Sri lanka crisis: ‘ఆ నలుగురు’.. నరకం చూపించారు

వారు నలుగురు అన్నదమ్ములు.. కలసికట్టుగా ఉంటారు.. రాజకీయాల్లో రాణిస్తుంటారు.. అలా అని ప్రజలకు ఎలాంటి సాయం చేయరు..

Published : 10 Jul 2022 01:49 IST


(గొటబాయ రాజపక్స)

ఇంటర్నెట్‌ డెస్క్‌, ప్రత్యేకం: వారు నలుగురు అన్నదమ్ములు.. కలసికట్టుగా ఉంటారు.. రాజకీయాల్లో రాణిస్తుంటారు.. అలా అని ప్రజలకు ఎలాంటి సాయం చేయరు.. తమ కుటుంబ ఆస్తులను పెంచుకునేందుకు నిత్యం యత్నిస్తుంటారు. చివరకు తమను నమ్ముకున్న దేశ ప్రజలకు కనీసం అన్నం కూడా పెట్టలేదు.. ఆఖరికి ఆకలిమంటల్లో అల్లాడుతున్న ప్రజలు తిరుగుబాటు చేయడంతో పలాయనం చిత్తగించారు. ఇదంతా మన పొరుగు దేశమైన శ్రీలంకలో రాజపక్స సోదరులు సాగించిన దోపిడీ పర్వం. ఒకప్పుడు వైభవంగా వెలిగిన వీరు గొటబాయ రాజపక్స(Gotabaya rajapaksa) పారిపోవడంతో నియంత పోకడలతో పాలన సాగిస్తే ఎప్పటికైనా శంకరగిరి మాన్యాలు పట్టవలసిందేనన్న సత్యానికి తాజా ఉదాహరణగా మిగిలారు..

కుటుంబ పెత్తనం... నిర్విరామ దోపిడీ

శ్రీలంక రాజకీయాల్లో రాజపక్సలది కీలకస్థానం. 2009లో మహిందా రాజపక్స తమిళ వేర్పాటు ఉగ్రవాద సంస్థ ఎల్టీటీఈని పూర్తిగా నిర్మూలించడంతో  సింహళ జాతీయవాదులు ఆయనకు మద్దతుగా నిలిచారు. మహిందాతో పాటు ఆయన సోదరులైన చమల్‌, బసిల్‌, గొటబాయలు  కీలక బాధ్యతలు నిర్వహించారు. అయితే తమకు ఎదురులేదన్న రీతిలో వారు పాలించారు. చైనా నుంచి పెట్టుబడుల ప్రవాహం సాగింది. తమ సొంత ప్రాంతమైన హంబన్‌టోటాలో భారీ నౌకాశ్రయాన్ని డ్రాగన్‌ సౌజన్యంతో నిర్మించారు. అయితే చెల్లింపులు చేయలేకపోవడంతో చివరకు 99 ఏళ్ల లీజుకు చైనాకు ధారదత్తం చేశారు. అయితే మహిందా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా నుంచి వచ్చిన పెట్టుబడుల్లో అధిక భాగాన్ని ఆయన సోదరులతో పాటు కుటుంబం ఇతర దేశాలకు తరలించినట్టు అక్కడి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

గొటబాయ ‘వైట్‌ వ్యాన్లు’

అన్న అధ్యక్షుడిగా ఉన్న సమయంలో గొటబాయ రాజపక్స అప్రకటిత సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించారు. తమిళ పులులపై యుద్ధం నేపథ్యంలో ఆయన నేతృత్వంలో సైన్యం సాగించిన దాష్టీకాలపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. ఆ సమయంలో ప్రభుత్వంపై ఎవరు విమర్శించినా తెల్లవ్యాన్లలో సాయుధులు వచ్చి కిడ్నాప్‌లు చేసేవారు. అనంతరం అదృశ్యమైన వారి ఆచూకీ తెలిసేది కాదు. కిడ్నాప్‌లకు గురైన వారిని దారుణంగా హింసించి హత్య చేసినట్టు పలు సంస్థలు ఆరోపించాయి.

సేంద్రియ సేద్యం కోసం ప్రాణాలను పణంగా పెట్టారు..

2015లో శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మహిందా పరాజయం పాలయ్యారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మైత్రిపాల సిరిసేన బాధ్యతలు చేపట్టారు.  రణిల్‌ ప్రధానిగా ఉన్నా వారి మధ్య విభేదాలు తలెత్తాయి. తరవాత 2019 అధ్యక్ష ఎన్నికల్లో మహిందా సోదరుడు గొటబాయ అధ్యక్షుడిగా ఎన్నికయయారు.  శ్రీలంక వ్యవసాయదేశం. అయితే సేంద్రియ ఎరువులతోనే వ్యవసాయం చేయాలంటూ గొటబాయ ఆదేశాలు జారీ చేయడంతో ఇతర దేశాల నుంచి వచ్చే ఎరువులు ఆగిపోయాయి. ఫలితంగా పంటలు ఎక్కువ దిగుబడి ఇవ్వలేదు. ఈ కారణంతోనే వ్యవసాయ దిగుబడి తగ్గిపోయింది. ప్రజలు ఆహార పదార్థాల కోసం రోడ్లపైకి రావడంతో అశాంతి ఏర్పడింది. తన సోదరులపై ఆరోపణలు రావడంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా మహీందా, చమల్‌, బాసిల్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే దేశంలో అరాచకానికి కారణం గొటబాయ అని ఆయన గద్దె దిగాలని ఆందోళనలు చేపట్టారు. చివరకు ప్రజాగ్రహం అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టడంతో పలాయనం చిత్తగించారు.

ఇప్పుడు ఏం జరుగుతుంది?

రాజపక్స సోదరులు వెళ్లిపోయినా ఇంకా చైనా రుణ ఊబి, ఆర్థిక ప్రతిబంధకాలు, విదేశీ చెల్లింపులు లేకపోవడం, ఆహార ధాన్యాల భద్రత లేకపోవడం.. తదితర అంశాలు  పరిష్కారం కాకుండా ఉన్నాయి. ప్రధానిగా ఉన్న రణిల్‌ విక్రమసింఘే పాలనాపరంగా అనుభవం ఉన్నా తక్షణ ఉపశమనం ఆయన చేతుల్లో లేదు. శ్రీలంకకు భారత్‌ ఇప్పటికే వేలాది కోట్ల డాలర్లను అందజేయడంతో పాటు పెట్రోల్‌, ఆహార ఉత్పత్తులను సరఫరా చేస్తోంది.  ఒకప్పుడు దక్షిణాసియాలో అన్ని అంశాల్లో ముందంజలో ఉండేది. అయితే జాతీయవాదం, చైనాకు దగ్గర కావడంతో పాటు రాజపక్స సోదరుల అవినీతి దేశాన్ని నాశనం చేసింది.  పాలకులు చేసిన గాయాల నుంచి కోలుకునేందుకు శ్రీలంకకు దశాబ్దాలు పట్టవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని