Sri Lanka: ‘ఈస్టర్‌ పేలుళ్ల’కు స్వదేశంలోనే కుట్ర..? దర్యాప్తునకు ఆదేశించిన దేశాధ్యక్షుడు

శ్రీలంక బాంబు దాడుల ఘటనలో దేశ నిఘాసంస్థ చీఫ్‌ సహా పలువురు ప్రభుత్వాధికారుల ప్రమేయం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటిపై దర్యాప్తునకు ఆదేశిస్తామని దేశాధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే తెలిపారు.

Published : 11 Sep 2023 02:35 IST

కొలంబో: శ్రీలంకను కుదిపేసిన ‘ఈస్టర్‌ బాంబు పేలుళ్ల (Easter Terror Attacks)’ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. 2019నాటి ఈ మారణహోమంలో శ్రీలంక నిఘా సంస్థ చీఫ్‌ సహా పలువురు ప్రభుత్వాధికారుల ప్రమేయం ఉందని బ్రిటన్‌కు చెందిన ‘ఛానెల్‌ 4’ ఇటీవల ఓ డాక్యుమెంటరీలో తీవ్ర ఆరోపణలు చేసింది. రాజపక్స సోదరులకు అనుకూలంగా బలవంతపు రాజకీయ మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ దాడులకు కుట్ర పన్నినట్లు పేర్కొంది. ఇది కాస్త స్థానికంగా దుమారానికి దారితీసింది. ఈ క్రమంలోనే.. ఆరోపణలపై దర్యాప్తునకు కమిటీని ఏర్పాటు చేస్తామంటూ దేశాధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే ప్రకటించారు.

ఈస్టర్ బాంబు పేలుళ్లకు దేశ ఇంటెలిజెన్స్ చీఫ్ మేజర్‌ జనరల్‌ సురేశ్‌ సలే కుట్ర పన్నారన్న ఆరోపణలపై విచారణకుగానూ రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన ఒక కమిటీని నియమించనున్నట్లు ఆదివారం ఓ అధికారిక ప్రకటన వెలువడింది. ఈ దాడి అంతా కుట్రేనని మాజీ అటార్నీ జనరల్ చేసిన ఆరోపణలపైనా దర్యాప్తు చేసేందుకు పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీని నియమిస్తామని విక్రమసింఘే తెలిపారు. ఈ రెండింటి నివేదికలను పార్లమెంటులో సమర్పిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా.. బ్రిటన్‌ ఛానెల్‌ చేసిన ఆరోపణలను దేశ రక్షణ శాఖ ఇప్పటికే ఖండించింది. మరోవైపు.. 2019 అధ్యక్ష ఎన్నికల్లో తాను రాజకీయ ప్రయోజనం పొందాననే ఆరోపణలను మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తోసిపుచ్చారు.

‘ఖలిస్థానీవాదం’పై మోదీ తీవ్ర ఆందోళన.. కెనడా ప్రధానితో భేటీ

2019 ఏప్రిల్‌ 21న ఈస్టర్‌ పండగనాడు లంకలో మూడు చర్చిలు, మూడు లగ్జరీ హోటళ్లలో వరుస పేలుళ్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఐఎస్‌ఐఎస్‌ ముఠాతో సంబంధమున్న నేషనల్‌ తవ్‌హీద్‌ జమాత్‌ అనే స్థానిక ఉగ్రముఠాకు చెందిన 9 మంది ఆత్మహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లలో 11 మంది భారతీయులు సహా 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 500 మందికి పైగా గాయపడ్డారు. ఈ పేలుళ్లపై నిఘా సంస్థల నుంచి ముందస్తు హెచ్చరికలు వచ్చినప్పటికీ.. వాటిని నిర్మూలించడంలో అప్పటి మైత్రిపాల సిరిసేన ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని