America: ‘ఆయుధాలు ఇచ్చి ఆహారధాన్యాలు తీసుకో’.. రష్యా తీరుపై అమెరికా ఆందోళన..!

ఉత్తరకొరియాకు (North Korea) అవసరమైన ఆహార ధాన్యాలు అందించి ఆయుధాలను కొనగోలు చేయాలని రష్యా (Russia) ప్రయత్నాలు చేస్తున్నట్లు అమెరికా (America) ఆరోపించింది. 

Published : 01 Apr 2023 01:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏడాదికి పైగా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని (Ukraine Crisis) కొనసాగిస్తోన్న రష్యా.. ఇప్పటికే భారీ స్థాయిలో సైనిక, ఆయుధ సంపత్తిని కోల్పోయింది. దీంతో అదనపు ఆయుధాలు సమకూర్చుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఉత్తర కొరియా (North Korea) మాత్రం తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో తమకు ఆయుధ సహాయం చేస్తే.. అందుకు బదులుగా ఆహార ధాన్యాలను అందజేస్తామని ఉత్తర కొరియాతో రష్యా (Russia) ఒప్పందం చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు అమెరికా (America) ఆరోపించింది.

‘ఉక్రెయిన్‌పై భీకర దాడులకు పాల్పడుతున్న రష్యా సైన్యానికి ఉత్తర కొరియా సహాయం చేయడంపై ఆందోళనకరం. అదనపు మందుగుండు సామగ్రి కొనుగోలు చేసేందుకు రష్యా తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని మాకు సమాచారం. ఉత్తర కొరియాకు బృందాన్ని పంపించాలని చూస్తోంది. ఆయుధ సహాయానికి బదులుగా ఉత్తర కొరియాకు రష్యా ఆహారాన్ని అందజేస్తోందని మాకు తెలిసింది’ అని అమెరికా జాతీయ భద్రతా అధికార ప్రతినిధి జాన్‌ కిర్బీ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, రష్యాకు ఆయుధాలు అమ్మడం, సరఫరా చేయమని ఇటీవల ఉత్తరకొరియా చేసిన ప్రకటననూ గుర్తుచేశారు. ఒకవేళ ఉత్తర కొరియా-రష్యా మధ్య ఆయుధ ఒప్పందం జరిగితే మాత్రం అది ఐరాస భద్రతా మండలి నియమాలకు విరుద్ధమన్నారు.

మరోవైపు నియంత పాలనలో ఉన్న ఉత్తరకొరియా.. ఇటీవల కరవు, వరదలతో సతమతమవుతున్నట్లు సమాచారం. దీంతో 2021తో పోలిస్తే 2022లో భారీ స్థాయిలో ఆహార ఉత్పత్తుల దిగుబడి భారీ స్థాయిలో తగ్గినట్టు ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP)తోపాటు పలు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. దీంతో సరైన తిండి లభించక అక్కడి పౌరులు పస్తులు ఉండే స్థితిలో ఉన్నారని చెబుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఉత్తరకొరియాకు అవసరమైన ఆహారాన్ని అందించి.. తమకు అవసరమైన ఆయుధాలను సమకూర్చుకునేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తుందని అమెరికా ఆరోపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని