Gaza: సముద్ర మార్గంలో సాయం.. గాజాకు చేరుకున్న 200 టన్నుల ఆహారం

గాజా వాసుల ఆకలి తీర్చేందుకు దాదాపు 200 టన్నుల ఆహార సామగ్రితో ఇటీవల సైప్రస్‌ నుంచి బయల్దేరిన నౌక శుక్రవారం గాజా తీరానికి చేరుకుంది.

Updated : 16 Mar 2024 13:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధం (Israel Hamas War)తో దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న గాజావాసులకు సముద్ర మార్గం ద్వారా మానవతా సాయం అందనుంది. దాదాపు 200 టన్నుల ఆహార సామగ్రితో ఇటీవల సైప్రస్‌ నుంచి బయల్దేరిన నౌక (Aid Ship) శుక్రవారం గాజా (Gaza) తీరానికి చేరుకుంది. ఓడ నుంచి సామగ్రి దించివేత ప్రక్రియ ప్రారంభమైనట్లు సమాచారం. చిన్న పడవల ద్వారా భూభాగానికి చేర్చి.. స్థానికులకు పంచి పెట్టనున్నారు.

ఆకలితో అలమటిస్తోన్న పాలస్తీనీయులకు సముద్ర మార్గంలో అందనున్న తొలి సాయం ఇదేనని ‘వరల్డ్‌ సెంట్రల్‌ కిచెన్‌ (WCK)’ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, సైప్రస్‌, స్పెయిన్‌కు చెందిన ‘ఓపెన్‌ ఆర్మ్స్‌’ సంస్థలతో ఇది సమన్వయం చేసుకుంటోంది. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ షెఫ్‌ జోస్‌ ఆండ్రెస్‌ ‘డబ్ల్యూసీకే’ను స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రాంతాలతోపాటు ఆకలితో అలమటిస్తున్న ప్రాంతాల్లో భోజనం అందజేస్తున్నారు.

గాజాలో ఆహారం అర్థిస్తున్న వారిపై కాల్పులు.. 20 మంది మృతి!

గాజాలో దాదాపు ఆరు లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారని ఐరాస ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. చిన్నారులు తీవ్ర పోషకాహారం లోపంతో బాధపడుతున్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలో అమెరికా, జోర్డాన్‌, ఫ్రాన్స్‌ తదితర దేశాలు ఆహార పొట్లాలను జారవిడుస్తున్నాయి. స్థానికంగా ఆహార సంక్షోభాన్ని నివారించాలంటే రోజుకు 500 ఫుడ్‌ ట్రక్కులు గాజాలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. కానీ, జనవరిలో రోజుకు 150.. ఫిబ్రవరిలో 97 ట్రక్కులు మాత్రమే ప్రవేశించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని