దేవుళ్లు, ఆలయాల పేరుతో ఓట్లు.. మోదీపై పిటిషన్‌

దేవుళ్లు, ఆలయాల పేరుతో ప్రధాని మోదీ ఓట్లు అడుగుతున్నారని, ఎన్నికల్లో పోటీచేయకుండా ఆయనపై ఆరేళ్ల నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది.

Updated : 30 Apr 2024 05:58 IST

కొట్టివేసిన దిల్లీ హైకోర్టు

దిల్లీ: దేవుళ్లు, ఆలయాల పేరుతో ప్రధాని మోదీ ఓట్లు అడుగుతున్నారని, ఎన్నికల్లో పోటీచేయకుండా ఆయనపై ఆరేళ్ల నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ నెల 9న ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫీలీభీత్‌లో జరిగిన సభలో హిందూ, సిక్కు దేవుళ్లు, మందిరాలను ప్రస్తావిస్తూ ప్రధాని ఓట్లు అడిగారని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని అన్నారు. దీనిపై జస్టిస్‌ సచిన్‌ దత్తా స్పందిస్తూ.. ‘‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరిగిందని పిటిషనర్‌ ఊహించుకుంటున్నారు. ఇది సరికాదు. పిటిషనర్‌ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఈ కోర్టు నిర్దేశించలేదు. దీనిపై స్వతంత్ర నిర్ణయం తీసుకొనే హక్కు ఈసీకి ఉంది. ఆ నిర్ణయంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే చట్ట ప్రకారం తగిన పరిష్కారం కోరే హక్కు పిటిషనర్‌కు ఉంది’’ అని పేర్కొన్నారు. పిటిషన్‌ను పరిశీలించామని, త్వరలోనే ఈ అంశంపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ఎన్నికల సంఘం తరఫున హాజరైన న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని