Ukraine Crisis: ఉక్రెయిన్‌ దాడుల్లో అమెరికన్‌ జర్నలిస్ట్‌ మృతి..!

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు సమీపంలో జరిగిన కాల్పుల్లో అమెరికాకు ‘న్యూయార్క్‌ టైమ్స్‌’కు చెందిన బ్రెంట్‌ రెనాడ్‌ అనే జర్నలిస్ట్‌ మృతి చెందారు.

Updated : 13 Mar 2022 22:23 IST

ధ్రువీకరించిన కీవ్‌ అధికారులు

కీవ్‌: ఉక్రెయిన్‌లో జరుగుతోన్న భీకర పోరులో వేల మంది సైనికులతోపాటు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వైద్యులూ మరణిస్తున్నారనే వార్తలు యావత్‌ ప్రపంచాన్ని కలచివేస్తున్నాయి. ఇటువంటి సమయంలో తాజాగా జరిగిన దాడుల్లో అమెరికాకు చెందిన ఓ జర్నలిస్ట్‌ ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు సమీపంలో జరిగిన కాల్పుల్లో అమెరికాకు ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’కు చెందిన బ్రెంట్‌ రెనాడ్‌ అనే జర్నలిస్ట్‌ మృతి చెందారు. ఐడీ, పాస్‌పోర్టు సాయంతో ఆయనను గుర్తించినట్లు వెల్లడించిన కీవ్‌ పోలీసులు.. ఈ దాడిలో మరో జర్నలిస్ట్‌కు తీవ్ర గాయాలైనట్లు పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాలుగా జర్నలిస్ట్‌ వృత్తిలో కొనసాగుతోన్న బ్రెంట్‌.. పలు దేశాల్లో యుద్ధవాతావరణ సంఘటనల కవరేజీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఉక్రెయిన్‌పై సైనిక చర్య తీవ్రతరం చేసిన రష్యా.. భీకర వైమానిక దాడులకు పాల్పడుతోంది. తాజాగా లీవ్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైనిక శిక్షణా కేంద్రంపై జరిపిన క్షిపణి దాడిలో 35 మంది చనిపోయారు. మరో 134 మందికి తీవ్రగాయాలయ్యాయి. దాదాపు 30 క్షిపణులతో తమ సైనిక స్థావరంపై రష్యా సేనలు దాడులకు పాల్పడినట్లు ఉక్రెయిన్‌ పేర్కొంది. ఇలా భీకర దాడులతో వణికిపోతోన్న ఉక్రెయిన్‌లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులను ప్రపంచానికి చూపించేందుకుగానూ వందల మంది అంతర్జాతీయ జర్నలిస్టులు ఉక్రెయిన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఉక్రెయిన్‌ అధికారుల ప్రకారం, దాదాపు 1300 మంది అంతర్జాతీయ మీడియా సిబ్బంది ఉక్రెయిన్‌ యుద్ధ భూమిలో కవరేజీ చేస్తున్నట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని