Canada: కెనడాలో ఎందుకు ‘సింగ్ ఈజ్ కింగ్’!
భారత్ తర్వాత ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో సిక్కులున్న దేశం కెనడా. తాజా జనగణన ప్రకారం కెనడాలో సిక్కు జనాభా దాదాపు 8 లక్షలకు చేరింది.
వరస మారిన వలస పక్షులు
తరచూ ఖలిస్థాన్‌వాదం
అక్కడి ప్రభుత్వ ఓటు బ్యాంకు రాజకీయం
ఈనాడు ప్రత్యేక విభాగం
‘‘ఇందిరాగాంధీ హత్యను ఉత్సవంగా నిర్వహించటానికి అనుమతినివ్వటం ఏమాత్రం సరైన నిర్ణయం కాదు. ఇది రెండు దేశాల సంబంధాలను దెబ్బతీస్తుంది’’.. కెనడా ప్రభుత్వాన్ని ఉద్దేశించి భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ తీవ్రస్వరంతో చేసిన తాజా హెచ్చరిక ఇది. ఈమధ్య పదేపదే భారత్, కెనడా మధ్య ఇలాంటి ఉద్రిక్తతలు తలెత్తుతునే ఉన్నాయి. దాదాపు అన్నింటికీ మూలం అతివాద సిక్కు ఖలిస్థాన్ వాదంలో ఉంది. కెనడా ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తుండటం గమనార్హం. ఎందుకని కెనడాలోనే ప్రత్యేకంగా ఈ ఖలిస్థాన్ గళం ఎక్కువగా వినిపిస్తుంది? కెనడా ప్రభుత్వం వాటిని ఎందుకు చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది?
..అలా మొదలైంది
భారత్ తర్వాత ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో సిక్కులున్న దేశం కెనడా. తాజా జనగణన ప్రకారం కెనడాలో సిక్కు జనాభా దాదాపు 8 లక్షలకు చేరింది. ఇది ఆ దేశ జనాభాలో 2శాతానికి పైనే! 8లక్షల మందిలో 30శాతంపైగా అక్కడే పుట్టినవారు. 4.5 లక్షల మంది శాశ్వత నివాస హోదా పొందినవారు. కెనడాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నదే కాకుండా, నాలుగో పెద్ద మతం సిక్కిజం. సుదూరమైన కెనడాలో సిక్కిజం ఇంతగా పెరగటానికి కారణాలు... బ్రిటిష్ వలస పాలనలో ఉన్నాయి. ఆంగ్లేయుల పాలనలో బ్రిటిష్ ఇండియా సైన్యంలో చాలామంది పంజాబీలుండేవారు. వారిలో కొందరిని విక్టోరియా మహారాణి డైమండ్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వాంకోవర్‌కు పంపించింది. తిరిగి భారత్‌కు వచ్చిన సైనికులు కెనడాలో అవకాశాల గురించి ప్రచారం చేయటంతో పంజాబ్ గ్రామాల నుంచి అనేకమంది అక్కడకు వెళ్లి, వ్యవసాయం, అటవీ రంగాల్లో పనిచేసేవారు. మొట్టమొదటగా రిసాలదార్ మేజర్ కేసర్ సింగ్ 1897లో కెనడాలో స్థిరపడ్డారు. చాలామంది సిక్కులు కెనడా సైన్యంలోనూ కుదిరారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో కెనడా తరఫున వారు బరిలో నిలిచారు. 1906నాటికి సుమారు 1500 మంది పంజాబీలు కెనడాలో ఉన్నారు. క్రమంగా వారిసంఖ్య విస్తరించింది. గురుద్వారాలు కట్టుకున్నారు. తర్వాత కుటుంబ సభ్యులను వెంట తెచ్చుకునేందుకు చట్టపరంగా పోరాడి అనుమతులు సాధించారు. నివాస హక్కు సంపాదించారు. 1960 తర్వాత నిపుణులైన సిక్కుల రాక పెరిగింది. కెనడా నుంచి అమెరికాకు కూడా విస్తరించారు.
రాజకీయ ప్రవేశం
2000 తర్వాత కెనడాలో సిక్కుల జనాభా గణనీయంగా పెరిగింది. 2006-2016 మధ్యకాలంలో పంజాబీ మాట్లాడే సిక్కుల సంఖ్య కెనడాలో 36.5% పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో, కెనడా పాలన రంగంలో కూడా వారి ప్రాబల్యం ఎక్కువైంది. జనాభా పెరగటంతో దేశ రాజకీయాలనూ ప్రభావితం చేయటం మొదలైంది. కెనడా రాజకీయాల్లోని పే-టు-ప్లే పద్ధతి వారికి అనుకూలంగా మారింది. ఈ పద్ధతిలో ప్రతి ఓటరు తాను మద్దతిచ్చే అభ్యర్థికి అనుకూలంగా ఓ దరఖాస్తుపై సంతకం చేసి, కొంత సభ్యత్వ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఉద్యోగులకు పరిమితమైన ఇది... క్రమంగా మత శాఖలకు విస్తరించింది. అదే సిక్కు మతస్థులకు కలసి వచ్చింది.
ఎంపీల్లో 18 మంది సిక్కులు
ప్రస్తుతం కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌లో 18 మంది ఎంపీలు సిక్కులు. ఎనిమిది ఫెడరల్ సీట్లలో సిక్కులు బలంగా ఉన్నారు. మరో 15 సీట్లను ప్రభావితం చేస్తారు.
* గత ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడోకు చెందిన లిబరల్ పార్టీ- అధికారానికి అవసరమైన మెజార్టీ సాధించలేదు. న్యూ డెమొక్రాటిక్ పార్టీ (ఎన్‌డీపీ) నేత జగ్మీత్‌సింగ్ మద్దతివ్వటంతో ఆయన ప్రధాని అయ్యారు. అలా సిక్కునేత కెనడా కింగ్ మేకర్ అయ్యారు.
* అంతర్జాతీయంగా సిక్కు ఉద్యమాల ప్రభావం ఇక్కడివారిపైనా పడింది. ముఖ్యంగా ఖలిస్థాన్ ఉద్యమ ప్రభావం. కెనడా ప్రభుత్వ నిఘా వర్గాలు సైతం దేశంలో ఖలిస్థాన్‌వాదులను అత్యంత ప్రమాదకర ఉగ్రవాద గ్రూపుల్లో ఒకరుగా హెచ్చరించాయి. అయినా, రాజకీయాల్లో సిక్కు మతస్థుల ప్రాధాన్యం తెలిసిన కెనడా రాజకీయ పార్టీలు ఖలిస్థాన్ వాదం పట్ల చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుత కెనడా రక్షణ మంత్రిగా ఉన్న హర్జీత్‌సింగ్- ఖలిస్థాన్ మద్దతుదారనే విమర్శ ఉంది. 8 లక్షల మంది సిక్కుల్లో చాలా తక్కువమంది మాత్రమే ఖలిస్థాన్‌కు మద్దతిస్తుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.