బైడెన్‌ సర్కారుకు పెద్ద ఊరట

దివాలా అంచున ఉన్న అమెరికా ప్రభు త్వానికి పెద్ద ఊరట లభించింది. అప్పుల పరిమితి పెంపుపై గత కొద్దిరోజులుగా అధ్యక్షుడు జో బైడెన్‌, స్పీకర్‌ కెవిన్‌ మెకార్థీ మధ్య జరుగుతున్న సుదీర్ఘ చర్చలు శనివారం సాయంత్రానికి ఓ కొలిక్కి వచ్చాయి.

Published : 29 May 2023 05:23 IST

అప్పుల పరిమితి పెంపునకు రాజీ ఒప్పందం
కాంగ్రెస్‌ ఆమోదానికి తుదిగడువు జూన్‌ 5

వాషింగ్టన్‌: దివాలా అంచున ఉన్న అమెరికా ప్రభు త్వానికి పెద్ద ఊరట లభించింది. అప్పుల పరిమితి పెంపుపై గత కొద్దిరోజులుగా అధ్యక్షుడు జో బైడెన్‌, స్పీకర్‌ కెవిన్‌ మెకార్థీ మధ్య జరుగుతున్న సుదీర్ఘ చర్చలు శనివారం సాయంత్రానికి ఓ కొలిక్కి వచ్చాయి. అమెరికా రుణ గరిష్ఠ పరిమితి పెంపుపై బైడెన్‌, మెకార్థీ మధ్య రాజీ ఒప్పందం కుదిరింది. రెండేళ్లపాటు అప్పుల పరిమితి పెంపు, వ్యయ నియంత్రణపై సెనేట్‌లోని డెమోక్రాట్లు, ప్రతినిధుల సభలోని రిపబ్లికన్లు సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చారు. ఇరు పక్షాల నేతలు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. వారాల తరబడి సుదీర్ఘ చర్చల తర్వాత తాము ఓ ఒప్పందానికి వచ్చినట్లు స్పీకర్‌ కెవిన్‌ మెకార్థీ సైతం తెలిపారు. తాము ఇంకా చాలా పనిచేయాల్సి ఉందని.. ఈ ఒప్పందం అమెరికా ప్రజలకు ఎంతో విలువైనదని మెకార్థీ అన్నారు. తనతో సహా కాంగ్రెస్‌లోని డెమోక్రాట్ల కీలక ప్రాధాన్యాలు, చట్టపరమైన విజయాలను ఈ ఒప్పందం సంరక్షిస్తుందని అధ్యక్షుడు బైడెన్‌ తెలిపారు. దీన్ని రాజీపరమైన ఒప్పందంగా, పాలనాపరమైన బాధ్యతగా ఆయన పేర్కొన్నారు.

ఆమోదముద్ర లాంఛనం!

తాజా ఒప్పందానికి కాంగ్రెస్‌లోని తమ పార్టీ సహచరులతో బైడెన్‌, మెకార్థీ ఆమోదముద్ర వేయించాల్సి ఉంది. ప్రతినిధుల సభలో రిపబ్లికన్ల ఆధిపత్యం ఉండగా.. సెనెట్‌లో డెమోక్రాట్లకు పట్టుంది. ఒప్పందం జూన్‌ 5వ తేదీలోపు కాంగ్రెస్‌ ఆమోదం పొందాల్సి ఉంది. ఆ తర్వాత అధ్యక్షుడు సంతకం చేస్తే అది అమలులోకి వస్తుంది. 2021 నాటికి అమెరికన్‌ ప్రభుత్వం తీసుకున్న అప్పు 28.5 లక్షల కోట్ల డాలర్లకు (రూ.23,53,09,680 కోట్లు) చేరింది. యూఎస్‌ జీడీపీ కంటే ఇది 24 శాతం ఎక్కువ. ఇందులో ఎక్కువ మొత్తం దేశీయంగా వ్యక్తులు, సంస్థల నుంచి సేకరించగా.. దాదాపు 7 లక్షల కోట్ల డాలర్లను విదేశాల నుంచి సేకరించారు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ అప్పుల పరిమితి 31.4 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. ఈ పరిమితిని సైతం దాటి అప్పులు చేయడానికి బైడెన్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌ అనుమతి కోరుతోంది. కానీ, ప్రతినిధుల సభలో సంఖ్యాపరంగా ఆధిక్యంలో ఉన్న రిపబ్లికన్లు అప్పు పరిమితి పెంచేందుకు ససేమిరా అనడంతో అలజడి మొదలైంది. తాజాగా ఇరు పక్షాల మధ్య ఒప్పందం కుదరడం వల్ల ప్రస్తుతానికి దివాలా నుంచి అమెరికా బయటపడినట్లయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని