Published : 20/02/2022 12:06 IST

చర్మంపై ముడతలు రాకుండా…

వయసు పైబడుతోందని చెప్పడానికి కనిపించే లక్షణాల్లో అన్నిటికంటే ముఖ్యమైంది- చర్మం ముడతలు పడటం. అందులోనూ ముఖం మీది చర్మం బాగా సున్నితంగా ఉంటుంది కాబట్టి ముడతల ప్రభావం ఎక్కువగా ముఖం మీదే కనిపిస్తుంది. ఈ క్రమంలో అసలు చర్మంపై ముడతలు రావడానికి కారణాలు ఏంటో తెలుసుకుంటే అవి రాకుండా నివారించడానికి వీలు పడుతుంది.

చర్మంపై ముడతలు రావడానికి వయసు పెరగడం ఒక్కటే కారణం కాదు.. సౌందర్య సంరక్షణలోను, మన జీవన విధానాల్లోనూ చేసే కొన్ని పొరపాట్లు కూడా అందుకు కారణమవుతాయి.

ఎండలో..

బయట ఎండలో తిరిగేటప్పుడు చర్మం సూర్యరశ్మి వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతుంది. చిన్న వయసులోనే వార్ధక్యపు ఛాయలు ఎక్కువగా కనిపించడానికి కూడా సూర్యరశ్మి కారణమవుతుంది. అందుకే ఎండలోకి వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్లు రాసుకోవడం వంటి రక్షణ చర్యలు తప్పకుండా పాటించాలి.

మేకప్‌తోనే నిద్రపోతే..

ఏదైనా పని మీద బయటకు వెళ్లినప్పుడు అవసరమైతే మేకప్ వేసుకుంటాం. అయితే పని పూర్త్తె ఇంటికి తిరిగి వచ్చాక మేకప్ తొలగించుకుని ముఖాన్ని తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. లేదంటే మేకప్ ఉత్పత్తుల్లో ఉండే ఫ్రీ రాడికల్స్, కాలుష్య కారకాలు.. ఇవన్నీ చర్మం మీద ప్రభావం చూపించి ముడతలు పడేలా చేస్తాయి. కాబట్టి మేకప్‌తో నిద్రకు ఉపక్రమించడం అనేది మంచి పద్ధతి కాదు.

బరువులో మార్పులు..

చర్మంపై ముడతలు రావడానికి మన శరీర బరువులో వచ్చే మార్పులు కూడా కారణం కావచ్చు. ఒకేసారి బరువు తగ్గడం లేదా పెరగడం వంటివి జరిగితే స్ట్రెచ్‌మార్క్స్ రావడంతో పాటు చర్మం సాగినట్లుగా.. ముడతల్లా కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి బరువు మరీ తక్కువగా లేదా ఎక్కువగా కాకుండా తగినంత ఉండేలా జాగ్రత్తపడాలి.

పోషకాలు అందకపోయినా..

చర్మం ఆరోగ్యవంతంగా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పళ్లు, కూరలు మన ఆహారంలో భాగం కావాలి. ఎందుకంటే అవి చర్మంపై బాగా ప్రభావం చూపిస్తాయి. వార్థక్యపు ఛాయలు కనిపించకుండా చేస్తాయి. ఎప్పుడైతే చర్మ సంరక్షణకు అవసరమయ్యే పోషకాలు అందవో.. అప్పుడు ఆ ప్రభావం తప్పకుండా చర్మం మీద కనిపిస్తుంది.

పక్కకు తిరిగి పడుకోవడం..

నిద్రపోయేటప్పుడు మనం ఎలా పడుకుంటున్నాం అన్నది కూడా చర్మంపై ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా ఎక్కువమంది పక్కకు తిరిగి పడుకుంటారు. అయితే ఇలా పడుకున్నప్పుడు ముఖానికి, తలగడకు జరిగే రాపిడి వల్ల ముఖచర్మంపై సన్నని గీతలు ఏర్పడతాయి. క్రమంగా ఇవి ముడతలుగా కూడా మారే అవకాశాలు ఉంటాయట. అందుకే పక్కకు తిరిగి కాకుండా వెల్లకిలా పడుకోవడం ఉత్తమం.

నిద్ర తక్కువైతే..

ప్రస్తుతం రకరకాల కారణాల దృష్ట్యా నిద్రా సమయం తగ్గిపోతోంది. ఫలితంగా ముఖంపై ఉండే చర్మ కణాలు అలసిపోయి, చర్మం ముడతలు పడటానికి కారణం అవుతోంది. అందుకే రోజూ 8గం|| నిద్ర తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.

ఎక్కువగా కూర్చోవడం..

ఉన్నచోటే అదే పనిగా కూర్చుని ఉంటే శరీరానికి వ్యాయామం ఏమీ అందక ఆ ప్రభావం చర్మంపై తప్పక కనిపిస్తుంది. అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని