ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డ ఇరాన్‌

ఇరాన్‌ అన్నంత పనీ చేసింది. ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపణులతో శనివారం రాత్రి విరుచుకుపడింది. తద్వారా- ఇప్పటికే హమాస్‌పై దాడులతో అట్టుడుకుతున్న పశ్చిమాసియాలో మరింత అగ్గిరాజేసింది.

Published : 15 Apr 2024 04:55 IST

170 డ్రోన్లు, 150కి పైగా క్షిపణులతో దాడులు
అమెరికా, బ్రిటన్‌ల అండతో తిప్పికొట్టిన టెల్‌ అవీవ్‌
నష్ట తీవ్రత స్వల్పమే
ఆపరేషన్‌ ముగిసిందన్న టెహ్రాన్‌
ప్రతీకార దాడులు చేయాలనుకుంటున్న ఇజ్రాయెల్‌
వారిస్తున్న అమెరికా
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు

టెహ్రాన్‌/టెల్‌ అవీవ్‌: ఇరాన్‌ అన్నంత పనీ చేసింది. ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపణులతో శనివారం రాత్రి విరుచుకుపడింది. తద్వారా- ఇప్పటికే హమాస్‌పై దాడులతో అట్టుడుకుతున్న పశ్చిమాసియాలో మరింత అగ్గిరాజేసింది. తాజా దాడుల్లో ఇజ్రాయెల్‌కు పెద్దగా నష్టమేమీ సంభవించలేదు. ఇరాన్‌ ప్రయోగించిన వాటిలో 99శాతం డ్రోన్లు, క్షిపణులను అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ల సాయంతో ఆ దేశం సమర్థంగా నేలకూల్చింది. తాజా పరిణామంతో ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న ఇజ్రాయెల్‌ ఎదురుదాడులకు దిగితే ప్రాంతీయంగా పరిస్థితులు చేయిదాటేపోయే ముప్పుంది.

ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌

సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై ఇటీవల జరిగిన గగనతల దాడి ఇజ్రాయెల్‌ పనేనని ఇరాన్‌ భావిస్తోంది. ఆ దాడిలో ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ దళానికి చెందిన ఏడుగురు సైనికాధికారులు మృతి చెందారు. దానికి ప్రతీకారం తీర్చుకుంటామని కొన్ని రోజులుగా చెబుతున్న ఇరాన్‌.. శనివారం ఏకంగా 170 డ్రోన్లు, 30కి పైగా క్రూజ్‌, 120కి పైగా బాలిస్టిక్‌ క్షిపణులతో విరుచుకుపడింది. ‘ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌’ పేరుతో విడతల వారీగా డ్రోన్లను ప్రయోగించింది. తర్వాత సైనిక స్థావరాలే లక్ష్యంగా క్రూజ్‌, బాలిస్టిక్‌ క్షిపణులతో దాడి చేసింది. దీంతో ఇజ్రాయెల్‌ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా సైరన్లు మోగించి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రజలకు సూచించింది. ఇరాక్‌ గగనతలం మీదుగా వస్తున్న డ్రోన్లను బహుళ అంచెల రక్షణ వ్యవస్థతో కూల్చివేయడం ప్రారంభించింది. క్రూజ్‌ క్షిపణులనూ విజయవంతంగా అడ్డుకుంది. ‘ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌’లో ఇరాన్‌తో పాటు. ఆ దేశానికి మద్దతిస్తున్న లెబనాన్‌, సిరియా, ఇరాక్‌లోని మిలిటెంట్‌ సంస్థలూ పాల్గొన్నాయి. ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, రాకెట్ల వర్షం కురిపించాయి. వాటిని టెల్‌ అవీవ్‌ సమర్థంగా తిప్పికొట్టింది.

అండగా అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌

ఇరాన్‌ తొలుత డ్రోన్లు ప్రయోగించగానే ఇజ్రాయెల్‌కు అండగా అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జోర్డాన్‌ రంగంలోకి దిగాయి. అమెరికా 70 డ్రోన్లు, మూడు బాలిస్టిక్‌ క్షిపణులను కూల్చివేసింది. ఇరాన్‌ ప్రయోగించిన 120 బాలిస్టిక్‌ మిసైళ్లలో ఏడు మాత్రం లక్ష్యాలను తాకాయి. అండగా నిలిచినందుకు అమెరికా, ఇతర భాగస్వామ్య దేశాలకు ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి యోయావ్‌ గలాంట్‌ కృతజ్ఞతలు తెలిపారు. దాడి సమయంలో తమ గగనతలాన్ని మూసివేసిన ఇజ్రాయెల్‌ తర్వాత.. తెరిచింది.

