Denmark: క్షిపణి వ్యవస్థలో సమస్య.. కీలక సముద్ర మార్గం తాత్కాలిక మూసివేత..!

ఓ క్షిపణి వ్యవస్థలో సమస్య తలెత్తడంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఓ సముద్ర మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. 

Updated : 05 Apr 2024 14:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నాటో దేశమైన డెన్మార్క్‌(Denmark)కు చెందిన ఓ యుద్ధ నౌకపై ఉన్న మిసైల్‌ లాంచర్లో సమస్య తలెత్తింది. దీంతో దాని పరిధిలోకి వచ్చే గ్రేట్‌ బెల్ట్‌ జలసంధిని మూసేశారు. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గాల్లో ఇది కూడా ఒకటి. ‘‘కొన్ని రకాల పరీక్షల సమయంలో నౌకపై ఉన్న హర్పూన్‌ క్షిపణి వ్యవస్థ గురువారం యాక్టివేట్‌ అయింది. దీనిని ఇప్పటివరకు డీయాక్టివేట్‌ చేయలేదు. సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక బృందాలను రప్పిస్తున్నాం. బూస్టర్‌ను నిర్వీర్యం చేసేవరకు ముప్పు పొంచే ఉంటుంది. అది ఏక్షణమైనా గాల్లోకి ఎగిరి విధ్వంసం సృష్టించవచ్చు’’ అని డానిష్‌ మిలటరీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాకపోతే లాంచర్‌ గ్రేట్‌ బెల్ట్‌ వంతెన దిశగా లేదని తెలిపింది. ఆ ప్రాంతంలోని గగనతల మార్గాన్ని కూడా మూసివేశారు. 

డానిష్‌ ఆయుధ వ్యవస్థల్లో లోపాలు తలెత్తడం ఇదే తొలిసారి కాదు. మార్చి 9న ఎర్ర సముద్రంపై హూతీల దాడుల నుంచి జల మార్గాన్ని కాపాడేందుకు పంపిన ఇవర్‌ హ్యూట్‌ ఫీల్డ్‌ అనే ఫ్రిగెట్‌పై రాడార్‌, క్షిపణి వ్యవస్థలు మోరాయించాయి. సరిగ్గా హూతీల డ్రోన్‌ దాడి వేళ ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. నౌకపై ఉన్న ఆయుధాల్లో చాలావరకు లక్ష్యాన్ని చేరకముందే పేలిపోతున్నట్లు కమాండింగ్‌ ఆఫీసర్‌ రాసిన లేఖలో పేర్కొన్నాడు. ఈ విషయాలు ఆ దేశ రక్షణ దళాల చీఫ్‌ పౌల్సెన్‌కు తెలియవు. కానీ, అక్కడి పత్రికలు వీటికి సంబంధించిన కీలక సమాచారాన్ని బయటపెట్టడంతో ఆయన్ను పదవి నుంచి తప్పించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని