చైనా రక్షణ బడ్జెట్‌ 225 బిలియన్‌ డాలర్లు

చైనా తన రక్షణ బడ్జెట్‌ను ఆదివారం భారీగా 7.2 శాతం పెంచింది. ఇది యువాన్లలో 1.55 ట్రిలియన్లు కాగా డాలర్లలో 225 బిలియన్లు.

Updated : 06 Mar 2023 05:39 IST

గతేడాది కంటే 7.2 శాతం అధికం
భారత్‌తో పోలిస్తే మూడురెట్లు ఎక్కువ

బీజింగ్‌: చైనా తన రక్షణ బడ్జెట్‌ను ఆదివారం భారీగా 7.2 శాతం పెంచింది. ఇది యువాన్లలో 1.55 ట్రిలియన్లు కాగా డాలర్లలో 225 బిలియన్లు. చైనా రక్షణ బడ్జెట్‌ను పెంచడం వరుసగా ఇది 8వసారి. చైనా ఆర్థిక వృద్ధి రేటు కంటే రక్షణ బడ్జెట్‌ పెంపు రేటు అధికంగా ఉండటం గమనార్హం. గతేడాది 7.1 శాతం పెంపుతో 1.45 ట్రిలియన్ల(230 బిలియన్‌ డాలర్ల) బడ్జెట్‌ను ఆమోదించింది. యువాన్‌తో పోలిస్తే డాలర్‌ విలువ ఈ ఏడాది పెరిగిన నేపథ్యంలో 225 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు చైనా అధికార పత్రిక విశ్లేషించింది. ప్రపంచంలో అమెరికా రక్షణ బడ్జెట్‌ 2023 సంవత్సరానికి 816 బిలియన్‌ డాలర్లు. ఆ తరువాత అత్యధిక బడ్జెట్‌ చైనాదే కావడం గమనార్హం. భారత రక్షణ బడ్జెట్‌(రూ.5.94 లక్షల కోట్లు/72.6 బిలియన్‌ డాలర్లు)తో పోలిస్తే అది మూడు రెట్లు అధికం. దేశ రబ్బర్‌ స్టాంపు పార్లమెంటు నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ (ఎన్‌పీసీ) ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి పదవి నుంచి దిగిపోతున్న ప్రధాని లి కెకియాంగ్‌ తన స్వీయ నివేదిక సమర్పించారు. అందులో సరిహద్దుల్లో(తూర్పు లద్దాఖ్‌ ప్రతిష్టంభనను నేరుగా పేర్కొనకుండా) సైనిక బలగాలు చూపిన ధైర్యసాహసాలను గొప్పగా వివరించారు.

తైవాన్‌లో అమెరికా దళాల కార్యకలాపాలు పెరుగుతున్నట్లు వార్తలొస్తుండటంతో చైనా ఆందోళనకు గురవుతోంది. మరోవైపు తైవాన్‌ జలసంధిలో అమెరికా రాజ్య నౌకాదళం, వాయుసేనలు గస్తీలను ముమ్మరం చేయడం ఇబ్బందికరంగా భావిస్తోంది. గతేడాది ఆగస్టులో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించడం పెను సంచలనం సృష్టించింది. ఆ తర్వాత డ్రాగన్‌ తైవాన్‌ సమీపంలో భారీగా యుద్ధ విన్యాసాలను నిర్వహించింది. చైనా పదాతి దళం ప్రపంచంలోనే అతి పెద్దది. ఇది తమ సైనికులకు అత్యాధునిక ఆయుధాలు ఇవ్వడంపై, సరికొత్త స్టెల్త్‌  ఎయిర్‌క్రాఫ్ట్‌లు, విమానాలను సర్వీసుల్లో చేర్చుకోవడంపై తీవ్రంగా శ్రమిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని