అక్కడ స్పూన్లే ‘ప్రేమ’ కానుకలు!

వేలంటైన్స్‌ డే రోజున విభిన్న రకాలుగా ప్రేమను తెలుపుకోవడం కామనే అయినా.. వేడుకలను జరుపుకొనే తీరు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందని చెప్పచ్చు. మరి, ఏ దేశంలో వేలంటైన్స్‌ డేను ఎలా జరుపుకొంటారో తెలుసుకుందాం రండి....

Published : 14 Feb 2024 13:42 IST

ప్రేమలో ఉన్న వారికి ప్రతిరోజూ పండగే అయినా ఏటా ‘ప్రేమికుల దినోత్సవాన్ని’ ప్రత్యేకంగా జరుపుకొంటారు. తమ మనసులోని ప్రేమను చాక్లెట్లు, బొమ్మలు, ఖరీదైన బహుమతులు.. చివరికి ఒక రోజా పువ్వుతోనైనా తెలియజేస్తుంటారు. ఇలా వేలంటైన్స్‌ డే రోజున విభిన్న రకాలుగా ప్రేమను తెలుపుకోవడం కామనే అయినా.. వేడుకలను జరుపుకొనే తీరు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందని చెప్పచ్చు. మరి, ఏ దేశంలో వేలంటైన్స్‌ డేను ఎలా జరుపుకొంటారో తెలుసుకుందాం రండి..

 బల్గేరియాలో వేలంటైన్స్‌ డేను ‘వైన్‌ డే’ పేరుతో జరుపుకొంటారు. ఈరోజున జంటలు వైన్‌ను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ తమ ప్రేమను తెలియజేస్తుంటారు.
 ఫిలిప్పీన్స్‌లో వేలంటైన్స్‌ డే రోజున సామూహిక వివాహాలు చేసుకుంటారు. వందల, వేల సంఖ్యలో జంటలు ఈరోజు వివాహ బంధంతో ఒక్కటవుతాయి. ఈ వివాహాలకు ఏకంగా అక్కడి ప్రభుత్వమే ఏర్పాట్లు చేయడం మరో విశేషం.


 

 2007 నుంచి ‘ఘనా’ దేశ ప్రభుత్వం ఫిబ్రవరి 14ను ‘జాతీయ చాక్లెట్‌ దినోత్సవం’గా నిర్వహిస్తోంది. చాక్లెట్‌ తయారీకి ఉపయోగించే కోకో బీన్స్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటైన ఘనా తమ దేశంలో టూరిజాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఈ వేడుకలను నిర్వహిస్తోంది. ఈక్రమంలో ఫిబ్రవరి 14న ఆ దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా చాక్లెట్‌ థీమ్‌ మెనూలు, ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేస్తారు.
 దక్షిణకొరియాలో ప్రేమికుల దినోత్సవ వేడుకలు భిన్నంగా జరుగుతాయి. ఇక్కడ ప్రతి నెల 14న ‘ప్రేమికుల దినోత్సవం’గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఫిబ్రవరి 14, మార్చి 14లకు మరింత ప్రత్యేకత ఉంటుంది. ఫిబ్రవరి 14న పురుషులకు మహిళలు చాక్లెట్లను బహుమతిగా ఇస్తారు. అయితే పురుషులు ఆ వెంటనే కాకుండా మార్చి 14న తమ ఇష్టసఖులకు చాక్లెట్లను తిరిగి బహుమతిగా ఇస్తారు. దీన్ని ‘వైట్ డే’గా పిలుచుకుంటారు. ఇక ఏప్రిల్‌ 14న ‘బ్లాక్‌ డే’ను నిర్వహిస్తారు. ఈరోజున గడిచిన రెండు నెలల్లో ఎలాంటి బహుమతులు అందుకోని వారందరూ (సింగిల్స్) ఒక చోట చేరి ‘బ్లాక్‌ బీన్‌ సాస్‌ నూడుల్స్‌’ తింటారు. భలే వింతగా ఉంది కదూ కొరియన్‌ వేలంటైన్స్‌ డే!
 

 ఫిబ్రవరి 14న ప్రపంచమంతా ‘వేలంటైన్స్‌ డే’ సంబరాల్లో మునిగిపోతే.. ఉత్తర ఐరోపాలోని ఈస్టోనియా దేశంలో మాత్రం ఈరోజును ‘ఫ్రెండ్షిప్‌ డే’గా సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఈరోజు స్నేహితులు ఒకరికొకరు గ్రీటింగ్‌ కార్డులు, బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటారు. కేవలం స్నేహితులే కాకుండా బంధువులు కూడా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుతూ సందడి చేస్తారు.
 ఇంగ్లండ్‌తో సరిహద్దును పంచుకునే ‘వేల్స్‌’ దేశంలో వేలంటైన్స్‌ డేను పూర్తి విభిన్నంగా జరుపుకొంటారు. ఇక్కడ ప్రేమికుల దినోత్సవాన్ని జనవరి 25న ‘డే ఆఫ్‌ సాన్‌ డ్వైన్‌వెన్‌’ పేరుతో సెలబ్రేట్‌ చేసుకుంటారు. ఈరోజు చెక్కతో తయారు చేసిన విభిన్న ఆకారాల్లో ఉండే స్పూన్స్‌ను ప్రేమికులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ప్రత్యేకించి హృదయాకృతిలో ఉండే స్పూన్స్‌ను తమ భాగస్వామికి అందిస్తూ తమ మనసులోని ప్రేమను తెలియజేస్తుంటారు. ఇక్కడ ఈ ఆచారాన్ని 16వ శతాబ్దం నుంచి కొనసాగిస్తున్నారు.
 

 మధ్య యూరప్‌లో ఉండే చెక్‌ రిపబ్లిక్‌ దేశంలో ప్రేమికుల దినోత్సవాన్ని మే 1న జరుపుకొంటారు. ఈరోజు ప్రేమికులంతా ఆ దేశానికి చెందిన ప్రముఖ కవి ‘కరేల్‌ హైనెక్‌ మచా’ విగ్రహం దగ్గరికి చేరుకుంటారు. అక్కడ ఉండే చెర్రీ చెట్ల కింద తమ ప్రేయసిని/ప్రియుడిని ప్రేమతో ముద్దాడతారు. ఇలా చేయడం వల్ల అంతా మంచే జరుగుతుందని వారి నమ్మకం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్