Boeing plane:: గాల్లోకి ఎగిరాక ఇంజిన్‌ కవర్‌ ఊడిపోయి.. భయపెట్టిన బోయింగ్‌ విమానం

మరో బోయింగ్‌ విమానం ప్రయాణికులను భయపెట్టింది. గాల్లో 10,000 అడుగుల ఎత్తులో దాని కవర్‌ ఊడిపోయింది.

Updated : 08 Apr 2024 10:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విమానం గాల్లోకి ఎగరగానే దాని ఇంజిన్‌ కవర్‌ ఊడిపోయి ఫ్లాప్స్‌పై చిక్కుకొన్న ఘటన అమెరికాలో చోటు చేసుకొంది. ఈ సారి కూడా బోయింగ్‌ (Boeing) విమానానికే సమస్య ఎదురవడం గమనార్హం. ది సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737-800 విమానం డెనివర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నుంచి హ్యూస్టన్‌కు బయల్దేరింది. 10,300 అడుగుల ఎత్తుకు చేరినప్పుడు ఒక్కసారిగా దీని ఇంజిన్‌ కవర్‌ ఊడిపోయి.. రెక్కలకు ఉన్న ఫ్లాప్స్‌కు చిక్కుకుంది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 135 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. తక్షణమే  గుర్తించిన పైలట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. ప్రయాణికులను దింపేసి మరో విమానంలో హ్యూస్టన్‌కు పంపించారు. విమానం కవర్‌ ఊడి గాల్లో కొట్టుకొంటున్న వీడియోను ప్యాసింజర్లు చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీనిలో పైలట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్‌పై ప్రయాణికులకు వివరిస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఇంజిన్‌ కౌలింగ్‌ (ఇంజిన్‌ కవర్‌) వేలాడుతున్నట్లు ఉంది’ అని ఒకరు చెబుతున్నారు.

ఏమిటీ ఇంజిన్‌ కవర్‌..

సాధారణంగా వాణిజ్య విమానాల్లో ఇంజిన్లు కనిపించవు. దీనికి రక్షణగా లోహపు రేకువంటి కవర్‌ను ఉపయోగిస్తారు. ఇవి బయట నుంచి వచ్చే చెత్త, వస్తువులు ఇంజిన్లలోకి చేరకుండా కాపాడుతాయి. ఎందుకంటే ఇంజిన్లలో చిన్న వస్తువులు ఇరుక్కున్నా భారీ ప్రమాదాలకు కారణమవుతాయి. అంతేకాదు.. ఈ కవర్లు విమానం అధికంగా డ్రాగ్‌కు, ఓవర్‌ హీట్‌కు గురికాకుండా రక్షిస్తాయి.

దర్యాప్తు చేపట్టిన ఎఫ్‌ఏఏ..

సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ ఘటనపై ఎఫ్‌ఏఏ(ఫెడరల్‌ ఏవియేషన్‌ అథారిటీ) స్పందించింది. ఆ విమానం సురక్షితంగా ఎయిర్‌పోర్టులో దిగిందని తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపింది.

బోయింగ్‌ 737-800 శ్రేణికి చెందిన విమానాల్లో సమస్యలు రావడం దాదాపు వారం వ్యవధిలో ఇది రెండో సారి. గత వారం కూడా టెక్సాస్‌ నుంచి బయల్దేరిన ఈ రకం విమానం ఇంజిన్‌లో మంటలు వ్యాపించాయి. చివరికి అది ల్యాండ్‌ అయ్యాక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై కూడా ఎఫ్‌ఏఏ దర్యాప్తు చేపట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని