China: పుట్టినిల్లును వణికిస్తున్న కరోనా

చైనాలో గత రెండేళ్లలో ఎప్పుడూ లేనంతగా తాజాగా అత్యధికంగా 16,400 కొత్త కేసులు వెలుగుచూశాయి........

Published : 06 Apr 2022 02:17 IST

బీజింగ్‌: పుట్టినిల్లు చైనాను కరోనా మహమ్మారి భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ ఆంక్షలు సడలిస్తోన్న వేళ.. చైనాలో మాత్రం వైరస్‌ ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతూ నిత్యం రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత రెండేళ్లలో ఎప్పుడూ లేనంతగా తాజాగా అత్యధికంగా 16,400 కొత్త కేసులు వెలుగుచూశాయి. కొత్త కేసుల్లో 13వేల కేసులు (దాదాపు 80 శాతం) ఆర్థిక రాజధాని షాంఘై నగరం నుంచే నమోదైనట్లు ఈ అక్కడి జాతీయ ఆరోగ్య కమిషన్‌ వెల్లడించింది. తొమ్మిది రోజుల క్రితం లాక్‌డౌన్‌ విధించినప్పటితో పోలిస్తే.. తాజా కేసుల సంఖ్య మూడు రెట్లు అధికంగా పెరగడం గమనార్హం.

షాంఘైలో లాక్‌డౌన్‌ విధించి భారీస్థాయిలో పరీక్షలు నిర్వహిస్తుండటంతో కొత్త కేసులు అంతే స్థాయిలో వెలుగుచూస్తున్నాయి. కేసుల పెరుగుదలతో లాక్‌డౌన్‌ను మరింతకాలం పొడిగిస్తున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఆర్థిక రాజధానిలో కఠిన ఆంక్షలు విధిస్తున్నామని, దాదాపు 2.5 కోట్ల మంది లాక్‌డౌన్‌లో ఉన్నారని అధికారులు తెలిపారు. వైరస్ ఉద్ధృతి తగ్గేవరకు లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. గ్వాంగ్‌డాంగ్, జిలిన్, షాన్‌డాంగ్ వంటి భారీ జనాభా గల ప్రావిన్సుల్లో 390 ప్రాంతాలను సాధారణ లేదా హై రిస్క్ ప్రాంతాలుగా ప్రకటించారు.

నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కఠిన నిబంధనలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఇంటి బయటకు రావడానికి కూడా వీల్లేదు. దీంతో ఇక్కడి వారు ఆహారం, తాగునీటిని కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి తెప్పించుకొంటున్నారు. కొన్ని రకాల ఆహార పదార్థాలు అసలు ఆన్‌లైన్‌లోనే ఉండకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

షాంఘైలో కరోనా ఉద్ధృతిని అడ్డుకునేందుకు ఆ దేశ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. ఈ మేరకు 2,000 మంది సైనిక వైద్య సిబ్బంది సహా 10,000 మంది ఆరోగ్య కార్యకర్తలను ఆ నగరానికి పంపించింది. చాలా కర్మాగారాలు, ఆర్థిక సంస్థలు తమ ఉద్యోగులను వేరుగా ఉంచుతూ కార్యకలాపాలు కొనసాగించగలిగినా.. లాక్‌డౌన్‌ పొడిగింపు కారణంగా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలు పడొచ్చనే ఆందోళనలు పెరుగుతున్నాయి. అధిక సాంక్రమిక శక్తి ఉన్న బీఏ.2 రకం.. ఒక్క కొత్త కేసు కూడా రాకూడదన్న (జీరో-కొవిడ్‌) చైనా విధానానికి పరీక్ష పెడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని