Ukraine Crisis: ‘బుచా’ దారుణాలు.. రష్యాపై కఠినంగా వ్యవహరించిన జర్మనీ

ఉక్రెయిన్‌లో రష్యా చేస్తోన్న మారణహోమాన్ని ప్రపంచ దేశాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. ఆ హింసాకాండను నమ్మశక్యం కానీ క్రూరత్వం అని ఖండించిన జర్మనీ.. తన దేశంలోని 40 మంది రష్యా దౌత్యవేత్తలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది.

Updated : 05 Apr 2022 15:22 IST

సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరించిన మాస్కో

బెర్లిన్‌: ఉక్రెయిన్‌లో రష్యా చేస్తోన్న మారణహోమాన్ని ప్రపంచ దేశాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. ఆ హింసాకాండను నమ్మశక్యం కానీ క్రూరత్వం అని ఖండించిన జర్మనీ.. తన దేశంలోని 40 మంది రష్యా దౌత్య సిబ్బందిని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే జర్మనీ చర్యను రష్యా తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది ఇరుదేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించింది.

‘జర్మనీలో వివిధ విభాగాల్లో ఉన్న రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించడం వల్ల మన ద్వైపాక్షిక సంబంధాల్లో అంతరాయం ఏర్పడుతుంది. ఇది ఇరు దేశాల సంబంధాల్లో క్షీణతకు దారితీస్తుంది. బుచా ఘటనలపై స్వతంత్ర దర్యాప్తు జరిగేవరకు ఆగకుండా జర్మనీ కీవ్‌కు మద్దతుగా నిల్చుంది. ఈ క్రమంలో బెర్లిన్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని  తోసిపుచ్చుతున్నాం’ అని జర్మనీలోని రష్యా రాయబార కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. 40 మంది దౌత్య సిబ్బందిని దేశం విడిచి వెళ్లిపోవాలని జర్మనీ చెప్పినట్లు ధ్రువీకరించింది. ఫ్రాన్స్‌, లిథువేనియా కూడా ఈ తరహా చర్యలే తీసుకున్నాయి.

కీవ్‌కు సమీపంలోని బుచా పట్టణంలో ఇటీవల బయటకు వచ్చిన దృశ్యాలతో ప్రపంచం కలతచెందింది. రష్యా సైన్యం సామాన్య పౌరుల చేతులు కట్టేసి, తలపై కాల్చి హతమార్చినట్లు వాటి ద్వారా వెల్లడవుతోంది. అలాగే ఆ ప్రాంత వీధుల్లో దాదాపు 400 శవాలు కనిపించగా.. ఆ మృతదేహాలను పూడ్చిపెట్టేందుకు 45 అడగుల పొడవైన గుంతను తవ్వినట్లు శాటిలైట్ చిత్రాలు చూపిస్తున్నాయి. ఇక బాలికలు, మహిళలపై లైంగికదాడి జరిపి హతమార్చుతున్నట్లు ఉక్రెయిన్‌ ఎంపీలు ఆరోపించారు. కాగా, ఈ హింసాకాండను అన్ని దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అలాగే రష్యాను మరింత కట్టడి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ విషయంలో రష్యా గ్యాస్‌పై ఆధారపడినప్పటికీ ఐరోపా దేశాలు వెనక్కి తగ్గడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని