిగి తాము కలిసి గడిపే సమయం దొరికిందంటున్నారు.

‘మా ఇద్దరికీ చిన్నతనం నుంచీ షాపింగ్‌ అంటే ఇష్టం. మ్యాచింగ్‌ అవుట్‌ఫిట్స్‌ని ఎంచుకునే విషయంలో ఒకరితో ఒకరం పోటీ పడేవాళ్లం. పైగా ఫ్యాషన్‌ విషయంలో మా ఇద్దరి అభిరుచులు ఒక్కటే. ప్రస్తుతం మా ఇద్దరి వార్డ్‌రోబ్‌లో 50కి పైగా ఫ్యాషనబుల్‌ దుస్తులున్నాయి. అందులో లేటెస్ట్‌ మోడల్‌ షార్ట్స్‌, లాంగ్‌ స్కర్ట్స్‌ దగ్గర్నుంచి.. వింటేజ్‌ మోడల్‌ డ్రస్సుల దాకా.. దాదాపు అన్ని ఫ్యాషనబుల్‌ దుస్తులు మా వద్ద ఉన్నాయి. వాటిపై మ్యాచ్‌ చేసేందుకు బ్లేజర్స్‌, జీన్స్‌.. వంటివీ ఒకే రంగుల్లో ఉన్నవే ఎంచుకుంటున్నాం. ఇక షాపింగ్‌తో పాటు ప్రయాణాలు, దగ్గర్లోని పర్యటక ప్రాంతాల్ని సందర్శించడానికీ ఇష్టపడుతుంటాం. ఇలా ఎక్కడికెళ్లినా కలిసే వెళ్లే మేము.. డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ కూడా కలిసే తీసుకుంటాం..’ అంటూ తమ అన్యోన్యతను చాటుకుంటున్నారీ అక్కచెల్లెళ్లు.

ఫొటో ప్లీజ్‌.. అంటున్నారు!

అటు దుస్తులతో, ఇటు యాక్సెసరీస్‌తో నఖశిఖపర్యంతం ఒకేలా మెరిసిపోతోన్న ఈ ట్విన్‌ సిస్టర్స్‌.. తమ ఫ్యాషనబుల్‌ ఫొటోల్నీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ మురిసిపోతున్నారు. సరదాగా పార్క్‌కి వెళ్లినా, పర్యటక ప్రాంతానికి వెళ్లినా.. అక్కడ దిగిన ఫొటోల్నీ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు.

‘ఒకే ముఖకవళికలున్న మా ఇద్దరి డ్రస్సింగ్‌ సెన్సే కాదు.. ఎత్తు, చర్మ ఛాయ కూడా దాదాపు ఒకేలా ఉంటుంది. అందుకే ఇంట్లో వాళ్లు తప్ప బయటివాళ్లు మమ్మల్ని పోల్చుకోలేరు. ఇక ఇద్దరం ఒకేలా రడీ అయి ఎక్కడికెళ్లినా.. ఫొటో ప్లీజ్‌ అంటూ చాలామంది మాతో ఫొటోలు దిగడానికి సరదాపడడం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఏదేమైనా ఇదో అందమైన అనుభూతి!’ అంటోన్న ఈ స్వీట్‌ సిస్టర్స్‌.. తమ ఇళ్లనూ ఒకే తరహాలో డిజైన్‌ చేయించుకోవడం మరో విశేషం. మరి, కవలలు కలిసి పుట్టడం కామనే అయినా.. తమ ఫ్యాషన్‌ సెన్స్‌తో సోషల్‌ మీడియాలో మినీ సెలబ్రిటీలుగా మారిపోయిన రోజీ, క్యాథీ ట్విన్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోల్ని మీరూ చూసేయండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్