దాడిని కొనసాగించే ఉద్దేశం లేదు: ఇరాన్‌

ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని ఆర్టికల్‌ 51 ప్రకారమే తాము దాడి చేసినట్లు ఇరాన్‌ పేర్కొంది. తమ ఆపరేషన్‌ విజయవంతమైందని, ఇక ఇజ్రాయెల్‌పై దాడి చేసే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని ఇరాన్‌ సైనిక దళాల అధిపతి జనరల్‌ మహమ్మద్‌ హుస్సేన్‌ బగేరి తెలిపారు. దాడుల నేపథ్యంలో ఇరాన్‌ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. జాతీయ జెండాలు పట్టుకుని రహదారులపై ర్యాలీలు నిర్వహించారు. దాడితో ఇజ్రాయెల్‌కు తగిన గుణపాఠం చెప్పామని ఇరాన్‌ ప్రధాని ఇబ్రహీం రైసీ వ్యాఖ్యానించారు.

సంయమనం పాటించాలి: ఐరాస

ప్రస్తుత పరిస్థితుల్లో పశ్చిమాసియా ప్రాంతంగానీ.. ప్రపంచంగానీ మరో యుద్ధాన్ని తట్టుకొనే స్థితిలో లేదని    ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడిని ఆయన ఖండించారు. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని సూచించారు. ఇరాన్‌ దాడులను అమెరికాతో పాటు బ్రిటన్‌ ఫ్రాన్స్‌, జర్మనీ, కెనడా కూడా ఖండించాయి. ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని ప్రకటించాయి.


‘99% కూల్చేశాం’

ఇరాన్‌ దాడుల్లో తమకు పెద్దగా నష్టం జరగలేదని ఇజ్రాయెల్‌ రియర్‌ అడ్మిరల్‌ డేనియల్‌ హగారి తెలిపారు. తమ దేశానికి చేరకముందే 99 శాతం డ్రోన్లు, క్షిపణులను నేలకూల్చినట్లు చెప్పారు. ఓ వైమానిక స్థావరానికి నష్టం కలిగినా, అక్కడ కార్యకలాపాలు యథావిధిగానే కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. క్షిపణి దాడిలో ఏడేళ్ల ఓ బాలికకు తీవ్ర గాయాలయ్యాయని ఇజ్రాయెల్‌ మీడియా పేర్కొంది.


భారత్‌ ఆందోళన

ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరగడంపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సంయమనం పాటించాలని ఇరు దేశాలకు విజ్ఞప్తి చేసింది. దౌత్య మార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. మారుతున్న పరిస్థితులను తాము నిశితంగా గమనిస్తున్నామని తెలిపింది. పశ్చిమాసియాలో నివసిస్తున్న భారతీయులతో స్థానిక రాయబార కార్యాలయాలు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాయని పేర్కొంది. ఈమేరకు విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్‌, ఇజ్రాయెల్‌లోని భారత పౌరులు జాగ్రత్తగా ఉండాలని మరోసారి హెచ్చరించింది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో టెల్‌ అవీవ్‌కు తాత్కాలికంగా విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ఎయిరిండియా ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సంస్థ దిల్లీ నుంచి టెల్‌ అవీవ్‌కు వారానికి నాలుగు విమానాలను నడుపుతోంది.


మనదేశంపై ప్రభావం ఎంత..?

పశ్చిమాసియాలో 85 లక్షల మంది భారతీయులు ఉన్నారు. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారితే వారిని అక్కడి నుంచి తరలించాల్సి ఉంటుంది. యుద్ధ పరిస్థితుల్లో ఇలాంటి ఆపరేషన్‌ చేపట్టడం అంత సులభం కాదు. దీనికి తోడు ఇజ్రాయెల్‌ కూడా ప్రతిదాడులు చేస్తే ఎర్రసముద్రంలో రవాణా నిలిచి చమురు ధరలు ఆకాశాన్నంటే ముప్పుంది.


ఇజ్రాయెల్‌కు జీ 7 దేశాల మద్దతు

ఇరాన్‌ దాడులు చేస్తున్న సమయంలో పరిస్థితిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సమీక్షించారు. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడారు. ‘‘భీకర దాడులను ఎదుర్కొని శత్రువును ఓడించడంలో ఇజ్రాయెల్‌ అద్భుత సామర్థ్యాన్ని చూపించింది. శత్రువులు తనను ఏమీ చేయలేరని చాటుకుంది. మేం ఇజ్రాయెల్‌కు ఉక్కు కవచంలా ఉండటానికి కట్టుబడి ఉన్నాం. ఇరాన్‌ ప్రయోగించిన అన్ని డ్రోన్లు, క్షిపణులను కూల్చివేయడానికి సాయం చేశాం’’ అని బైడెన్‌ పేర్కొన్నారు. ఈ అంశంపై ఆయన జీ7 దేశాధినేతలతోనూ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అనంతరం ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటిస్తూ జీ7 దేశాలు ప్రకటన విడుదల చేశాయి.


ప్రతిదాడి చేయొద్దు

మరోవైపు ప్రతీకారంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్‌.. ఇరాన్‌పై ఎదురుదాడి చేయాలని భావిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనను బైడెన్‌ తిరస్కరించారని, ఇరాన్‌పై నేరుగా దాడి చేస్తే తాము సహకరించబోమని నెతన్యాహుకు ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌ ప్రతిదాడికి పాల్పడితే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారతాయని అగ్రరాజ్యం ఆందోళన చెందుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని