Bangladesh : బంగ్లాదేశ్‌ ప్రమాదానికి తప్పుడు లేబుల్సే కారణం..!

బంగ్లాదేశ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదానికి తప్పుడు లేబుల్సే కారణమని తెలుస్తోంది. ఆదివారం చిట్టగాంగ్‌ పోర్టుకు సమీపంలోని సీతకుండ ప్రాంతంలోని

Published : 07 Jun 2022 11:14 IST

 హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌పై నీరుపడి పేలుడు

ఇంటర్నెట్‌డెస్క్‌: బంగ్లాదేశ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదానికి తప్పుడు లేబుల్సే కారణమని తెలుస్తోంది. ఆదివారం చిట్టగాంగ్‌ పోర్టుకు సమీపంలోని సీతాకుండ ప్రాంతంలోని ఓ ప్రైవేటు కంటైనర్‌ డిపోలో మంటలు చెలరేగి.. అనంతరం భారీ పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో మొత్తం 41 మంది మరణించినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. అంతకుముందు కొన్ని మృతదేహాలను రెండు సార్లు లెక్కించడంతో 49 మంది ప్రాణాలు కోల్పోయినట్లు భావించామన్నారు. అక్కడ కంటైనర్లలోని రసాయనాలను తెలియజేస్తూ ఉండాల్సిన లేబుల్స్‌లో తేడాలు భారీ ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది.

ఈ డిపోలో నిల్వ చేసిన కంటైనర్లలో హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ ఉంది. కానీ, వాటిపై లేబుల్స్‌ వేరే విధంగా ఉన్నాయి. డిపోలో మంటలు చెలరేగగానే పెద్దసంఖ్యలో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొన్నారు. వారు ఈ లేబుల్స్‌ను చూసి.. కంటైనర్లపై నీటిని వెదజల్లారు. మంటల్లో చిక్కుకొన్న హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌పై నీరు పడటంతో  ఒక్కసారిగా  భారీ పేలుడు జరిగింది. ఈ ధాటికి కంటైనర్‌ 500 అడుగులు ఎత్తు ఎగిరిపడిందంటే ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సమీపంలోని వారు కొన్ని మీటర్ల దూరంలోకి ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో అగ్నిమాపక సిబ్బంది కూడా మరణించారు.  వాస్తవానికి హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌పై నీటికి బదులు ప్రత్యేకమైన ఫోమ్‌ను వెదజల్లాలి.

ఈ ఘటనపై అగ్నిమాపక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పూర్ణ చంద్ర ముత్సుద్ది మాట్లాడుతూ.. ‘‘హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ మంటల్లో చిక్కుకుంటే దానిపై ఎట్టిపరిస్థితుల్లో నీరు పోయకూడదని మా నిబంధనల్లో ఉంది. మా సిబ్బందికి హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ అని తెలియక నీటిని వెదజల్లారు. విషయం తెలిస్తే మా నీటి వాహనాన్ని కూడా లోపలకు తీసుకెళ్లం’’ అని చెప్పారు. ఆ కంటైనెర్‌ డిపోలో ఇప్పటికీ మంటలను పూర్తిగా ఆర్పలేదు. దీనిపై ప్రభుత్వం పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తోంది.

ఈ ప్రమాదంలో 300 మంది గాయపడ్డారు. ఇంకా చాలా మంది ఆచూకీ గల్లంతైంది. మరోవైపు మృతదేహాలను గుర్తించేందుకు పోలీసులు డీఎన్‌ఏ నమూనాలను సరిపోల్చే పనిలో పడ్డారు. ఈ ప్రక్రియ ముగిసేందుకు కొన్ని వారాలు పట్టొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని