సంక్షిప్త వార్తలు (4)
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతున్న వేళ.. కీలక ఐరాస భద్రతామండలి(యూఎన్‌ఎస్‌సీ) అధ్యక్ష బాధ్యతలు రష్యాకు దక్కాయి.
రష్యా చేతికి భద్రతామండలి పగ్గాలు
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతున్న వేళ.. కీలక ఐరాస భద్రతామండలి(యూఎన్‌ఎస్‌సీ) అధ్యక్ష బాధ్యతలు రష్యాకు దక్కాయి. యూఎన్‌ఎస్‌సీలో శాశ్వత సభ్య దేశమైన రష్యా.. ఏప్రిల్ నెలకుగానూ ఈ మేరకు బాధ్యతలు చేపట్టింది. ఈ పరిణామంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉక్రెయిన్, అమెరికాలు దీన్ని తప్పుబట్టాయి. రష్యా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం.. ప్రపంచంలోనే ‘చెత్త జోక్’ అని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా పేర్కొన్నారు. ‘దురదృష్టవశాత్తూ.. యూఎన్‌ఎస్‌సీలో రష్యా ఓ శాశ్వత సభ్యదేశం. దీన్ని మార్చేందుకు చట్టపరమైన మార్గాలు లేవు’ అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కెరీన్ జీన్ పెర్రీ వ్యాఖ్యానించారు. యూఎన్‌ఎస్‌సీ అధ్యక్ష హోదాలో రష్యా బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
ఏటా రూ.కోటి జీతం.. ఖర్చు పెట్టాలంటే అయిష్టం
వాషింగ్టన్: మార్కెట్లో ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో ఖర్చులు పోను జీతం మిగలడమే చాలామందికి కష్టంగా మారింది. అమెరికాకు చెందిన 29 ఏళ్ల టాన్నర్ ఫర్ల్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు అసలు డబ్బు ఖర్చు పెట్టడమంటేనే అలర్జీ అట. అందుకే ఈ వయసుకే అతడు రూ.3 కోట్లు పొదుపు చేయగలిగాడు. ఇలా దాచిన డబ్బుతో 35 ఏళ్లకే పదవీ విరమణ చేయాలన్నది టాన్నర్ ఫర్ల్ ఆలోచన. మిన్నియాపొలిస్ నగరంలో నివసించే టాన్నర్‌కు భార్య కూడా సరైన జోడీ దొరికింది. ఆమెకూ డబ్బు ఖర్చుపెట్టడమంటే ఇష్టముండదట. మరో ఆరేళ్లకు రిటైర్మెంటు అయ్యేనాటికి తన పొదుపును రూ.5 కోట్లకు పెంచాలని టాన్నర్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. జీతభత్యాల కింద ఏటా రూ.కోటి ఆదాయం ఉన్న ఈయన.. భార్య, ఓ కుమారుడితో జీవిస్తూ ఇంటి ఖర్చులు పోనూ మిగతా పొదుపు చేస్తున్నాడు. తాను పెరిగిన కుటుంబ వాతావరణం వల్ల చిన్నతనంలోనే డబ్బు విలువ తెలిసి, ఇలా సేవింగ్స్‌కు అలవాటుపడినట్లు టాన్నర్ చెబుతాడు.
కెనడాలో పడవ ప్రమాదంలో ఎనిమిదికి చేరిన మృతులు
టొరంటో: కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నంలో సెయింట్ లారెన్స్ నదిలో పడవ మునిగి చనిపోయినవారి సంఖ్య ఎనిమిదికి చేరింది. వీరిలో కొందరు భారతీయులు కూడా ఉన్న విషయం తెలిసిందే. ఆక్వేసస్నే సమీపంలోని నది ఒడ్డున శుక్రవారం రెండు మృతదేహాలు లభించినట్లు పోలీసులు తెలిపారు. ఆ పడవను నడిపిన కేసీ ఓక్స్(30) అనే వ్యక్తి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. అయితే, అతడు చనిపోయాడా? లేక బతికే ఉన్నాడా? అనే విషయం తెలియలేదని పోలీసులు తెలిపారు.
నేను ఆరోగ్యంగానే ఉన్నా: పోప్ ఫ్రాన్సిస్
రోమ్: శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది ఎదురవ్వడంతో ఆస్పత్రిలో చేరిన క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం మెరుగవ్వడంతో శనివారం ఆస్పత్రి నుంచి వాటికన్ సిటీకి పయనమయ్యారు. శ్వాస, ఊపిరితిత్తుల సమస్యలతో బుధవారం పోప్ ఫ్రాన్సిస్ రోమ్‌లోని జెమెల్లీ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి దగ్గర విలేకరులతో మాట్లాడుతూ ‘‘నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఆదివారం యథావిధిగా సెయింట్‌పీటర్స్ స్క్వేర్ నుంచి భక్తులను ఉద్దేశించి మాట్లాడతాను’ అని పోప్ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
రూ.99కే కొత్త సినిమా.. విడుదలైన రోజే ఇంట్లో చూసే అవకాశం
-
Ap-top-news News
జులై 20న విజయనగరంలో ‘అగ్నివీర్’ ర్యాలీ
-
India News
మృతదేహంపై కూర్చుని అఘోరా పూజలు
-
India News
దిల్లీలో బయటపడ్డ 2,500 ఏళ్లనాటి అవశేషాలు
-
Ts-top-news News
ధరణిలో ఊరినే మాయం చేశారు
-
Sports News
ఎంతో భావోద్వేగానికి గురయ్యా.. మరోసారి అలాంటి బాధ తప్పదనుకున్నా: సీఎస్కే కోచ్