ఈ పెళ్లికూతురి ‘డెనిమ్ లెహెంగా’ చూశారా?

రోజులు గడిచే కొద్దీ పెళ్లిళ్ల తీరు మారుతోంది.. ఈ కాలపు వధువులు తమ పెళ్లి కోసం ఎంచుకునే అవుట్‌ఫిట్స్‌లోనూ పలు మార్పులొస్తున్నాయి. ఈ క్రమంలోనే సంప్రదాయాల్ని పక్కన పెట్టి మోడ్రన్‌ దుస్తులపై మోజు పడుతున్న వారు కొందరైతే.. ట్రెడిషనల్‌కే కాస్త మోడ్రన్‌ టచ్‌ ఇస్తూ మెరిసిపోతున్నారు మరికొందరు.

Published : 20 Dec 2023 20:15 IST

(Photos: Instagram)

రోజులు గడిచే కొద్దీ పెళ్లిళ్ల తీరు మారుతోంది.. ఈ కాలపు వధువులు తమ పెళ్లి కోసం ఎంచుకునే అవుట్‌ఫిట్స్‌లోనూ పలు మార్పులొస్తున్నాయి. ఈ క్రమంలోనే సంప్రదాయాల్ని పక్కన పెట్టి మోడ్రన్‌ దుస్తులపై మోజు పడుతున్న వారు కొందరైతే.. ట్రెడిషనల్‌కే కాస్త మోడ్రన్‌ టచ్‌ ఇస్తూ మెరిసిపోతున్నారు మరికొందరు. భారత సంతతికి చెందిన ఓ యూకే వధువు కూడా ఇటీవలే జరిగిన తన పెళ్లిలో ఇదే ట్రెండ్‌ ఫాలో అయింది. భారతీయ సంప్రదాయానికి, పాశ్చాత్య సంస్కృతిని మేళవించి రూపొందించిన డెనిమ్‌ లెహెంగాను తన పెళ్లి కోసం ఎంచుకుందామె. ఇక ఈ బ్రైడల్‌ అటైర్‌ని స్వయంగా ఆమె తండ్రే రూపొందించడం మరో విశేషం. అలా తన వెడ్డింగ్‌ అటైర్‌తో అతిథుల్ని కట్టిపడేయడమే కాదు.. సోషల్‌ మీడియాలోనూ వైరల్‌గా మారింది ఆమె డ్రస్‌. ఇంతకీ ఎవరా వధువు? ఆమె ధరించిన డెనిమ్‌ లెహెంగా ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం రండి..

ట్రెండ్‌ సెట్టర్‌.. ఫ్యాషన్‌ క్వీన్!

అహానా ఖోస్లా.. భారతీయ మూలాలున్న ఈమె ప్రస్తుతం యూకేలోని హ్యాంప్‌షైర్‌లో నివసిస్తోంది. ఫ్యాషన్‌పై మక్కువ చూపే అహానా.. కంటెంట్‌ క్రియేటర్‌గా, ట్రెండ్‌ ఫోర్‌క్యాస్టర్‌గా పనిచేస్తోంది. కొత్త కొత్త ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ని గుర్తించడం, అవి భవిష్యత్తులో ఫ్యాషన్‌ పరిశ్రమను ఎలా ప్రభావితం చేస్తాయో అంచనా వేయడం ఆమె పని. ఈ క్రమంలోనే ‘ది ఫోర్‌సైట్‌ ఫోరమ్‌’ పేరుతో ఓ ఆన్‌లైన్‌ వేదికను ప్రారంభించింది. సహజంగానే ఫ్యాషన్‌ లవర్‌ అయిన అహానా.. కొత్త కొత్త ఫ్యాషన్లను ప్రయత్నిస్తూ.. ఆ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ నేటి యువతకు ఫ్యాషన్‌ ఐకాన్‌గా మారిపోయింది. సాధారణ సమయాల్లోనే విభిన్న ఫ్యాషనబుల్‌ దుస్తుల్ని ధరిస్తూ ట్రెండ్‌ సెట్టర్‌గా పేరుతెచ్చుకున్న అహానా.. తన పెళ్లిలోనూ సరికొత్త ట్రెండ్‌ని సృష్టించాలనుకుంది. ఈ ఆలోచనతోనే భారతీయ సంప్రదాయానికి, పాశ్చాత్య సంస్కృతిని జోడించేలా తన వెడ్డింగ్‌ లెహెంగాను ఎంచుకోవాలనుకుంది. వృత్తిరీత్యా ఫ్యాషన్‌ డిజైనర్‌ అయిన ఆమె తండ్రి మనోవిరాజ్‌ ఖోస్లా తన కూతురు కోరికను తెలుసుకున్నారు. బెంగళూరుకు చెందిన ఆయన ఈ విషయంపై తన కూతురితో చర్చించి డెనిమ్‌ లెహెంగా రూపొందించాలన్న నిర్ణయానికొచ్చారు. ఈ ఆలోచన అహానాకూ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసింది.

డెనిమ్‌కు కొత్త హంగులు!

అయితే డెనిమ్‌ లెహెంగాను ప్లెయిన్‌గా కాకుండా.. కాస్త ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకోవాలనుకుంది అహానా. ఈ క్రమంలోనే సీతాకోకచిలుకలు, తూనీగలు, ఫ్లోరల్‌ మోటివ్స్‌తో ఎంబ్రాయిడరీ చేయించుకొని.. లెహెంగాకు అదనపు హంగులద్దిందామె. ఇక లెహెంగా అడుగున మెటాలిక్‌ షేడెడ్‌ సీక్విన్‌ బోర్డర్‌ను జతచేసిన ఆమె.. తన అవుట్‌ఫిట్‌కు మ్యాచింగ్‌గా స్లీవ్‌లెస్‌ బ్లౌజ్, ట్యూల్ దుపట్టాతో తన లుక్‌ని పూర్తిచేసింది. తక్కువ మేకప్‌, వదులైన హెయిర్‌స్టైల్‌, సింపుల్‌ జ్యుయలరీతో ముస్తాబైన ఈ కొత్త పెళ్లి కూతురు.. ఇలా తన ట్రెడిషనల్‌ కమ్‌ ట్రెండీ అటైర్‌తో అతిథుల్ని కట్టిపడేసింది. మరోవైపు వరుడు షేహాన్‌ కూడా వధువు డెనిమ్‌ లెహెంగాకు మ్యాచింగ్‌గా ఉండేలా.. డెనిమ్‌ బంధ్‌గాలా-తెలుపు రంగు ట్రౌజర్‌తో మెరిసిపోయాడు. ఇక ఈ వధూవరులిద్దరూ తమ అవుట్‌ఫిట్స్‌కు మ్యాచయ్యేలా డెనిమ్‌ ఫుట్‌వేర్‌ ధరించడం మరో విశేషం!

లెహెంగానే కావాలన్నా..!

అహానా తన పెళ్లి కోసం ఎంచుకున్న డెనిమ్‌ లెహెంగా ఫొటోల్ని, తన పెళ్లి ఫొటోల్ని ఇటీవలే సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో ఆమె అటైర్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీంతో తెగ సంతోషపడిపోతోందీ కొత్త పెళ్లి కూతురు. తన పెళ్లి డ్రస్‌కు ఇంత ఆదరణ వస్తుందనుకోలేదంటూ ఉబ్బితబ్బిబ్బవుతోంది.

‘చాలామంది పెళ్లి దుస్తుల్లో అంత సౌకర్యవంతంగా ఫీలవ్వరు.. ఇందుకు కారణం హెవీగా ఉండేలా దుస్తుల్ని ఎంచుకోవడమే! కానీ డెనిమ్‌తో ఆ సమస్య ఉండదు. ఏ సీజన్‌లోనైనా, ఎంత సేపైనా దీన్ని ధరించి కంఫర్టబుల్‌గా ఉండచ్చు.. పైగా ఇది నలిగిపోతుందేమోనన్న సమస్య కూడా ఉండదు. పెళ్లికి మోడ్రన్‌ దుస్తులు ఎంచుకుంటానన్నప్పుడు మా నాన్న నాకు పూర్తిస్థాయిలో ట్రెండీగా ఉండే దుస్తులకు సంబంధించిన ఐడియాలిచ్చారు. కానీ అప్పుడు నేను ఒక్కటే చెప్పా.. నా పెళ్లికి కచ్చితంగా లెహెంగానే ధరిస్తా.. కానీ దానికి మోడ్రన్‌ టచ్‌ కూడా కావాలని అడిగా.. అలా నా పెళ్లికి డెనిమ్‌ లెహెంగా కుదిరిందన్నమాట!’ అంటోంది అహానా.


వీళ్లూ.. మోడ్రన్‌ బ్రైడ్సే!

అహానానే కాదు.. గతంలోనూ కొందరు భారతీయ సంతతికి చెందిన ఎన్నారై వధువులు కూడా ట్రెడిషనల్‌ కమ్‌ ట్రెండీ వెడ్డింగ్‌ అటైర్స్‌లో మెరిసిపోయారు.

వారిలో ఆలియా గుజ్రాల్‌ ఒకరు. తన తల్లి ఎంతో ప్రేమగా డిజైన్‌ చేయించిన, 24 క్యారెట్ల బంగారు కోర్సెట్‌ టాప్‌ను తన పెళ్లి కోసం ఎంచుకుందామె. దీనికే ఓ టెంపుల్‌ జ్యుయలరీ సెట్‌ కూడా అనుసంధానించి డిజైన్‌ చేయడంతో అప్పట్లో ఆమె డ్రస్‌ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ ప్రత్యేకమైన కోర్సెట్‌ టాప్‌ను తన ఐవరీ స్కర్ట్‌కు జతచేసి.. మెరుపులు మెరిపించిందీ మోడ్రన్ బ్రైడ్.

ఇండో-అమెరికన్‌ వ్యాపారవేత్త సంజనా రిషి కూడా మూడేళ్ల క్రితం తన మోడ్రన్‌ వెడ్డింగ్‌ అటైర్‌తో వార్తల్లో నిలిచింది. పెళ్లి కోసం పేస్టల్‌ బ్లూ ప్యాంట్సూట్‌ని ఎంచుకున్న ఆమె.. అదే కలర్‌ షీర్‌ దుపట్టాతో తన లుక్‌ని పూర్తిచేసింది. ఇలా ఈ వధువు పెళ్లి దుస్తులు అప్పట్లో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్